Share News

Vallabhaneni Vamsi : ఇంటి భోజనం అనుమతించండి

ABN , Publish Date - Feb 18 , 2025 | 04:05 AM

జైలులో ఉన్న తనకు ఇంటి భోజనాన్ని అనుమతించాలని గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కోర్టును కోరారు.

Vallabhaneni Vamsi : ఇంటి భోజనం అనుమతించండి

  • జైలు గదిలో మంచం ఇప్పించండి.. కోర్టును అభ్యర్థించిన వల్లభనేని వంశీ

  • బెయిల్‌ కోరుతూ మరో పిటిషన్‌ దాఖలు.. వంశీని కస్టడీకి ఇవ్వాలన్న పోలీసులు.. నేటికి తదుపరి విచారణ వాయిదా

  • రెండు గంటలు.. ఏకాంతంగా..

  • వంశీ కేసులో న్యాయాధికారి సమక్షంలో బాధితుడు సత్యవర్ధన్‌ వాంగ్మూలం

  • వంశీని కస్టడీకి ఇవ్వాలన్న పోలీసులు

విజయవాడ, అమరావతి, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి) : విజయవాడ జిల్లా జైలులో ఉన్న తనకు ఇంటి భోజనాన్ని అనుమతించాలని గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కోర్టును కోరారు. జైలులో తనకు కొన్ని సదుపాయాలు కావాలని కోరుతూ విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టులో సోమవారం పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లో పలు అంశాలను ఆయన తరపున న్యాయవాది పేర్కొన్నారు. వంశీ వెన్నునొప్పితో బాధపడుతున్నారని, ఆయనకు నిద్రపోవడానికి మంచం ఏర్పాటు చేయించాలని కోరారు. అదేవిధంగా ఆరోగ్య కారణాల రీత్యా ఇంటి నుంచి భోజనాన్ని అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. దీంతోపాటు బెయిల్‌ మంజూరు చేయాలని మరోపిటిషన్‌ దాఖలు చేశారు. కాగా, గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడికి ప్రత్యక్ష సాక్షి, ప్రధాన ఫిర్యాదుదారు సత్యవర్థన్‌ను బెదిరించి, కిడ్నాప్‌ చేసిన కేసులో వల్లభనేని వంశీని పది రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టులో సోమవారం పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణను ఎస్సీ, ఎస్టీ కోర్టు న్యాయాధికారి హిమబిందు మంగళవారానికి వాయిదా వేశారు.


  • ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టుకు వంశీ

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి, గన్నవరం పీఎసీఎస్‌ మాజీ అధ్యక్షుడు కాసరనేని వెంకటపాండురంగారావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా 2024 జనవరి 21న గన్నవరం పోలీసులు నమోదు చేసిన కేసులో తనకు ముందుస్తు బెయిల్‌ మంజూరు చేయాలంటూ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సోమవారం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పాండురంగారావుపై జరిగిన దాడి ఘటనతో తనకు సంబంధం లేదన్నారు. రాజకీయ కారణాలతో తనను ఈ కేసులో నిందితుడిగా చేర్చే అవకాశం ఉందన్నారు. అందువల్ల ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని కోరారు. కాగా, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మరో ముగ్గురు లొంగిపోయారు. ఆ కేసులో ఉన్న ఏ-47 షేక్‌ ఎంఎం కలాం, ఏ-55 షేక్‌ సర్దార్‌ జానీ, ఏ-68 రాచేటి రూతుమ్మ స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో సరెండర్‌ అయ్యారు.

  • రెండు గంటలు.. ఏకాంతంగా..

  • న్యాయాధికారి సమక్షంలోసత్యవర్ధన్‌ వాంగ్మూలం

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసులో బాధితుడు ముదునూరి సత్యవర్ధన్‌ వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసింది. అందరినీ బయటకు పంపి ఏకాంతంగా... రెండు గంటల పాటు విజయవాడ రెండో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్డి కోర్టులో న్యాయాధికారి అప్పారావు ఆయన వాంగ్మూలం నమోదుచేశారు. సీఆర్పీసీ 164 ప్రకారం ఈ ప్రక్రియను పూర్తిచేశారు. పోలీసులు సత్యవర్ధన్‌ను కోర్టుకు తీసుకువచ్చారు. మధ్యాహ్నం తర్వాత ఆయనను న్యాయాధికారి పిలిచారు. తన వద్ద కూర్చోబెట్టుకుని సత్యవర్ధన్‌ చెప్పిన వివరాలను నమోదు చేసుకున్నారు.

Updated Date - Feb 18 , 2025 | 04:06 AM