CM Chandrababu Naidu: ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ కార్డు
ABN , Publish Date - Aug 29 , 2025 | 04:20 AM
రాష్ట్రంలో అన్ని సంక్షేమ పథకాలను సంతృప్త స్థాయిలో అందించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు...
పథకాల వివరాలన్నీ అందులో నిక్షిప్తం: సీఎం
అమరావతి, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అన్ని సంక్షేమ పథకాలను సంతృప్త స్థాయిలో అందించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరిని గుర్తించాలన్నారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో ఫ్యామిలీ బెనిఫిట్ మానిటరింగ్ వ్యవస్థపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రతి కుటుంబానికి ఒక ఫ్యామిలీ స్కోర్ కేటాయించాలన్నారు. ఆయా కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రయోజనాలపై పారదర్శకంగా ఉండాలన్నారు. దీని కోసం ఫ్యామిలీ కార్డు అందించాలన్నారు. ప్రభుత్వ పథకాలను ఆ కార్డులో పొందుపరచడంతో పాటు.. పూర్తి వివరాలు అందులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. కుటుంబంలో ఎంత మంది ఉంటే అంతమందికీ ఆ కార్డును ఇవ్వాలని ఆదేశించారు. ఆధార్‌కార్డ్ తరహాలో వారి అవసరాలకు ఉపయోగించుకుంటారని అన్నారు. ఆ కుటుంబాలను ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయాలన్నారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబ సంక్షేమం, కనీస అవసరాలు తెలుసుకునేలా క్షేత్రస్థాయిలో సమాచార వ్యవస్థను పటిష్ఠపరచాలని అధికారులను ఆదేశించారు. బీసీ, ఎస్సీల్లో ఉన్న కొన్ని కులాలు చాలా వెనుకబడి ఉన్నాయని, ఆర్థికంగా, సామాజికంగా వారికి లబ్ధి అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఓసీల్లో కూడా ఇంకా ఆర్థికంగా వెనుకబడిన వారున్నారని తెలిపారు. అలాంటి వారందరినీ గుర్తించి వెనుకబాటుతనాన్ని రూపుమాపాలంటే కచ్చితమైన సమాచారం అవసరమన్నారు.
కుటుంబాలు విడిపోవడం బాధాకరం
ప్రజలే ఆస్తి అని, వారి ద్వారానే రాష్ట్రాభివృద్ధి, దేశాభివృద్ధి జరుగుతుందని సీఎం చెప్పారు. జనాభా పెరిగితే సంపద పెరిగే రోజులొచ్చాయని, ఇది కొనసాగాలంటే చక్కటి కుటుంబ వ్యవస్థ ఉండాలని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాల కోసం కుటుంబాలు విడిపోయే పరిస్థితి కొన్ని చోట్ల కనిపిస్తోందని, అలా జరగడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పరిస్థితిని తప్పించాలన్నారు. దీని కోసం పాపులేషన్ పాలసీని త్వరలో తెస్తామని వెల్లడించారు. అధికారులు ఆ దిశగా కసరత్తు చేయాలని ఆదేశించారు. ఉమ్మడి కుటుంబాలు ఉంటే పథకాలు రావనే ఆందోళన లేకుండా ఉండేందుకు అవసరమైతే ప్రభుత్వ సంక్షేమ పథకాలను రీడిజైన్ చేస్తామన్నారు. సమీక్షలో సీఎస్ విజయానంద్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
బస్సు బీభత్సం.. ప్రమాదంలో ఆరుగురి మృతి, ఏడుగురికి గాయాలు
యువకుల అత్యుత్సాహం.. ప్రాణం మీదకు తెచ్చిన పందెం..