Share News

అవగాహనతో కేన్సర్‌కు అడ్డుకట్ట!

ABN , Publish Date - Feb 04 , 2025 | 12:38 AM

రాజమహేంద్రవరం అర్బన్‌, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): మారిన ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్లు, వంశపార్యంపర్య కారణాలతో కేన్సర్‌ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతున్నదని వైద్యులు చెబుతున్నారు. వీటితో పాటు కేన్సర్‌ వ్యాధి పట్ల ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడం మరింత ప్రమాదకరంగా పరిణమిస్తోం

అవగాహనతో కేన్సర్‌కు అడ్డుకట్ట!
రాజమహేంద్రవరం ప్రభుత్వ సమగ్ర బోధనాసుపత్రి

ప్రారంభదశలో గుర్తిస్తే వైద్యసేవలతో సత్ఫలితాలు

రాజమహేంద్రవరం జీటీజీహెచ్‌లో ప్రివెంటివ్‌ అంకాలజీ యూనిట్‌ సేవలు

నేడు కేన్సర్‌ డే సందర్భంగా ప్రత్యేక కథనం

రాజమహేంద్రవరం అర్బన్‌, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): మారిన ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్లు, వంశపార్యంపర్య కారణాలతో కేన్సర్‌ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతున్నదని వైద్యులు చెబుతున్నారు. వీటితో పాటు కేన్సర్‌ వ్యాధి పట్ల ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడం మరింత ప్రమాదకరంగా పరిణమిస్తోంది. కేన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే రేడియేషన్‌, కీమోథెరపీ ద్వారా చాలా వరకూ విస్తరించకుండా నివారించే అవకాశం ఉందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. అయితే కేన్సర్‌పై ప్రజల్లో చైతన్యం రాకపోవడం ప్రాణాపాయ పరిస్థితుల్లోకి నెడుతున్నదని, కొన్ని సందర్భాల్లో మరణాలు కూడా జరుగుతున్నాయని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ కేన్సర్‌ డే సందర్భంగా నివారణకు సూచనలు ఇలా..

స్ర్కీనింగ్‌ అత్యంత ముఖ్యం

కేన్సర్‌ వ్యాధి నివారణలో స్ర్కీనింగ్‌ అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంటుంది. నివారణకు అవకాశం ఉన్న కేన్సర్లు అయిన రొమ్ము కేన్సర్‌, సర్వికల్‌ కేన్సర్‌, నోటి కేన్సర్‌లను ప్రారంభదశలోనే గుర్తించడం ద్వారా చాలా వరకూ నివారించవచ్చని వైద్యులు చెబుతున్నారు. అలాగే సేవల సమీకరణ జరగాల్సి ఉంటుంది. కమ్యూనిటీ స్థాయిలో ఎన్‌సీడీ 3.0 యాప్‌ ద్వారా ఆశా, ఏఎన్‌ఎంల సహకారంతో అనుమానిత వ్యక్తులను గుర్తించి అందుబాటులోని ప్రివెంటివ్‌ అంకాలజీ యూనిట్‌కు పంపించడం ద్వారా సత్ఫలితాలు పొందే అవకాశం ఉంది. వీటితోపాటు కౌన్సెలింగ్‌, చికిత్స కౌన్సెలింగ్‌ ద్వారా నిర్ధారణ, అవసరమైన చికిత్సా సేవలను సమగ్రంగా అందించగలుగుతారు. వీటికితోడు ప్రజల్లో కేన్సర్‌పై అవగాహన పెరగాల్సి ఉంటుంది.

జీటీజీహెచ్‌లో ప్రివెంటివ్‌ అంకాలజీ యూనిట్‌

రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ సమగ్ర బోధనాసుపత్రి (జీటీజీహెచ్‌)లో ఏర్పాటు చేసిన ప్రివెంటివ్‌ అంకాలజీ యూనిట్‌లో కేన్సర్‌కు సంబంధించి పలు రకాలైన వైద్యచికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ సర్జరీ, కీమో థెరపీ సేవలు లభిస్తున్నాయి. తల, మెడ సంబంధిత కేన్సర్‌లతోపాటు గైనిక్‌ సంబంధిత కేన్సర్లు, గ్యాస్ర్టో ఇంటెన్సియల్‌ కేన్సర్లు, స్కిన్‌ కేన్సర్లు వంటి వాటికి సర్జరీలు చేస్తున్నారు. వీటితోపాటు కీమో థెరపీ వైద్యసేవలు అందిస్తున్నారు. ప్రివెంటివ్‌ అంకాలజీ యూనిట్‌లో డాక్టర్‌ ప్రశాంత్‌ నోడల్‌ అధికారిగా వ్యవహరిస్తుండగా, ఒక గైనకాలజిస్ట్‌, ఒక రేడియేషన్‌ ఆంకాలజిస్ట్‌, సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌, ఈఎన్‌టీ స్పెషలిస్టు, శస్త్ర చికిత్స నిపుణురాలు అందుబాటులో ఉన్నారు. ప్రతి మంగళవారం, గురువారం జీటీజీహెచ్‌ ఓపీ బ్లాకులోని 222 నెంబరు గదిలో ముందస్తు కేన్సర్‌ నిరోధక సేవల ఓపీ నిర్వహిస్తున్నారు.

ప్రజల్లో అవగాహన పెరగాలి

కేన్సర్‌ పట్ల గ్రామీణ ప్రాంతాల వారితో పాటు పట్టణవాసుల్లోనూ పెద్ద అవగాహన లేకపోవడంతో కేన్సర్‌ కేసులు పెరుగుతున్నాయి. పొగాకు నమలడం, ధూమపానం, ఆల్కహాల్‌కు దూరంగా ఉండడంతో పాటు మంచి ఆహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా కేన్సర్‌ స్ర్కీనింగ్‌ పరీక్షలు చేయించుకోవడం ద్వారా కేన్సర్‌కు దూరంగా ఉండవచ్చని జీటీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ లక్ష్మీ సూర్యప్రభ పేర్కొన్నారు.

నేడు కేన్సర్‌పై అవగాహన ర్యాలీ

ప్రపంచ కేన్సర్‌ డే సందర్భంగా మంగళవారం రాజమహేంద్రవరంలో మెగా పబ్లిక్‌ అవగాహన ర్యాలీ నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు ఏవీ అప్పారావు రోడ్డులోని రామాలయం సెంటర్‌ నుంచి ఈ ర్యాలీ ప్రారంభమవుతుంది. రోటరీ క్లబ్‌ ఆఫ్‌ రాజమహేంద్రవరం ఐకాన్స్‌, జీఎస్‌ఎల్‌ కేన్సర్‌ హాస్పిటల్‌ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ర్యాలీలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి కందుల దుర్గేష్‌, ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖులు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.

Updated Date - Feb 04 , 2025 | 12:38 AM