Share News

Ex-MLA Vallabhaneni Vamsi: ముందస్తు బెయిల్‌ ఇవ్వండి

ABN , Publish Date - May 20 , 2025 | 04:27 AM

అక్రమ మైనింగ్ కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ హైకోర్టులో ముందస్తు బెయిల్‌ కోసం యాచించారు. విచారణను మంగళవారానికి వాయిదా వేసారు.

Ex-MLA Vallabhaneni Vamsi: ముందస్తు బెయిల్‌ ఇవ్వండి

  • అక్రమ మైనింగ్‌ కేసులో హైకోర్టును ఆశ్రయించిన వల్లభనేని వంశీ

  • విచారణ నేటికి వాయిదా

అమరావతి, మే 19(ఆంధ్రజ్యోతి): అక్రమ మైనింగ్‌పై గన్నవరం పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్‌ కోరుతూ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ హైకోర్టులో సోమవారం అత్యవసరంగా హౌస్‌మోషన్‌ పిటిషన్‌ వేశారు. దీనిని హైకోర్టు చేపట్టి.. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ వై.లక్ష్మణరావు ఉత్తర్వులు ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోని విజయవాడ రూరల్‌, బాపులపాడు గన్నవరం మండలాల పరిధిలో వంశీ అక్రమ మైనింగ్‌కు పాల్పడి ప్రభుత్వ ఖాజానాకు రూ. 195 కోట్ల నష్టం చేశారని విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌శాఖ తేల్చింది. దీనిపై గన్నవరం పోలీసులు ఈనెల 14న కేసు నమోదు చేశారు. వంశీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై ఆయన తరఫున సీనియర్‌ న్యాయవాది ఎస్‌.శ్రీరామ్‌ వాదనలు వినిపించారు. పిటిషనర్‌పై అర్ధరాత్రి కేసు నమోదు చేశారన్నారు. ప్రతీ కేసులోనూ ఎంఎండీఆర్‌ యాక్ట్‌ను చేరుస్తున్నారన్నారు. కిడ్నాప్‌ కేసులో బెయిల్‌ మంజూరయ్యాక ఫేక్‌ పట్టాల కేసుపై తిరిగి దర్యాప్తు జరిపి ఆ కేసులో అరెస్ట్‌ చేశారన్నారు. ప్రస్తుత కేసులో పీటీ వారెంట్‌ జారీచేస్తే ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ నిరర్థకమవుతుందన్నారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్‌పై కేసు నమోదులో చట్టనిబంధనలు పాటించామన్నారు. ఫేక్‌ పట్టాల జారీ కేసులో పిటిషనర్‌ మొదటి నిందితుడిగా ఉన్నారన్నారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక చార్జిషీట్‌లో పేరు చేర్చకుండా పిటిషనర్‌ దర్యాప్తు అధికారిని ప్రభావితం చేశారన్నారు.


సంబంధిత మేజిస్ట్రేట్‌ నుంచి అనుమతి తీసుకుని తిరిగి నిందితుడిగా చేర్చామన్నారు. ఈ దశలో న్యాయమూర్తి పీటీ వారెంట్‌పై ఆరా తీశారు. వివరాలు సమర్పించేందుకు పీపీ సమయం కోరారు. సాయంత్రం 6 గంటలకు తిరిగి విచారణ ప్రారంభమయ్యాక పీటీ వారెంట్‌పై విచారణ మంగళవారానికి వాయిదా పడిందని పీపీ కోర్టుకు నివేదించారు. ముందస్తు బెయిల్‌తో పాటు పీటీ వారెంట్‌ కోసం ఒత్తిడి చేయకుండా పోలీసులను నిలువరించాలంటూ వేసిన అనుబంధ పిటిషన్‌పై విచారణను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు.

Updated Date - May 20 , 2025 | 04:28 AM