CM Chandrababu Foreign Tour: విదేశీ పర్యటనకు సీఎం చంద్రబాబు.. ముహూర్తం ఫిక్స్..
ABN , Publish Date - Oct 01 , 2025 | 06:41 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనకు ముహూర్తం ఖరారు అయింది. సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనకు అనుమతి ఇస్తూ.. జీఏడీ పోలిటికల్ సెక్రటరీ ఎం.కె. మీనా బుధవారం నాడు ఆదేశాలు జారీ చేశారు.
అమరావతి, అక్టోబర్ 01: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనకు ముహూర్తం ఖరారు అయింది. అక్టోబర్ 22 నుంచి 24వ తేదీ వరకు దుబాయ్, అబుదాబి, యూఏఈలలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నం వేదికగా పార్టనర్ షిప్ సమ్మిట్ -2025 జరగనుంది. ఈ సమ్మిట్‌కు విదేశీ పెట్టుబడుదారులను ఆహ్వానించేందుకు ఆయా దేశాల్లో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. రియల్ ఎస్టేట్స్, భవన నిర్మాణం, లాజిస్టిక్స్ తదితర రంగాల్లో పెట్టుబడులను సీఎం చంద్రబాబు ఆహ్వానించనున్నారు.
అలాగే రవాణా, ఫైనాన్స్ సర్వీసెస్, ఇన్నోవేషన్స్ రంగాల్లో సైతం పెట్టుబడుదారులకు ఆయన స్వాగతం పలకనున్నారు. ఈ విదేశీ పర్యటనకు సీఎం చంద్రబాబు వెంట మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్దన్ రెడ్డిలతోపాటు పరిశ్రమలు, పెట్టుబడులు, ఏపీఐఐసీ విభాగాలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు వెళ్లనున్నారు. సీఎం చంద్రబాబు చేస్తున్న ఈ విదేశీ పర్యటనకు జీఏడీ పొలిటికల్ సెక్రటరీ ముకేష్ కుమార్ మీనా బుధవారం అనుమతులు ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధే లక్ష్యంగా చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. రాజధాని అమరావతితోపాటు.. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల అభివృద్ధి కోసం సర్కార్ కీలకంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా సీఎం చంద్రబాబు విదేశాల్లో పర్యటిస్తూ.. రాష్ట్రాభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఆ క్రమంలో ఇప్పటికే సింగపూర్, దావోస్‌లో సైతం ఆయన పర్యటించారు.
విశాఖపట్నం వేదికగా నవంబర్‌లో జరగనున్న ఈ సమ్మిట్‌కు వివిధ దేశాల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలను ఇప్పటికే ఆహ్వానించారు. మరోవైపు ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణపాటు పలువురు ఉన్నతాధికారులు ప్రస్తుతం దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటన సందర్భంగా ఆ దేశ ప్రభుత్వాధికారులతోపాటు పారిశ్రామికవేత్తలతో ఈ ప్రతినిధి బృందం వరుస భేటీలు నిర్వహిస్తోంది.