Electricity Companies Express Losses: వైసీపీ ప్రభుత్వంలో భారీగా నష్టపోయాం
ABN , Publish Date - Sep 04 , 2025 | 04:21 AM
వైసీపీ ప్రభుత్వ విధానాలతో గత ఐదేళ్లలో భారీగా నష్టపోయామని విద్యుత్తు కంపెనీల ప్రతినిధులు ఆవేదన వెలిబుచ్చారు. యాక్సిస్ ఎనర్జీ, సుజ్లాన్, రిలయన్స్ సంస్థల ప్రతినిధులతో ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ బుధవారం సచివాలయంలో సమావేశమయ్యారు...
విద్యుత్తు కంపెనీల ప్రతినిధుల ఆవేదన
ప్రభుత్వం సహకరిస్తే మూడేళ్లలో ప్రాజెక్టులు పూర్తి చేస్తామని వెల్లడి
పెట్టుబడిదారులకు అండగా ఉంటాం: గొట్టిపాటి
అమరావతి, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వ విధానాలతో గత ఐదేళ్లలో భారీగా నష్టపోయామని విద్యుత్తు కంపెనీల ప్రతినిధులు ఆవేదన వెలిబుచ్చారు. యాక్సిస్ ఎనర్జీ, సుజ్లాన్, రిలయన్స్ సంస్థల ప్రతినిధులతో ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ బుధవారం సచివాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భూసేకరణలో ఎదురవుతున్న ఇబ్బందులను వారు మంత్రికి వివరించారు. కూటమి ప్రభుత్వం మద్దతుతో రాబోయే మూడేళ్లలోనే సోలార్, విండ్, సీబీజీ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని తెలిపారు. అనంతరం గొట్టిపాటి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పునరుత్పాదక రంగంలో వివిధ ప్రాజెక్టులు చేపడుతున్న పెట్టుబడిదారులకు సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని భరోసా ఇచ్చారు. సీబీజీ (కంప్రెస్డ్ బయో గ్యాస్) ప్లాంట్లను సకాలంలో ఏర్పాటు చేయాలని రిలయన్స్ ప్రతినిధులకు సూచించారు. రూ.65వేల కోట్లతో 500 సీబీజీ ప్లాంట్లను ఏర్పాటు చేసి 2.5లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రిలయన్స్ సంస్థ ముందుకు రావడం గొప్ప విషయమని పేర్కొన్నారు. తొలిదశలో ప్రకాశం, నెల్లూరు, పల్నాడు జిల్లాల్లో ప్లాంట్ల నిర్మాణం చేపడతామని, ఆ తర్వాత అన్నమయ్య, కడప జిల్లాల్లో ఏర్పాటుకు చర్యలు తీసుకున్నట్లు రిలయన్స్ కంపెనీ ప్రతినిధులు వివరించారు. బ్రూక్‌ఫీల్డ్‌తో కలిసి ఏర్పాటు చేసిన ఎవ్రెన్ ఫ్లాట్‌ఫాం ద్వారా 3వేల మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన సోలార్ ప్రాజెక్టుల పనులు ప్రారంభించామని యాక్సిస్ ఎనర్జీ ప్రతినిధులు తెలిపారు. రూ.30 వేల కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టి 3,500 ఉద్యోగాలు సృష్టించేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. అనంతపురం జిల్లా కుదేరు యూనిట్‌లో అధిక సామర్థ్యం కలిగిన గాలిమర టర్బైయిన్ల తయారీకి ప్లాంట్‌ను అప్‌గ్రేడ్ చేసి, 1,200 మందికి ఉపాధి కల్పిస్తున్నామని సుజ్లాన్ ప్రతినిధులు చెప్పారు. దేశంలోనే అతిపెద్ద గ్రీన్ స్కిల్ డెవల్‌పమెంట్ ప్రోగ్రామ్‌ను ఏపీలో ప్రారంభించామని తెలిపారు.
ట్రాన్స్‌కో అధికారులతో మంత్రి సమీక్ష
రాష్ట్రవ్యాప్తంగా రూ.14962 కోట్లతో చేపట్టిన 400 కేవీ, 220 కేవీ, 132 కేవీ సబ్‌స్టేషన్లు, ఇతర ట్రాన్స్‌కో ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తిచేసి నిర్మాణ వ్యయం తగ్గించాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. బుధవారం ట్రాన్స్‌కో అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించాలని సూచించారు. నాణ్యతా లోపం లేకుండా పనులు చేపట్టాలన్నారు. రూ.6వేల కోట్లతో చేపట్టిన ప్రాజెక్టులు 2027 నాటికి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. సీఆర్డీయేలో అండర్ గ్రౌండ్ కేబుల్ వ్యవస్థపై మంత్రి ఆరా తీశారు. విద్యుత్తు శాఖలో ఖాళీలు భర్తీ చేయడానికి సీఎం సుముఖత వ్యక్తం చేసినట్లు మంత్రి తెలిపారు.
తాడిపత్రిలో పొలిటికల్ హీట్.. నువ్వొస్తానంటే.. నే రానిస్తానా..!
పౌరుషానికి ప్రతీక నందమూరి హరికృష్ణ..
Read Latest Andhra Pradesh News and National News