Share News

Temple Admin Crisis: దేవుడి శాఖకు ఇన్‌చార్జులే దిక్కు

ABN , Publish Date - May 01 , 2025 | 05:55 AM

దేవదాయ శాఖలో అధికారి కొరత తీవ్రం.. కమిషనర్‌ నుంచి ఈవోల వరకూ ఇన్‌చార్జి పాలన కొనసాగుతోంది. కీలక ఆలయాల నిర్వహణ రెవెన్యూ అధికారుల చేతిలో ఉండటం వల్ల పాలనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి

Temple Admin Crisis: దేవుడి శాఖకు ఇన్‌చార్జులే దిక్కు

  • కమిషనరూ, ఈవోలూ అదనపు బాధ్యతల్లోనే

  • దేవదాయ శాఖలో అధికారుల కొరత తీవ్రం

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

దేవదాయ శాఖలో ఇన్‌చార్జుల పాలన నడుస్తోంది. కమిషనర్‌ నుంచి ప్రధాన ఆలయాల ఈవోల వరకూ ఇన్‌చార్జులనే పెట్టి ప్రభుత్వం చోద్యం చూస్తోంది. దేవుడి శాఖలో రూ.కోట్ల విలువైన ఆస్తులు.. లక్షల ఎకరాల భూములున్నా.. వాటి సంరక్షణకు ఇన్‌చార్జి అధికారులే దిక్కవుతున్నారు. శాఖ కమిషనర్‌ రామచంద్ర మోహన్‌ ఇన్‌చార్జిగానే కొనసాగుతున్నారు. ఎస్‌.సత్యనారాయణను బదిలీ చేసిన తర్వాత ప్రభుత్వం ఐఏఎ్‌సను నియమించుకుండా.. సీనియర్‌ అధికారి, అదనపు కమిషనర్‌-2గా ఉన్న రామచంద్ర మోహన్‌కు ఇన్‌చార్జి కమిషనర్‌గా బాధ్యతలు అప్పగించింది. ఈయనే విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి ఇన్‌చార్జి ఈవోగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఆయనే అదనపు కమిషనర్‌-2గానూ కొనసాగుతున్నారు. సింహచలం ఆలయం ఈవో కూడా ఇన్‌చార్జే. రెవెన్యూ శాఖ నుంచి వచ్చిన సుబ్బారావును దేవదాయ శాఖ అధికారులు రాజమండ్రి ఆర్జేసీగా నియమించారు.


రెవెన్యూ అధికారులే దిక్కు..: దేవదాయ శాఖలో రెగ్యులర్‌ అధికారుల కొరత తీవ్రంగా ఉంది. దీంతో రెవెన్యూ అధికారులపైనే ఆధారపడుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని ఏడు ప్రధాన ఆలయాల్లో ద్వారకాతిరుమల, కనకదుర్గమ్మ ఆలయాలకు తప్ప సింహాచలం, అన్నవరం, శ్రీశైలం, కాణిపాకం, శ్రీకాళహస్తి ఆలయాలకు రెవెన్యూ అధికారులే ఈవోలుగా ఉన్నారు. ఇన్‌చార్జి అధికారులు పూర్తిస్థాయి బాధ్యతలు తీసుకోకపోవడమూ సమస్యగా మారింది. వారు ఉపకార్యనిర్వహణాధికారులకు బాధ్యతలు అప్పగించడంతో పాలన ఆస్తవ్యస్తంగా మారుతోందన్న ఆరోపణలున్నాయి. దేవదాయ శాఖలో 11 ఆర్జేసీ పోస్టులున్నాయి. డైరెక్టుగా డిప్యూటీ కమిషనర్ల నియామకం, అసిస్టెంట్‌ కమిషనర్లకు డిప్యూటీ కమిషనర్లుగా పదోన్నతులు కల్పిస్తే.. తర్వాత రెండేళ్లకు వాళ్లకు ఆర్జేసీగా పదోన్నతులు లభిస్తాయి. ప్రస్తుతం శాఖలో భ్రమరాంబ, సత్యనారాయణమూర్తి, త్రినాథ్‌రావు, చంద్రశేఖర్‌ ఆజాద్‌ మాత్రమే రెగ్యులర్‌ ఆర్జేసీలు. వీరిలో భ్రమరాంబ, సత్యనారాయణమూర్తి ఈ ఏడాది, త్రినాథ్‌రావు, ఏడీసీ చంద్రకుమార్‌ వచ్చే జనవరిలో పదవీవిరమణ చేయనున్నారు. మిగిలే ఒకేఒక్క ఆర్జేసీ చంద్రశేఖర్‌ ఆజాద్‌. దేవదాయశాఖలో రెగ్యులర్‌ పోస్టులున్నప్పటికి డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ చేయకుండా కాలయాపన చేస్తున్నారు. 29 ఏళ్లుగా డిప్యూటీ కమిషనర్‌ పోస్టులకు నోటిఫికేషనే ఇవ్వలేదంటేనే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. 1996లో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఏపీపీఎస్సీ ద్వారా నియమితులైన ఇద్దరు అధికారులు ఇప్పుడు రిటైర్‌మెంట్‌కు దగ్గరపడ్డారు. ఈ పోస్టుల భర్తీపై ప్రభుత్వం దృష్టి పెట్టకపోతే దేవదాయ శాఖలో అధికారుల కొరత మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది.


Also Read:

సామ్ కర్రన్ సూపర్ ఇన్నింగ్స్.. ఛాహల్ హ్యాట్రిక్

రిటైర్మెంట్‌పై బాంబు పేల్చిన ధోని

ఇలాంటి దోపిడీ ఎక్కడైనా చూశారా..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - May 01 , 2025 | 05:55 AM