Share News

CID Court : రిమాండ్‌లో మరో రిమాండ్‌

ABN , Publish Date - Mar 04 , 2025 | 03:49 AM

ముదునూరి సత్యవర్ధన్‌ కిడ్నాప్‌ కేసులో రిమాండ్‌లో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరో రిమాండ్‌ పడింది.

 CID Court : రిమాండ్‌లో మరో రిమాండ్‌

  • టీడీపీ ఆఫీస్‍పై దాడి కేసులోనూ వంశీకి

  • 17వరకు రిమాండ్‌ విధించిన సీఐడీ కోర్టు

  • కిడ్నాప్‌ కేసులో ఇప్పటికే జైలులో మాజీ ఎమ్మెల్యే

విజయవాడ, మార్చి 3(ఆంధ్రజ్యోతి) : ముదునూరి సత్యవర్ధన్‌ కిడ్నాప్‌ కేసులో రిమాండ్‌లో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరో రిమాండ్‌ పడింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో ఆయనకు ఈ నెల 17వ తేదీ వరకు విజయవాడలోని సీఐడీ కోర్టు రిమాండ్‌ విధించింది. టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వంశీ 71వ నిందితుడు. దీనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను గన్నవరం పోలీసులు నమోదు చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం ఈ కేసును సీఐడీకి బదిలీ చేసింది. ఈ కేసులో ఉన్న నిందితుల బెయిల్‌ పిటిషన్లపై విచారణ సమయంలో టీడీపీ కార్యాలయం దళితులకు చెందిన ఆస్తి కాదని, కడియాల సీతారామయ్య అనే వ్యక్తికి చెందినదని, ఆయన దళితుడు కాదని న్యాయవాదులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణ కోర్టు ముందు వాదించారు. దానికి సంబంధించిన ఆధారాలను చూపించారు. న్యాయాధికారి హిమబిందు ఈ కేసులో ఉన్న అట్రాసిటీ సెక్షన్లను తొలగించి, నిందితులకు బెయిల్‌ తిరస్కరించారు. అనంతరం కేసును సీఐడీ కోర్టుకు బదిలీ చేశారు. తర్వాత ఈ కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న సత్యవర్ధన్‌ను కిడ్నాప్‌ చేసి, బెదిరించిన కేసులో వంశీని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడిలో వంశీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించడంతో సీఐడీ పోలీసులు పీటీ వారంట్‌ దాఖలు చేశారు. దీన్ని విచారించిన సీఐడీ కోర్టు న్యాయాధికారి తిరుమలరావు వంశీని వర్చువల్‌గా హాజరుపరచాలని జైలు అధికారులను ఆదేశించారు. వంశీకి ఈనెల 17 వరకు రిమాండ్‌ విధించారు. సత్యవర్ధన్‌ను బెదిరించి, కిడ్నాప్‌ చేసిన కేసులో మరో ఇద్దరు నిందితులను ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణ కోర్టు రెండు రోజుల పోలీసు కస్టడీకి ఇచ్చింది.


‘బ్యారక్‌ మార్పు’ కాపీలు అందజేయండి

విజయవాడలోని జిల్లా కారాగారంలో ఉన్న వంశీ దాఖలు చేసిన బ్యారక్‌ మార్పు పిటిషన్‌ కాపీలను పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌కు అందజేయాలని న్యాయాధికారి హిమబిందు కోర్టు సిబ్బందిని ఆదేశించారు.

వంశీపై మరో కేసు

వంశీ, అతని అనుచరులపై మరో కేసు గన్నవరం పోలీ్‌సస్టేషన్‌లో సోమవారం రాత్రి నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని చిక్కవరం బ్రహ్మయ్యలింగం చెరువు అభివృద్ధి ముసుగులో వేలాది లారీల మట్టిని అక్రమంగా తరలించారని రేవూరి శివరామకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు తెలిపారు.

Updated Date - Mar 04 , 2025 | 03:49 AM