Anantapur District : చిక్కనైన పాల కోసం..పామాయిల్, ఉప్పు, మాల్టోడెక్సిన్
ABN , Publish Date - Feb 04 , 2025 | 05:22 AM
పాలలో చిక్కదనం కోసం పామాయిల్, ఉప్పు, మాల్టోడెక్సిన్ పౌడర్‌ను నీటిలో కలిపి.. తర్వాత ఆ మిశ్రమాన్ని పాలలో కలుపుతున్నారు.
అనంతపురంలో కల్తీ పాల కేంద్రంపై విజిలెన్స్ దాడులు
పలు డెయిరీలకు వాటినే సరఫరా చేస్తున్న నిందితుడు
అనంతపురం న్యూటౌన్, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): నేటి రోజుల్లో కల్తీకి ఏదీ అనర్హం కాదన్నట్లుగా పరిస్థితి తయారైంది. పాలలో చిక్కదనం కోసం పామాయిల్, ఉప్పు, మాల్టోడెక్సిన్ పౌడర్‌ను నీటిలో కలిపి.. తర్వాత ఆ మిశ్రమాన్ని పాలలో కలుపుతున్నారు. ఈ ఉదంతం తాజాగా అనంతపురం జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ఈ కల్తీ పాలను విజయ, గాయత్రి డెయిరీలకు సరఫరా చేస్తున్నట్లు తేలింది. దీనికి సంబంధించి విజిలెన్స్ అధికారులు జిల్లాలోని రాప్తాడు మండలం బండమీదపల్లి గ్రామంలో రామిరెడ్డి నిర్వహిస్తున్న కల్తీ పాల తయారీ కేంద్రంపై దాడులు చేపట్టారు. ఆయన నివాసంలో తనిఖీలు చేశారు. పాల చిక్కదనం కోసం వినియోగిస్తున్న వివిధ మిశ్రమాలను స్వాధీనం చేసుకున్నామని విజిలెన్స్ డీఎస్పీ నాగభూషణం తెలిపారు. రామిరెడ్డి స్థానిక పాడి రైతుల నుంచి రోజుకు 300 లీటర్ల వరకు పాలు సేకరిస్తుంటాడు. అయితే పైన పేర్కొన్న కల్తీ మిశ్రమాన్ని పాలలో కలుపుతున్నట్లు సమాచారం అందుకున్న విజిలెన్స్ అధికారులు సోమవారం రాత్రి దాడులు నిర్వహించారు. అదనపు ఆదాయం కోసం ఇలా చేస్తున్నానని రామిరెడ్డి అంగీకరించాడని విజిలెన్స్ డీఎస్పీ తెలిపారు. ఈ కల్తీపాల ద్వారా గ్యాస్ర్టిక్, క్యాన్సర్ వంటి జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. కల్తీ పాల నమూనాలను పరీక్షల నిమిత్తం హైదరాబాదులోని ల్యాబ్‌కు పంపుతున్నామని తెలిపారు. ఫుడ్ సేప్టీ అధికారుల సమక్షంలో కల్తీ పాల తయారీ కేంద్రాన్ని సీజ్ చేశామని తెలిపారు. నివేదిక వచ్చాక చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. తనిఖీల్లో విజిలెన్స్ సీఐ సద్గురుడు, ఏఓ వాసుప్రకాష్, ఫుడ్‌సేఫ్టీ అధికారి తస్లీం, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.