Share News

CM Chandrababu: ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో అదే జరిగింది: సీఎం చంద్రబాబు..

ABN , Publish Date - Feb 08 , 2025 | 04:38 PM

అమరావతి: ఢిల్లీ ఎన్నికల్లో పీపుల్స్ ఫస్ట్ అనే నినాదం వర్కౌట్ అయ్యిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆ నినాదమే బీజేపీని గెలిపించిందని ముఖ్యమంత్రి చెప్పారు.

CM Chandrababu: ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో అదే జరిగింది: సీఎం చంద్రబాబు..
AP CM Chandrababu Naidu

అమరావతి: ఢిల్లీ ఎన్నికల్లో 27 ఏళ్ల తర్వాత బీజేపీ విజయం చరిత్రాత్మకమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. పీపుల్స్ ఫస్ట్ అనే నినాదం అక్కడి ఎన్నికల్లో వర్కౌట్ అయ్యిందని, ఆ నినాదమే బీజేపీని గెలిపించిందని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రధాని మోదీపై నమ్మకంతోనే దేశ రాజధానిలో బీజేపీ గెలిచిందని చంద్రబాబు తెలిపారు. ఢిల్లీలో వాయు కాలుష్యం పెద్ద సమస్యగా మారిందని, ఢిల్లీ నుంచి చాలామంది ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. సంపద సృష్టిస్తేనే ఆదాయం పెరుగుతుందని, మౌలికవసతులు వస్తాయని అన్నారు. సుపరిపాలన ఇస్తే మంచి రాజకీయాలకు నాంది పలుకుతుందని చెప్పారు. 1991 తర్వాత దేశంలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయని, వాటిని తెలుగుబిడ్డ మాజీ ప్రధాని పీవీ నరసింహరావు తీసుకొచ్చారని పేర్కొ్న్నారు. 1995-2024 మధ్య మన తలసరి ఆదాయం 9 రెట్లు పెరిగినట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు.


తెలుగు రాష్ట్రాల్లో 3 వేల డాలర్ల తలసరి ఆదాయం ఉందని, బిహార్‌లో అది ఇంకా 750 డాలర్లుగానే ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. టెక్నాలజీ సాయంతో మనం ముందుకెళ్లామని, మనకు ఐటీ, మౌలిక వసతులు గేమ్‌ఛేంజర్‌గా మారాయని సీఎం చెప్పుకొచ్చారు. సరైన సమయంలో సరైన నాయకత్వం చాలా కీలకమైన విషయమని, భారత్‌కు సరైన సమయంలో వచ్చిన సరైన నాయకుడు మోదీ అని చంద్రబాబు కొనియాడారు. స్థిరమైన పాలన, పాలసీలు, గ్రోత్.. గుజరాత్ అభివృద్ధికి కారణం అయ్యాయని, కొందరు నేతలు సంక్షేమం పేరుతో అవినీతికి పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు.


అలాంటి నేతల కారణంగా రాజకీయాల్లో కాలుష్యం పెరుగుతోందని చంద్రబాబు మండిపడ్డారు. ఆప్ పాలనలో ఢిల్లీలో ఎక్కడ చూసినా చెత్త పేరుకుపోయిందని, కొన్ని విధానాలతో అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ మారిందని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ పరిశుభ్రతను ఆప్ ప్రభుత్వం పట్టించుకోలేదని, లిక్కర్ స్కామ్‌లో చిక్కుకున్న ఎవ్వరూ బాగుపడలేదని అన్నారు. ఏపీ, ఢిల్లీలో ప్రజల ఆకాంక్షలను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని, ఓటేసిన పాపానికి ప్రజల భవిష్యత్‌ను కాటేశారని ముఖ్యమంత్రి ధ్వజమెత్తారు. సంపద సృష్టించలేని, ప్రభుత్వానికి ఆదాయం పెంచలేని నేతలు ఎందుకంటూ చంద్రబాబు ప్రశ్నించారు. ఏపీలో జగన్ రుషికొండ ప్యాలెస్ కడితే.. ఢిల్లీలో కేజ్రీవాల్ శీష్‌మహల్ కట్టారని మండిపడ్డారు. ఏపీలో బటన్ నొక్కే వ్యక్తికి ప్రజలు విరామం ఇచ్చారని అన్నారు. అలాగే ఇప్పుడు ఢిల్లీ ప్రజలు తప్పు తెలుసుకుని కష్టాల నుంచి బయటపడ్డారని చంద్రబాబు చెప్పుకొచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Pawan Kalyan: ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం.. పవన్ కల్యాణ్ రియాక్షన్ ఇదే..

Delhi Elections 2025: బీజేపీ ఘన విజయం.. తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖుల రియాక్షన్..

Updated Date - Feb 08 , 2025 | 05:06 PM