AP News: రాజధానిలో భూకేటాయింపులపై మంత్రుల కమిటీ భేటీ.. కీలక నిర్ణయాలు ఇవే..
ABN , Publish Date - Mar 10 , 2025 | 06:48 PM
గత టీడీపీ ప్రభుత్వం 2014-19 మధ్య రాజధాని అమరావతి నిర్మాణం కోసం దాదాపు 34 వేల ఎకరాలు సేకరించిందని మంత్రి నారాయణ తెలిపారు. ఈ భూముల్లో రాజధాని నిర్మించేందుకు రూ.43 వేల కోట్ల విలువైన పనులకు టెండర్లు సైతం పిలిచినట్లు గుర్తు చేశారు.

అమరావతి: రాజధాని అమరావతిలో భూముల కేటాయింపుపై ఆంధ్రప్రదేశ్ మంత్రుల కమిటీ భేటీ ముగిసింది. అమరావతి ప్రాంతంలో గత టీడీపీ హయాంలో 131 సంస్థలకు భూములు కేటాయించినట్లు మంత్రి పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ప్రస్తుతం వారిలో 31 సంస్థలకు యథాతథంగా భూములు కేటాయించామని, 13 మందికి మాత్రం రద్దు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. రెండు సంస్థలకు గతంలో కేటాయించిన భూములు కాకుండా వేరే చోట ఇవ్వాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. మరో 16 సంస్థలకు స్థలంతోపాటు పరిధినీ మార్చాలని తీర్మానించినట్లు నారాయణ వెల్లడించారు. కాగా, మంత్రి నారాయణ నేతృత్వంలో భేటీ అయిన మంత్రుల కమిటీలో పయ్యావుల కేశవ్, కొల్లు రవీంద్ర, టీజీ భరత్, కందుల దుర్గేశ్ ఉన్నారు.
గత టీడీపీ ప్రభుత్వం 2014-19 మధ్య రాజధాని అమరావతి నిర్మాణం కోసం దాదాపు 34 వేల ఎకరాలు సేకరించిందని మంత్రి నారాయణ తెలిపారు. ఈ భూముల్లో రాజధాని నిర్మించేందుకు రూ.43 వేల కోట్ల విలువైన పనులకు టెండర్లు సైతం పిలిచినట్లు గుర్తు చేశారు. దాదాపు రూ.9 వేల కోట్ల విలువైన పనులు చేపట్టినట్లు చెప్పుకొచ్చారు. అయితే ఆ తర్వాత అధికారం చేపట్టిన వైసీపీ సర్కార్.. రాజధానితో ఆటలాడిందని, ప్రజల మనోభావాలు దెబ్బతీసిందని మంత్రి ధ్వజమెత్తారు. కక్ష సాధించడమే లక్ష్యంగా రాజధానిని మూడు ముక్కలు చేసే ప్రయత్నం చేసిందని ఆగ్రహించారు. వారి దుష్టపాలనలో రాజధాని అభివృద్ధి ఒక్క అడుగూ ముందుకు సాగలేదని చెప్పుకొచ్చారు. తాజాగా కూటమి అధికారం చేపట్టడంతో అమరావతి మళ్లీ ఊపిరిపోసుకుందని అన్నారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో తాజాగా రూ.48 వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచినట్లు వెల్లడించారు. వాటిని ఓపెన్ చేశామని, మరో రెండ్రోజుల్లో అగ్రిమెంట్ ప్రక్రియ కూడా పూర్తవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఆ వెంటనే పనులు సైతం ప్రారంభం అవుతాయని తెలిపారు.
మరో మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ.." అమరావతి అభివృద్ధి సీఆర్డీయే చూసుకుంటుంది. సీఆర్డీయేనే నిధులు సేకరించి ఖర్చు చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా సపోర్టు చేస్తుంది. అమరావతి కోసం ఖర్చు చేసే డబ్బు ఎక్కడికో పోతుందని ఏపీ ప్రజలు బాధ పడాల్సిన అవసరం లేదు. అమరావతి సెల్ఫ్ సస్టేయినింగ్ ప్రాజెక్ట్. రాజధానిలో పెట్టే ప్రతి రూపాయి మళ్లీ తిరిగి వస్తుంది. సీఆర్డీయేనే రాజధానిని అభివృద్ధి చేస్తుంది. ఆ తర్వాత ప్లాట్లను అమ్మి నిధులు సేకరిస్తుంది. వాటి ద్వారా రాజధాని కోసం తెచ్చిన అప్పులు మెుత్తం చెల్లిస్తుంది. సీఆర్డీయేను అలా డిజైన్ చేశాం. ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ భూ కేటాయింపు జరుగుతోంది. ఎవరైతే పనులు ప్రారంభించడానికి సిద్ధంగా లెరో వారి భూములు మాత్రం రద్దవుతాయని" చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Vamsi Case: వల్లభనేని వంశీ కోరికను అంగీకరించిన జైలు అధికారులు
Anitha: జగన్ పాలన అలా ఉంది.. హోం మంత్రి అనిత ధ్వజం