Textile Industry : పెట్టుబడులకు మరో ఐదు సంస్థలు సిద్ధం
ABN , Publish Date - Feb 18 , 2025 | 04:29 AM
ఢిల్లీలో జరుగుతున్న ఇంటర్నేషనల్ భారత్ టెక్స్-2025లో మంత్రి సోమవారం పాల్గొన్నారు. ఎగ్జిబిషన్‌లో ఏపీ స్టాల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు దేశ, విదేశీ
టెక్స్‌టైల్ పరిశ్రమల ఏర్పాటుకు ఆసక్తి
2 వేల కోట్ల పెట్టుబడికి సుముఖత
త్వరలోనే ప్రభుత్వంతో ఎంవోయూలు
చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత వెల్లడి
ఢిల్లీలోని భారత్ టెక్స్‌లో ఏపీ స్టాల్ సందర్శన
పలువురు పెట్టుబడిదారులతో భేటీ
అమరావతి/న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో టెక్స్‌టైల్‌రంగంలో పరిశ్రమల స్థాపనకు ఐదు సంస్థలు ముందుకొచ్చాయని, ఆ సంస్థలు రూ. 2 వేల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నాయని చేనేత, జౌళిశాఖ మంత్రి ఎస్.సవిత వెల్లడించారు. ఢిల్లీలో జరుగుతున్న ఇంటర్నేషనల్ భారత్ టెక్స్-2025లో మంత్రి సోమవారం పాల్గొన్నారు. ఎగ్జిబిషన్‌లో ఏపీ స్టాల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు దేశ, విదేశీ పెట్టుబడిదారులతో మంత్రి సమావేశమయ్యారు. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నేతృత్వంలో పరిశ్రమల ఏర్పాటుకు తీసుకుంటున్న చర్యల గురించి, చేనేత రంగంలో అవకాశాలు గురించి వివరించారు. పలు సంస్థల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చలు జరిపారు. అడ్వాన్స్ టెక్స్‌టైల్స్ అసోషియేషన్, ఐటీఎంఎఫ్, మాస్కో చాంబర్స్ ఆఫ్ కామర్స్ సహా మరో రెండు సంస్థల ప్రతినిధులు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సుముఖత వ్యక్తం చేశారు. త్వరలోనే పెట్టుబడులపై ఏపీ ప్రభుత్వంతో ఎంవోయూలు చేసుకోవడానికి రాష్ట్రానికి రానున్నట్లు ఆ సంస్థల ప్రతినిధులు తెలిపారు. కర్ణాటకకు చెందిన ప్రతినిధులు ఎమ్మిగనూరు టెక్స్‌టైల్ పార్క్‌లో పెట్టుబడులకు ఆసక్తి చూపినట్లు మంత్రి వెల్లడించారు. రష్యాలో టెక్స్‌టైల్ వేర్‌హౌస్ ఏర్పాటుకు ఏపీకి చెందిన గుంటూరు టెక్స్‌టైల్ పార్క్ అంగీకారం తెలిపిందని పేర్కొన్నారు.
నేతన్నలకు ఉపాధికి సీఎం కృషి
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో చేనేత రంగం కుదేలైందని మంత్రి సవిత అన్నారు. ఢిల్లీలోని ఏపీభవన్‌లో మీడియాతో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో చేనేతలకు ఉపాధి కల్పించేందుకు సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి దార్శనిక నాయకత్వంలో రాష్ట్రంలో పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపిస్తున్నారన్నారు. ఏపీలో టెక్స్‌టైల్ పరిశ్రమల స్థాపనకు ఐదుగురు పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారని, మరిన్ని పెట్టుబడులు ఆకర్షించేందుకు త్వరలో పారిశ్రామికవేత్తలతో సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. హిందూపూర్ నియోజకవర్గంలో 2 వేల మందికి ఉపాధికల్పించేలా రూ. 500 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఓ పారిశ్రామికవేత్త సంసిద్ధత వ్యక్తం చేశారని చెప్పారు.