Heavy Rains: ఈ జిల్లాల్లో మళ్లీ భారీ వర్షాలు..
ABN , Publish Date - Nov 23 , 2025 | 06:44 PM
ఉపరితల ఆవర్తన ప్రభావంతో నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక ప్రాంతాల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వివరించింది. సోమవారం ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.
అమరావతి, నవంబర్ 23: ఆంధ్రప్రదేశ్‌ను వరుణుడు వీడడం లేదు. రాష్ట్రంలో ఎక్కడో అక్కడ వర్షాలు పడుతూనే ఉన్నాయి. దక్షిణ అండమాన్ సముద్రంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ ఆదివారం వెల్లడించింది. ఇది పశ్చిమ - వాయవ్య దిశగా కదులుతూ సోమవారానికి ఆగ్నేయ బంగాళాఖాతం ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. తదుపరి 48 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఇది తుఫానుగా బలపడే అవకాశం ఉందని తెలిపింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో మంగళవారం నాటికి నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక ప్రాంతాల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వివరించింది.
సోమవారం అంటే.. నవంబర్ 24వ తేదీన ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రైతులకు సూచించింది. ఈ మేరకు ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది.