Share News

Cannabis Smuggling: పుష్ప తరహాలో గంజాయి స్మగ్లింగ్‌

ABN , Publish Date - May 30 , 2025 | 03:52 AM

ఒడిశా నుంచి హైదరాబాద్‌కు గంజాయి 730 కిలోలు లారీ క్యాబిన్‌లో రహస్య అరలో తరలిస్తున్న డ్రైవర్‌ను తూర్పుగోదావరిలో పోలీసులు అరెస్టు చేశారు. రూ.22 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు, Hyderabad నుండి ఇద్దరు కుట్రాకారులను వెతుకుతున్నారు.

Cannabis Smuggling: పుష్ప తరహాలో గంజాయి స్మగ్లింగ్‌

  • లారీ క్యాబిన్‌లోని రహస్య అరలో బస్తాలు

  • ఒడిశా నుంచి హైదరాబాద్‌కు తరలిస్తుండగా పట్టివేత

  • లారీ సహా రూ.22 లక్షల విలువైన 730 కిలోల గంజాయి స్వాధీనం

దేవరపల్లి, మే 29(ఆంధ్రజ్యోతి): పుష్ప సినిమాలో.. పాల ట్యాంకరు అరలో గంధం చెక్కలు తరలించినట్లుగా.. నిజ జీవితంలోనూ ఓ లారీ డ్రైవర్‌ ప్రయత్నించాడు. లారీ క్యాబిన్‌లో సీటు వెనుక ప్రత్యేక అర తయారు చేయించి, అందులో గంజాయి బస్తాలు తరలిస్తూ పోలీసులకు దొరికిపోయాడు. ఒడిశా నుంచి హైదరాబాద్‌కు ఇలా గంజాయి తరలిస్తున్న లారీని తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్‌ను అరెస్టు చేశారు. గురువారం జరిగిన మీడియా సమావేశంలో సీఐ బి.నాగేశ్వర్‌నాయక్‌ ఈ కేసు వివరాలు వెల్లడించారు. హైదరాబాద్‌కు చెందిన కర్రే శ్రీశైలంకు ఏపీ16టీఎక్స్‌ 5319 నంబర్‌ లారీ ఉంది. ఒడిశాలోని మల్కన్‌గిరి ప్రాంతానికి వెళ్లి గంజాయి తీసుకువస్తే ఎక్కువ మొత్తంలో డబ్బులిస్తామని హైదరాబాద్‌కు చెందిన నర్సిరెడ్డి, యాదయ్య అనే ఇద్దరు అతడితో డీల్‌ కుదుర్చుకున్నారు. శ్రీశైలం.. ఒడిశా వెళ్లి, లారీ క్యాబిన్‌లో తన సీటు వెనుక.. అరలో గంజాయి బస్తాలను నింపేశాడు. అయితే ఈనెల 24న సాయంత్రం దేవరపల్లి మీదుగా వెళ్తూ.. గోల్డెన్‌ఫిష్ దాబా దగ్గర హైవేపై మోటర్‌సైకిల్‌ను ఢీకొట్టాడు. బైక్‌పై ఉన్న ఇద్దరు మరణించడంతో, భయపడి లారీతో సహా పరారయ్యాడు. కొవ్వూరు-నల్లజర్ల జాతీయ రహదారి సర్వీసు రోడ్డు పక్కన యర్నగూడెం శివారులోని ఓ ఇటుక బట్టీ వద్ద లారీని పార్కింగ్‌ చేశాడు. ఈ క్రమంలో ఈనెల 28న పోలీసులకు ఈ లారీపై ఉప్పందింది. పరిసర ప్రాంతాల్లో గాలించి చివరికి లారీని గుర్తించారు. అందులో రూ.22లక్షల విలువైన 730కిలోల 18 గంజాయి బస్తాలను స్వాధీనం చేసుకుని, డ్రైవర్‌ను అరెస్టు చేశారు. అతడిపై గంజాయి రవాణాచేస్తూ పట్టుబడినట్టుగా చౌటుప్పల్‌ పోలీస్‌స్టేషన్‌లో 2023లో కేసు నమోదు కాగా, ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నాడు. ఈ కేసులో గంజాయి తేవాలని ఒప్పందం చేసుకున్న హైదరాబాద్‌కు చెందిన నర్సిరెడ్డి, యాదయ్యలను అరెస్టు చేయాల్సి ఉందని పోలీసులు తెలిపారు. నిందితుడిని కొవ్వూరు కోర్టుకు తరలిస్తున్నామని తెలిపారు.

Updated Date - May 30 , 2025 | 03:54 AM