MLC Elections : పెద్దల పోరులో గెలుపెవరిదో?
ABN , Publish Date - Feb 27 , 2025 | 02:51 AM
తొలిసారి జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల సమరంలో గెలుపెవరిదన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఉమ్మడి కృష్ణా-గుంటూరు, ఉమ్మడి ఉభయగోదావరి పట్టభద్రుల...
సార్వత్రిక ఎన్నికల అనంతరం తొలి సమరం
ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్న కూటమి
పట్టభద్రుల స్థానాల్లో టీడీపీ పోటీ.. టీచర్ సీటులో ఏపీటీఎఫ్‌కు మద్దతు
కృష్ణా-గుంటూరు, ఉమ్మడి గోదావరిలో ద్విముఖ పోటీ
ఉత్తరాంంధ్రలో త్రిముఖ పోరు.. ఎన్నికల్లో పోటీకి వైసీపీ దూరం..
కానీ పీడీఎఫ్ అభ్యర్థులకు లోపాయకారీ మద్దతు?
అమరావతి, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): సార్వత్రిక ఎన్నికల అనంతరం తొలిసారి జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల సమరంలో గెలుపెవరిదన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఉమ్మడి కృష్ణా-గుంటూరు, ఉమ్మడి ఉభయగోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలతోపాటు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి గురువారం పోలింగ్ జరుగనుంది. రెండు పట్టభద్రుల స్థానాలకు పాలక టీడీపీ కూటమి తరఫున తెలుగుదేశం అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి కూటమి అభ్యర్థులను నిలుపలేదు. ఇక్కడ ఏపీటీఎఫ్ తరఫున బరిలో ఉన్న సిటింగ్ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మకు మద్దతు ప్రకటించింది. వైసీపీ ఈ ఎన్నికలకు దూరంగా ఉంది. బహిరంగంగానూ ఎవరికీ మద్దతు ప్రకటించలేదు. అయితే పట్టభద్రుల స్థానాల్లో మాత్రం లోపాయకారీగా ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫోరం(పీడీఎ్‌ఫ)కు సహకరిస్తోంది. ఇక్కడ పీడీఎఫ్ అభ్యర్థులు గెలిస్తే.. ఆ విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని.. ఓడిపోతే మాత్రం తామెవరికీ మద్దతివ్వలేదని చెప్పాలన్నది ఆ పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. సార్వత్రిక ఎన్నిక ల అనంతరం జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో అధికార కూటమి ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని వ్యూహాత్మకంగా పనిచేస్తోంది. పట్టభద్రుల స్థానాల్లో తలపడుతున్న ఇద్దరు టీడీపీ అభ్యర్థుల అభ్యర్థుల గెలుపు కోసం మూడు పార్టీలకు చెందిన మంత్రులు, కూటమి ఎమ్మెల్యేలు కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు.
కృష్ణా-గుంటూరులో ఇద్దరి నడుమే!
కృష్ణా-గుంటూరు పట్టభద్రుల స్థానంలో 25 మంది బరిలో ఉన్నా.. ప్రధాన పోటీ మాత్రం టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్, పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు నడుమే నెలకొంది. ఆలపాటి తెనాలి నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి మూడుసార్లు గెలుపొందారు. మంత్రిగా కూడా పనిచేశారు. రెండు జిల్లాల ప్రజలకు సుపరిచితుడు. లక్ష్మణరావు గతంలో మూడు సార్లు కృష్ణా-గుంటూరు ఉపాధ్యాయుల స్థానం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆలపాటి అభ్యర్థిత్వాన్ని టీడీపీ చాలా ముందుగానే ప్రకటించింది. దీంతో ఆయన ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లడానికి తగిన సమయం లభించింది. ఈ స్థానంలో సుమారు 3.47 లక్షల ఓటర్లు ఉండగా వారిలో 8 వేల మంది ఇతర ప్రాంతాల్లో ఉన్నారు. వారి ఓట్లు అభ్యర్థుల గెలుపులో కీలక పాత్ర పోషించనున్నాయి. వీరిని ఆకర్షించడంపై అభ్యర్థులిద్దరూ దృష్టి సారించారు. అధిక శాతం ఉద్యోగ, ఉపాధ్యాయ యూనియన్ల మద్దతు కూడగట్టడంలో లక్ష్మణరావు ముందున్నారు.
గోదావరిలో పేరాబత్తుల వర్సెస్ రాఘవులు
ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల స్థానంలో మొత్తం 35 మంది బరిలో ఉన్నారు. వీరిలో టీడీపీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్, పీడీఎఫ్ అభ్యర్థి డీవీ రాఘవులే ప్రధానంగా పోటీపడుతున్నారు. ఇద్దరూ కొత్తగా బరిలోకి దిగుతుండడం గమనార్హం. ఇక్కడసుమారు 3.14 లక్షల మంది ఓటర్లు ఉండగా.. వీరిలో ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్ల సంఖ్య 25 వేల వరకు ఉంది. పోలింగ్ రోజు వీరిని తీసుకొచ్చి ఓట్లు వేయించడంపై కూట మి పార్టీలు దృష్టి సారించాయి.
ఉత్తరాంధ్రలో రఘువర్మకు చాన్సు?
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 10 మంది అభ్యర్థులు పోటీబడుతున్నారు. ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొంది. ఏపీటీఎఫ్ నుంచి పాకలపాటి రఘువర్మ, పీఆర్‌టీయూ తరఫున గాదె శ్రీనివాసులునాయుడు, యూటీఎఫ్ నుంచి కోరెడ్ల విజయగౌరి బరిలో ఉన్నారు. రఘువర్మకు టీడీపీతోపాటు జనసేన, బీజేపీ కూడా మద్దతు ఇస్తున్నాయి. అయితే కొందరు బీజేపీ నాయకులు శ్రీనివాసులునాయుడికి మద్దతు ఇస్తున్నారు. వైసీపీ ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఎవరికీ మద్దతు ప్రకటించలేదు. రఘువర్మకు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.
కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి
పోలింగ్‌కు సిద్ధమవుతూనే మార్చి 3న జరిగే కౌంటింగ్‌కూ ఏర్పాట్లు చేసింది. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం ఓట్ల లె క్కింపును సీఆర్‌ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలోను, కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్లను గుంటూరులోని ఆంధ్ర క్రైస్తవ కళాశాలలోనూ, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ విశాఖపట్నంలోని ఆంరఽధ యూనివర్శిటీలోనూ జరగనుంది.