Share News

AP Police: వంశీకి పోలీసుల షాక్‌

ABN , Publish Date - Feb 27 , 2025 | 03:06 AM

బాధితుడు సత్యవర్ధన్‌ కిడ్నా్‌పకు ముందు, ఆ తర్వాత వంశీ ఎక్కడెక్కడ సంచరించారనేది గూగుల్‌ టేకవుట్‌ మ్యాప్‌ను ముందుపెట్టి...

AP Police: వంశీకి పోలీసుల షాక్‌

  • గూగుల్‌ టేకవుట్‌ మ్యాప్‌ చూపించి విచారించడంతో ఉక్కిరిబిక్కిరి!

  • సత్యవర్ధన్‌ కిడ్నాప్‌ అనంతరం జగన్‌ నివాసానికి వెళ్లిన వంశీ

  • దీనిపై ప్రశ్నించగా వెళ్లలేదని జవాబు.. టేకవుట్‌లో వెళ్లినట్టు ఆధారాలు

  • దీంతో అవాక్కయిన మాజీ ఎమ్మెల్యే.. రెండో రోజు 5గంటలు విచారణ

విజయవాడ, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): పోలీసు విచారణలో తమకు ‘అదుర్స్‌’ సినిమా చూపించిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి రెండో రోజు పోలీసులు గట్టిగానే షాక్‌ ఇచ్చారు. బాధితుడు సత్యవర్ధన్‌ కిడ్నా్‌పకు ముందు, ఆ తర్వాత వంశీ ఎక్కడెక్కడ సంచరించారనేది గూగుల్‌ టేకవుట్‌ మ్యాప్‌ను ముందుపెట్టి, పక్కా ఆధారాలతో విచారించడంతో వంశీ ఉక్కిరిబిక్కిరి అయ్యారని సమాచారం. విచారణాధికారుల ప్రశ్నలకు తొలుత తెలియదు... గుర్తులేదు... మరచిపోయాను.. అంటూ బుధవారం కూడా వంశీ దాటవేత ధోరణి ప్రదర్శించారు. విచారణలో భాగంగా వంశీకి సెంట్రల్‌ ఏసీపీ దామోదర్‌ మొత్తం 25 ప్రశ్నలను సంధించారు. గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసుతో తనకు సంబంధం లేదని సత్యవర్ధన్‌తో కోర్టులో ఈ నెల 10న అఫిడవిట్‌ దాఖలు చేయించిన విషయం తెలిసిందే. ఈ ఘట్టం పూర్తయిన అనంతరం సత్యవర్ధన్‌ను హైదరాబాద్‌ తీసుకెళ్లారు. 11న సత్యవర్ధన్‌ను వైజాగ్‌ పంపిన తర్వాత 12న వంశీ తాడేపల్లిలోని జగన్‌ నివాసానికి వెళ్లినట్టు గుర్తించారు. ఆయన హైదరాబాద్‌ నుంచి నేరుగా తాడేపల్లికి చేరుకున్నారు. జగన్‌తో భేటీ అయిన తర్వాత వైజాగ్‌కు వెళ్లారు. జగన్‌ నివాసానికి ఎందుకు వెళ్లారని విచారణాధికారులు ప్రశ్నించగా, అక్కడకు వెళ్లలేదని వంశీ సమాధానం ఇచ్చారు. ఈ సమయంలో గూగుల్‌ టేకవుట్‌ మ్యాప్‌ను ఆయన ముందు ఉంచినట్టు సమాచారం. వంశీ ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసినప్పటికీ గూగుల్‌ టేకవుట్‌తో పాటు నగరంలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు.


వైజాగ్‌లో అవసరాల కోసం...

సత్యవర్ధన్‌ కేసులో నిందితులుగా ఉన్న వెలినేని వెంకటరామకృష్ణ ప్రసాద్‌, నిమ్మ లక్ష్మీపతిని బుధవారం పోలీసులు విచారించారు. వంశీ చెబితేనే తాము వైజాగ్‌ వెళ్లామని వారు విచారణలో అంగీకరించారు. వంశీ అనుచరులు ఎర్రంశెట్టి రామాంజనేయులు, ఎతేంద్ర రామకృష్ణ చెప్పినట్టే నడుచుకున్నామని వెల్లడించినట్టు తెలిసింది. వీరిలో లక్ష్మీపతి ఎతేంద్ర రామకృష్ణకు బంధువు. ఆయన వద్ద కొన్నాళ్లు డ్రైవర్‌గా పనిచేశారు. వైజాగ్‌లో సత్యవర్ధన్‌ను ఎక్కడికైనా కారులో తీసుకెళ్లడానికి డ్రైవర్‌ అవసరమైతే అందుబాటులో ఉండడానికి లక్ష్మీపతిని అక్కడికి పంపారు. వెంకట రామకృష్ణ ప్రసాద్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేశారు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు. విచారణలో అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకపోవడం, దాటవేత ధోరణితో వ్యవహరించడంతో వంశీపై అఫిడవిట్‌ దాఖలు చేయాలని పోలీసులు భావిస్తున్నారు.

డల్‌గా లేను ఆరోగ్యంగానే ఉన్నా: వంశీ

తాను డల్‌గా లేనని, ఆరోగ్యంగానే ఉన్నానని వంశీ తెలిపారు. బుధవారం విచారణ ముగిసిన తర్వాత మీడియా ప్రతినిధులు ఆయనతో మాట్లాడారు. తన ఆరోగ్యం బాగానే ఉందని వంశీ చెప్పారు. ప్రస్తుతం నమోదవుతున్న కేసుల గురించి అందరికీ తెలిసిన విషయమేనన్నారు. కాగా, విచారణలో నాలుగుసార్లు వంశీ తన న్యాయవాదితో భేటీ అయినట్టు తెలిసింది.

Updated Date - Feb 27 , 2025 | 03:06 AM