Nandyal District : గ్యాస్ లీకై పేలుడు
ABN , Publish Date - Jan 29 , 2025 | 05:22 AM
గ్యాస్ లీకై రెండు ఇళ్లు నేలమట్టమయ్యాయి. మరో ఇంటి స్లాబ్ కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా 9 మంది తీవ్రంగా గాయపడ్డారు.
కుప్పకూలిన రెండిళ్లు.. నాయనమ్మ, మనవడి దుర్మరణం
9 మందికి గాయాలు, రూ.24 లక్షల ఆస్తి నష్టం
నంద్యాల జిల్లా చాపిరేవులలో ఘటన
నంద్యాల క్రైం, జనవరి 28(ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లా నంద్యాల మండలం చాపిరేవుల గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున ఇంట్లో గ్యాస్ లీకై రెండు ఇళ్లు నేలమట్టమయ్యాయి. మరో ఇంటి స్లాబ్ కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. గ్రామానికి చెందిన వెంకటమ్మ(62), ఆమె కుమారులు సుబ్బరాయుడు, లింగమయ్య మూడు ఇళ్లు నిర్మించుకొని నివసిస్తున్నారు. మంగళవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో వెంకటమ్మ లైట్ ఆన్ చేశారు. అప్పటికే గ్యాస్ లీకవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఇల్లు కుప్పకూలింది. దీంతో వెంకటమ్మ అక్కడికక్కడే మృతి చెందారు. ఘటన జరిగిన ఇంటిని ఆనుకొని ఉన్న సుబ్బరాయుడు ఇంటి శ్లాబ్ కుప్పకూలడంతో ఆయన కుమారుడు దినేష్(10) అక్కడికక్కడే మరణించాడు. సుబ్బరాయుడు, భార్య రామలక్ష్మి, కుమారుడు కార్తీక్‌తో పాటు అత్త సుబ్బమ్మ, బావమరిది రాములు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి లింగమయ్య ఇల్లు కూడా కుప్పకూలింది. లింగమయ్యతో పాటు ఆయన భార్య వెంకటేశ్వరమ్మ, కుమారులు సుశాంత్, సుధీర్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. నంద్యాల రూరల్ తహసీల్దార్ పత్తి శ్రీనివాసులు, తాలుకా సీఐ ఈశ్వరయ్య, అగ్నిమాపక దళ అధికారి యోగేశ్వరరెడ్డి శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలు వెలికితీసి, క్షతగాత్రులను నంద్యాల, కర్నూలు ఆస్పత్రులకు తరలించారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.24 లక్షల ఆస్తినష్టం జరిగిందని అగ్నిమాపక దళ అధికారి తెలిపారు.
For AndhraPradesh News And Telugu News