Share News

AP Govt : రైతుబజార్లలో సబ్జీ కూలర్లు!

ABN , Publish Date - Feb 10 , 2025 | 06:12 AM

పండ్లు, కూరగాయలు, పూలు నిల్వ చేయడంతో పాటు వాటి సహజ పక్వానికి ఈ కూలర్లు ఉపయోగపడతాయి.

AP Govt : రైతుబజార్లలో సబ్జీ కూలర్లు!

  • పండ్లు, కూరగాయలు పాడవకుండా నిల్వ.. గుంటూరులో పైలట్‌

అమరావతి, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా రైతుబజార్లలో సబ్జీ కూలర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పండ్లు, కూరగాయలు, పూలు నిల్వ చేయడంతో పాటు వాటి సహజ పక్వానికి ఈ కూలర్లు ఉపయోగపడతాయి. పండ్లు, కూరగాయల్లో పోషక విలువలు కూడా సంరక్షింపబడతాయి. త్వరగా పాడైపోయే టమాటా, దోస, క్యాప్సికం వంటి కూరగాయలతో పాటు ఆకుకూరలు 3-5రోజులు ఈ కూలర్లలో నిల్వ చేయవచ్చు. వెంటనే పాడవ్వని క్యారెట్‌, బీట్రూట్‌, ముల్లంగి వంటివి వారం పాటు నిల్వ చేయవచ్చు. ఒక్కొక్కటి రూ.27లక్షల విలువైన సబ్జీ కూలర్లలో 50% ఉద్యానశాఖ సబ్సిడీ ఇవ్వనుంది. 50% రైతుబజార్లలో స్టాల్స్‌ నిర్వాహకులైన స్వయం సహాయక బృందాల సభ్యులు, రైతు ఉత్పత్తిదారు బృందాలు, రైతు సహకార సంఘాలు భరించాల్సి ఉంటుంది. ముంబై ఐఐటీ నిపుణులు అభివృద్ధి చేసిన సబ్జీ కూలర్లలో మహారాష్ట్రలోని రుకార్డ్‌ టెక్నాలజీ సంస్థ 100, 50, 25కిలోల సామర్ధ్యం గల కూలర్లను సరఫరా చేస్తోంది. పైలట్‌గా గుంటూరు చుట్టగుంట రైతుబజార్‌లో 100కిలోల సామర్థ్యం గల సబ్జీ కూలర్‌ను ఏర్పాటు చేశారు. అలాగే చిత్తూరు, తిరుపతి జిల్లా రైతు బజార్లలో ప్రత్యేక కార్యక్రమం కింద 13 కూలర్లు ఇస్తుండగా, విజయవాడ 3, విశాఖ 2, తిరుపతి, రాజమండ్రి, గుంటూరు రైతుబజార్లలో ఒక్కొక్కటి ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలోని అన్ని రైతుబజార్లలో త్వరలో వీటిని ఏర్పాటు చేయనున్నారు.


మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News

Updated Date - Feb 10 , 2025 | 06:12 AM