Cocoa Farmers: ప్రభుత్వం నిర్ణయించిన ధరకే కోకో గింజల కొనుగోలు
ABN , Publish Date - Jun 29 , 2025 | 06:14 AM
రాష్ట్రంలో కోకో రైతుల సమస్య దాదాపు పరిష్కారమైంది. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు పలు కంపెనీలు కోకో గింజలు కొనుగోలు చేస్తున్నాయి.
కిలోకు రూ.500 చెల్లిస్తున్న కంపెనీలు
అమరావతి, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కోకో రైతుల సమస్య దాదాపు పరిష్కారమైంది. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు పలు కంపెనీలు కోకో గింజలు కొనుగోలు చేస్తున్నాయి. కిలోకు రూ.500 చొప్పున కంపెనీలు రైతులకు చెల్లిస్తే.. అందులో రూ.50 సదరు కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చెల్లిస్తోంది. ఈ ఏడాది కోకో ధరలు పడిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో ప్రభుత్వం జోక్యం చేసుకుని, కనీస మద్దతు ధరను నిర్ణయించింది. అయినా అన్ని కంపెనీలు, వ్యాపారులు కోకో గింజల కొనుగోలుకు ముందుకు రాకపోవడంతో సీఎం చంద్రబాబు ధరలపై సమీక్ష జరిపారు. సేకరణ ధరలో కిలోకి రూ.50 ప్రభుత్వం భరిస్తుందని ప్రకటించారు.
మంత్రి అచ్చెన్నాయుడు పలు దఫాలు చర్చలు జరిపి మాండలీస్, డీపీ చొకొలెట్స్ వంటి కంపెనీలను ఈ మేరకు ఒప్పించారు. దీంతో ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, కాకినాడ, మన్యం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన 3,394 మంది రైతుల నుంచి 2,228 టన్నుల కోకో గింజలను కొనుగోలు చేయగా.. ఇందుకోసం ప్రభుత్వం రూ.3 కోట్లు విడుదల చేసిందని ఉద్యానశాఖ డైరెక్టర్ శ్రీనివాసులు శనివారం తెలిపారు.