Animal Rights Violations : కుక్కల కుటుంబ నియంత్రణలో.. కాసుల కక్కుర్తి
ABN , Publish Date - Jan 18 , 2025 | 06:01 AM
గుంటూరు నగర పరిధిలోని కుక్కల కుటుంబ నియంత్రణ ఆపరేషన్లలో భారీ అవినీతి జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి. కుక్కల చర్మంపై గాటు పెట్టి ఆపరేషన్లు చేసినట్లు చూపడం..

గుంటూరు కార్పొరేషన్‌లో లక్షలు స్వాహా!
అనుభవం లేని పశువైద్యులతో ఆపరేషన్లు
శునకాల చర్మంపై కత్తి గాటుతో బిల్లులు!
నగరంలో వందలకొద్దీ కుక్కల మృత్యువాత
‘స్నే’ యానిమల్ వెల్ఫేర్ సొసైటీపై ఆరోపణలు
గుర్తింపు రద్దు చేసినా కొనసాగింపుపై విమర్శలు
గుంటూరు సిటీ, జనవరి 17(ఆంధ్రజ్యోతి): గుంటూరు నగర పరిధిలోని కుక్కల కుటుంబ నియంత్రణ ఆపరేషన్లలో భారీ అవినీతి జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి. కుక్కల చర్మంపై గాటు పెట్టి ఆపరేషన్లు చేసినట్లు చూపడం.. అనుభవం లేని పశువైద్యులతో ఆపరేషన్లు చేయించడం.. ఆ తర్వాత తగిన చికిత్స అందించకపోవడంతో వందలాది కుక్కలు మృత్యువాతపడ్డాయి. ఈ వ్యవహారంలో లక్షల రూపాయలు స్వాహా అయినట్లు తెలుస్తోంది. దీనిపై ‘స్నే’ యానిమల్ వెల్ఫేర్ సొసైటీకి డబ్బులు చెల్లిస్తున్న కార్పొరేషన్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం, పశుసంవర్థక శాఖ కూడా పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్న నేపథ్యంలో విమర్శలు వస్తున్నాయి. నగర పాలక సంస్థ పరిధిలో 2024 జూన్ 13న యానిమల్ బర్త్ కంట్రోల్ కార్యక్రమం ప్రారంభమైంది. ఇది నిబంధనలకు విరుద్ధంగా నడిచిందనే ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై కేంద్ర జంతు కల్యాణ మండలికి ఫిర్యాదులు వెళ్లాయి. తనిఖీలు చేపట్టిన కేంద్రం బృందం.. కుక్కలకు ఆపరేషన్లు చేసే కేంద్రాన్ని డంపింగ్ యార్డు వద్ద నిర్వహించడంపై ఆక్షేపించింది. అసలు ఎన్ని కుక్కలకు ఆపరేషన్లు చేశారనే దానిపై రికార్డుల నిర్వహణ సక్రమంగా లేదని గుర్తించింది. ఏబీసీ రూల్ 17 ప్రకారం అవయవాల లెక్క వేయలేదని నిర్ధారించారు. నిబంధనలు పాటించని కారణంగా స్నే సంస్థ గుర్తింపును రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ లేఖను జంతు సంక్షేమ బోర్డ్ డిసెంబరు 24న కార్పొరేషన్‌కు పంపింది. అయినా అదే సంస్థతో గుంటూరు నగర పాలక సంస్థ ఇంకా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయిస్తూ ఉండటం మరింత విమర్శలకు తావిస్తోంది.
సొంతంగా చేయించుకున్న వాటికీ బిల్లులు
కొంతమంది జంతు ప్రేమికులు సొంత ఖర్చులతో కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించారు. వాటిని కూడా స్నే సంస్థ ఖాతాలో వేశారు. అసలు ఎన్ని కుక్కలకు ఆపరేషన్లు జరిగాయన్న దానిపై సరైన రికార్డులు లేకుండానే నిధుల చెల్లింపులు జరిగినట్లు తెలుస్తోంది. కుటుంబ నియంత్రణ చెయ్యాల్సిన కుక్కలు నగరంలో 31 వేల వరకు ఉన్నట్లు అంచనా. వాటిలో 5 వేల కుక్కలకు ఆపరేషన్ చేసినట్లు చెబుతున్నారు. దానికి రూ.75 లక్షలు చెల్లించాల్సి ఉండగా, చాలా వరకు నిధులు మంజూరు చేసినట్లు సమాచారం. అయితే ఈ చెల్లింపుల సమాచారాన్ని నగర పాలక సంస్థ గోప్యంగా ఉంచుతోంది.
5 వేల ఆపరేషన్లకు రూ.75 లక్షలు
గుంటూరు, పల్నాడు, బాపట్ల, తూర్పు, పశ్చిమగోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో కుక్కల కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల బాధ్యతను హర్యానాకు చెందిన స్నే యానిమల్ వెల్ఫేర్ సొసైటీకి అప్పగించారు. ఒక్కో ఆపరేషన్‌కు స్థానిక సంస్థలు రూ.1500 వరకు చెల్లిస్తున్నాయి. నిబంధనల ప్రకారం 2 వేల ఆపరేషన్లు చేసి న సీనియర్ పశువైద్యుడితో ఈ శస్త్రచికిత్స చేయించాలి. అయితే దీనికి విరుద్ధంగా గుంటూరులో గ్రీన్ హెల్త్ అంబులెన్స్‌లో విధులు నిర్వహిస్తున్న జూనియర్ పశువైద్యురాలితో ఆపరేషన్లు చేయించారనే ఆరోపణలున్నాయి. ఆపరేషన్ తర్వాత మగ కుక్కను 4-5 రోజులు, ఆడ కుక్కను 5-7 రోజులు ఆస్పత్రిలోనే ఉంచాలి. అదేమీలేకుండానే బయటకు వదిలిపెట్టడంతో ఇన్ఫెక్షన్‌తో కుక్కలు మరణించినట్లు జంతు సంరక్షణ కమిటీ సభ్యుడు జాగు సురేష్ ఆరోపిస్తున్నారు.