MLC Anantha babu: పోలీసుల నిర్లక్ష్యం.. అనంతబాబు కేసుతో తలనొప్పి
ABN , Publish Date - Aug 25 , 2025 | 10:22 AM
డ్రైవర్ సుబ్రహ్మణ్యం దారుణ హత్య.. వైసీపీ నేత, ఎమ్మెల్సీ అనంతబాబు కేసు దర్యాప్తులో పోలీసులకు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. ఇకఈ కేసు విచారణలో భాగంగా అనంతబాబు భార్యకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.
కాకినాడ, ఆగస్టు 25: కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని దారుణంగా హత్య చేసి.. ఆ మృతదేహాన్ని అతడి ఇంటికి డోర్ డెలివరి చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో తదుపరి విచారణకు కోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ కేసు విచారణను పోలీసులు పున: ప్రారంభించారు. అయితే ఈ కేసు పోలీసులకు తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పోలీసుల ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పిదాల వల్ల ఈ చిక్కులు ఏర్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ సమయంలో అతడి ఐ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కానీ ఆ ఫోన్ పాస్ వర్డ్‌ను మాత్రం పోలీసులు తీసుకోక పోవడంతో.. కొత్త చిక్కులు వచ్చాయని పోలీసులు చెబుతున్నారు.
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకు ముందు ఎమ్మెల్సీ అనంతబాబు.. ఫోన్‌లోని వాట్సాప్ కాల్ ద్వారా ఎవరెవరితో మాట్లాడారు. అలాగే ఫోన్‌లోని వీడియోలను సేకరించేందుకు గతంలో ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఏ మాత్రం ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. తాజాగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఈ అంశాలను పరిశీలించి నివ్వెరపోతున్నారు. ఈ కేసును గతంలో దర్యాప్తు చేసిన పోలీసుల నిర్లక్ష్యానికి ఇది నిలువెత్తు సాక్ష్యమని వారు పేర్కొంటున్నారు. దీంతో కోర్టు నుంచి పాస్ వర్డ్ అనుమతి పొందడం ద్వారా అనంతబాబు ఫోన్ తెరిచేందుకు పోలీసులు తమ వంతు ప్రయత్నాలను ప్రారంభించారు. ఇక ఈ హత్య కేసు విచారణలో భాగంగా తాజాగా అనంతబాబు భార్యకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వైసీపీ నేత ఎమ్మెల్సీ అనంత బాబు.. తన కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని దారుణంగా హత్య చేయడంతోపాటు.. ఆ మృతదేహాన్ని అతడి ఇంటికి తీసుకు వెళ్లి డోర్ డెలివరి చేశారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ వ్యహారంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినా.. వైసీపీ అధికారంలో ఉండడంతో.. ఈ కేసు దర్యాప్తు ముందుకు సాగలేదనే వాదన వినిపించింది. అయితే కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత.. గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న అరాచకాలపై దృష్టి సారించిన విషయం విదితమే.
ఈ వార్తలు కూడా చదవండి..
గాజాలో ఆగని ఆకలి చావులు.. 290 మంది మృతి
ఫోనే కీలకం.. వారిలో మొదలైన అలజడి..!
For More AP News And Telugu News