Share News

Excise Department: ఎక్సైజ్‌లో వైసీపీ కంపెనీ తిష్ఠ

ABN , Publish Date - Jun 02 , 2025 | 03:23 AM

వైసీపీ ప్రభుత్వం గడువు ముగిసిన తర్వాత కూడా కుంభత్ హోలోగ్రాఫిక్స్ అనే కంపెనీకి ఎక్సైజ్ శాఖ నుండి ప్రాధాన్యం ఇస్తోంది. టెండర్లు రద్దయినా, నెలకు 5 కోట్ల రూపాయలపైగా హీల్స్ బిల్లు చెల్లిస్తున్నారు.

Excise Department: ఎక్సైజ్‌లో వైసీపీ కంపెనీ తిష్ఠ

  • ‘కుంభత్‌ హోలోగ్రాఫిక్స్‌’పై అధికారుల ప్రేమ

  • నెలకు 5 కోట్లకు పైగా బిల్లుల చెల్లింపు

అమరావతి, జూన్‌ 1(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వంలో చక్రంతిప్పిన కంపెనీలపై ఎక్సైజ్‌ శాఖ అధికారులు అమితమైన ప్రేమ చూపిస్తున్నారు. ప్రభుత్వం మారిన తర్వాత కూడా పాత కంపెనీలనే కొనసాగిస్తూ... చివరికి ఆ కంపెనీల టెండరు కాలం ముగిసినా కొనసాగించడం విమర్శలకు దారితీస్తోంది. మద్యం సీసాలపై అతికించే హీల్‌ కోడ్‌లు సరఫరా చేసే కంపెనీని వైసీపీ హయాంలో ఎంపిక చేశారు. 2020లో తమిళనాడుకు చెందిన కుంభత్‌ హోలోగ్రాఫిక్స్‌ అనే కంపెనీ టెండరు దక్కించుకుంది. టెండరు కాలపరిమితి ఈ ఏడాది మార్చితో ముగిసింది. అయినా ఇప్పటికీ అదే కంపెనీని ఎక్సైజ్‌ అధికారులు కొనసాగిస్తున్నారు. వాస్తవానికి కొత్త టెండర్లు పిలిచేందుకు ఈ ఏడాది మొదట్లోనే ప్రక్రియ ప్రారంభించినా, అది మధ్యలోనే ఆగిపోయింది. సదరు కంపెనీ కాలపరిమితి ముగిసిన తర్వాత ఇప్పటికే రెండుసార్లు పొడిగించగా.. మరో నెల పొడిగించేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. ఒక్కో హీల్‌కు 40 పైసల వరకు చెల్లిస్తున్నారు. రాష్ట్రంలో ఉత్పత్తి చేసిన ప్రతి సీసాపై అతికించిన హీల్స్‌కుగానూ ఆ కంపెనీకి నెలకు రూ.5 కోట్లకు పైగా బిల్లులు చెల్లిస్తున్నారు. కుంభత్‌ కంపెనీపై కూటమి ప్రభుత్వంలో సీఐడీ కేసు నమోదైంది. తమిళనాడుకు చెందిన వ్యక్తి ఫిర్యాదు మేరకు అక్రమంగా టెండరు దక్కించుకొన్నారనే ఆరోపణలతో కేసు నమోదు చేశారు. టెండర్ల సమయంలోనే మరో రెండుడమ్మీ కంపెనీలతో టెండరు వేయించి.. ఈ మూడు కంపెనీలే ఎల్‌1, 2, 3గా వచ్చేలా ప్లాన్‌ చేసి, ఆ తర్వాత ఎల్‌1గా ఉన్న కుంభత్‌కు టెండరు దక్కేలా చేశారనేది అభియోగం. అప్పటి బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీ వాసుదేవరెడ్డి నేతృత్వంలో ఈ టెండర్ల ప్రక్రియ జరిగింది.


కొత్త టెండర్లపై అధికారుల మౌనం

ప్రభుత్వం మారిన వెంటనే ఆ కంపెనీని సాగనంపుతారని భావించారు. కానీ టెండరు గడువు ఉందనే కారణంతో మార్చి వరకు కొనసాగించారు. కాలపరిమితి ముగుస్తున్నా కొత్త టెండర్ల ప్రక్రియ ప్రారంభించ కుండా మౌనం దాల్చారు. మొత్తం గడువు ముగిసిన తర్వాత ట్రాక్‌ అండ్‌ ట్రేస్‌ విధానం అమలు, హీల్స్‌ సేకరణపై ఏప్రిల్‌ 28న కమిటీని నియమిస్తూ ముఖ్యకార్యదర్శి ఎంకే మీనా ఉత్తర్వులు ఇచ్చారు. వాసుదేవరెడ్డి తెచ్చిన, సీఐడీ విచారణ జరుగుతున్న కంపెనీపై అంత ప్రేమ ఎందుకనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనివల్ల ఎవరికి లబ్ధి చేకూరుతోంది? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కుంభత్‌ను ఎందుకు కొనసాగించాల్సి వచ్చిందని ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ను వివరణ కోరగా.. సమాధానం చెప్పేందుకు నిరాకరించారు.

Updated Date - Jun 02 , 2025 | 03:24 AM