Gurukulam School Incident: బంధువునంటూ చెప్పి మైనర్ బాలికపై దారుణం..
ABN , Publish Date - Oct 22 , 2025 | 01:27 PM
గురుకుల పాఠశాలకు వచ్చిన నారాయణ... బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఆపై బాలికపై అత్యాచారం చేసేందుకు యత్నించాడు. స్థానికులు గమనించి నిలదీయగా అక్కడి నుంచి పరారయ్యాడు నిందితుడు.
కాకినాడ, అక్టోబర్ 22: తుని బాలికల గురుకుల పాఠశాలలో (Tuni Gurukula School) దారుణం జరిగింది. ఎనిమిదో తరగతి చదువుతున్న మైనర్ బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. బాలికకు మాయ మాటలు చెప్పి స్కూల్ నుంచి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన నిందితుడు.. ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. విషయం తెలిసిన బాలిక బంధువులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నారాయణరావు అనే వ్యక్తి.. తరచూ గురుకుల పాఠశాలకు వెళ్లి బాలిక బంధువును అని చెప్పి ఆమెను తీసుకెళ్లేవాడని తెలుస్తోంది.
నిన్న (మంగళవారం) కూడా గురుకుల పాఠశాలకు వచ్చిన నారాయణ... బాలికను ఎవరూ లేని ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఆపై బాలికపై అత్యాచారం చేసేందుకు యత్నించాడు. స్థానికులు గమనించి నిలదీయగా అక్కడి నుంచి పరారయ్యాడు నిందితుడు. విషయం తెలిసిన బాలిక తల్లిదండ్రులు గురుకుల పాఠశాల ముందు ఆందోళనకు దిగారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
నిందితుడిపై పోక్సో కేసు: డీఎస్పీ
తుని ఘటనపై పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు మాట్లాడుతూ.. తునిలో బాలికకు మాయ మాటలు చెప్పి గురుకుల పాఠశాల నుంచి తీసుకెళ్లిన వృద్ధుడు నారాయణరావుపై పోక్సో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కిడ్నాప్, అత్యాచారం కిందకు వచ్చే వివిధ కఠిన సెక్షన్లు నమోదు చేశామన్నారు. సాయంత్రం రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలిస్తామని చెప్పారు. ఈ వ్యవహారంలో పార్టీల ప్రమేయం ఏం లేదని స్పష్టం చేశారు. ఏ పార్టీ కూడా నారాయణరావు తమ వాడని క్లైమ్ చేయలేదన్నారు. సోషల్ మీడియాలో పార్టీల మధ్య గొడవలు సృష్టించేందుకు వీడియోలు సర్క్యూలేట్ చేస్తే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని డీఎస్పీ శ్రీహరిరాజు హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి...
వారి సారథ్యంలో ఏపీకి పెద్ద ఎత్తున పెట్టుబడులు: మాధవ్
12 గంటల్లోపు వాయుగుండం.. హోంమంత్రి కీలక ఆదేశాలు
Read Latest AP News And Telugu News