Share News

Barrack Request: ఏ, బీ కేటగిరీ బ్యారక్‌ కేటాయించండి

ABN , Publish Date - May 16 , 2025 | 04:51 AM

మద్యం కుంభకోణంలో అరెస్టైన గోవిందప్ప బాలాజీ జైలులో మౌలిక సదుపాయాలు కల్పించాలంటూ ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు. అదే కేసులో సజ్జల శ్రీధర్‌రెడ్డి, దిలీప్‌లను సిట్ అధికారులు కస్టడీకి తీసుకుని విచారించారు.

 Barrack Request: ఏ, బీ కేటగిరీ బ్యారక్‌ కేటాయించండి

  • కోర్టులో గోవిందప్ప బాలాజీ పిటిషన్‌

విజయవాడ, మే 15(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణంలో అరెస్టయిన గోవిందప్ప బాలాజీ జైల్లో తనకు మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. ఈ మేరకు ఆయన తరఫు న్యాయవాది జి.నరసింహారావు(జీఎన్‌ఆర్‌) విజయవాడ ఏసీబీ కోర్టులో గురువారం పిటిషన్‌ వేశారు. జైల్లో ఏ, బీ కేటగిరీ బ్యారక్‌ కేటాయించాలని, ఇంటి నుంచి భోజనాన్ని అనుమతించాలని, నిద్రపోవడానికి మంచం, దిండు ఏర్పాటు చేయాలని, దోమల నుంచి రక్షణగా కాయిల్‌ వెలిగించుకోవడానికి అనుమతి ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీన్ని పరిశీలించిన న్యాయాధికారి పి.భాస్కరరావు ఇంటి నుంచి భోజనాన్ని ఎవరికీ అనుమతించడం లేదని స్పష్టం చేశారు. బయట నుంచి కూరగాయలు కొనుగోలు చేసుకుంటే పిటిషనరే జైల్లో వంట చేసుకోవచ్చని సూచించారు. మంచం, దిండు, దోమల కాయిల్‌ను అనుమతిస్తామని తెలిపారు. ఏ, బీ కేటగిరి బ్యారక్‌లకు సంబంధించిన మాన్యువల్‌ను అందజేయాలని న్యాయవాదిని అడిగారు. ఈ మాన్యువల్‌ ఎక్కడా అందుబాటులో లేదని నరసింహారావు వివరించారు. తదుపరి వాదనలను 19వ తేదీకి వాయిదా వేశారు.

సిట్‌ కస్టడీకి సజ్జల శ్రీధర్‌రెడ్డి, దిలీప్‌

మద్యం కేసులో విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్న సజ్జల శ్రీధర్‌రెడ్డి, రాజ్‌ కసిరెడ్డి పీఏ దిలీ్‌పను సిట్‌ అధికారులు గురువారం కస్టడీకి తీసుకున్నారు. ఇద్దరినీ ప్రభుత్వాస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించిన అనంతరం సిట్‌ కార్యాలయానికి తీసుకెళ్లి వేర్వేరుగా విచారించారు. అనంతరం వారిని జైలుకు తరలించారు. గురువారంతో దిలీప్‌ కస్టడీ ముగిసింది. శ్రీధర్‌రెడ్డి కస్టడీ మరో రెండు రోజులు కొనసాగుతుంది. కాగా, శ్రీధర్‌రెడ్డి, దిలీప్‌ బెయిల్‌ పిటిషన్లపై విజయవాడ ఏసీబీ కోర్టులో గురువారం విచారణ జరిగింది. శ్రీధర్‌రెడ్డి పిటిషన్‌పై 20న, దిలీప్‌ పిటిషన్‌పై 16న కౌంటర్‌ దాఖలు చేయాలని న్యాయాధికారి పి.భాస్కరరావు ప్రాసిక్యూషన్‌ను ఆదేశించారు.

Updated Date - May 16 , 2025 | 04:52 AM