స్ర్తీ శక్తికి తుది కసరత్తు!
ABN , Publish Date - Aug 12 , 2025 | 01:56 AM
రాజమహేంద్రవరం అర్బన్, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి) : మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి సంబంధించిన ‘స్త్రీశక్తి పథకం’ అమలుకు తుదికసరత్తు
జీవో, మార్గదర్శకాలు
విడుదల చేసిన ప్రభుత్వం
బాలికలు, స్త్రీలు, ట్రాన్స్‌జెండర్లకు
జీరో ఫేర్ టిక్కెట్
టిక్కెట్ ఇష్యూయింగ్ మెషీన్ల
(టిమ్స్)లో ప్రత్యేకంగా ఉమెన్ ఫ్రీ
టికెట్ (డబ్ల్యుఎఫ్‌టీ) బటన్
ఈనెల 15 నుంచి మహిళలకు
ఉచిత ప్రయాణ పథకం షురూ
రాజమహేంద్రవరం- కాకినాడ
నాన్‌స్టాప్ సర్వీసులకు వర్తించదు
రాజమహేంద్రవరం అర్బన్, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి) : మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి సంబంధించిన ‘స్త్రీశక్తి పథకం’ అమలుకు తుదికసరత్తు జరుగుతోంది. ఈమేరకు సోమవారం విజయవాడలో ఆయా జిల్లాల ప్రజారవాణా అధికారులతో ఆర్టీసీ ఉన్నతాధికారులు సమావేశమై మార్గనిర్దేశం చేశారు. తూర్పుగోదావరి జిల్లా ప్రజారవాణా అధికారి వైఎస్‌ఎన్ మూర్తి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇదే సమయంలో మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం అమలు విధి విధానాలకు సంబంధించిన జీఓ, మార్గదర్శకాలు విడుదల చేసింది. దీని ప్రకారం తూర్పుగోదావరి జిల్లాలో పల్లెవెలుగు, ఆల్ర్టా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులోకి రానుంది. అయితే, నాన్‌స్టాప్ సర్వీసుల్లో ఈ పథకం వర్తించదని రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొనడంతో రాజమహేంద్రవరం-కాకినాడ మధ్య నడిచే నాన్‌స్టాప్ సర్వీసుల్లో మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్లకు ఉచిత ప్రయాణం అనుమతించరు. అదేవిధంగా ఆల్ర్టా డీలక్స్, సూపర్ లగ్జరీ, స్టార్ లైనర్, సప్తగిరి, ఏసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వర్తించదని, నాన్‌స్టాప్ సర్వీసులు, స్పెషల్ బస్సులు, అంతర్రాష్ట్ర సర్వీసుల్లోనూ ఉచిత ప్రయాణం ఉండదని ప్రభుత్వం పేర్కొంది.
జిల్లాలో.. ఈ బస్సుల్లోనే ప్రయాణం..
జిల్లాలో రాజమహేంద్రవరం, కొవ్వూరు, నిడదవోలు, గోకవరం డిపోలు ఉన్నాయి. ఈ నాలుగు డిపోల పరిధిలో మొత్తం 205 ఆర్టీసీ సొంత బస్సులు, 78 అద్దె బస్సులు నడుపుతున్నారు. వీటిలో ఆర్టీసీ, అద్దె బస్సులు కలిపి ... జిల్లాలో 37 ఎక్స్‌ప్రెస్‌లు, 27 ఆల్ర్టా పల్లెవెలుగు, 167 పల్లెవెలుగు బస్సులు స్త్రీ శక్తి పథకంలో మహిళలు ఉచితంగా రాకపోకలు సాగించనున్నారు. డిపోల వారీగా చూస్తే రాజమహేంద్రవరం డిపోలో 22 ఎక్స్‌ప్రెస్‌లు, 15 ఆల్ర్టా పల్లెవెలుగు, 64 పల్లెవెలుగు బస్సులు ఉన్నాయి. గోకవరం డిపోలో 14 ఎక్స్‌ప్రెస్‌లు, 12 ఆల్ర్టా పల్లెవెలుగు, 30 పల్లె వెలుగు బస్సులు ఉన్నాయి. కొవ్వూరు డిపోలో ఒక ఎక్స్‌ప్రెస్ మాత్రమే ఉంది. 42 పల్లెవెలుగు బస్సులు ఉన్నాయి. నిడదవోలు డిపోలో కేవలం 31 పల్లెవెలుగు బస్సులు ఉన్నాయి. ఇక స్త్రీశక్తి పథకం అమలులో ఎటువంటి గందరగోళానికి తావులేకుండా టిక్కెట్లు జారీచేసే మెషీన్ (టిమ్స్)లో ప్రత్యేకంగా ఉమెన్ ఫ్రీటిక్కెట్ (డబ్ల్యుఎఫ్‌టీ)పేరిట ప్రత్యేకంగా ఒక బటన్ ఏర్పాటు చేశారు. బాలికలు, స్త్రీలు, ట్రాన్స్‌జెండర్లకు జీరో ఫేర్ టిక్కెట్ ఇవ్వడానికి ఈ ఒక్క బటన్ ప్రెస్ చేస్తే చాలు ప్రింటెడ్ టిక్కెట్ బయటకు వస్తుంది. పురుషులకు మాత్రం గతంలో మాదిరిగానే ప్రయాణ దూరానికి అనుగుణంగా ఛార్జీలను నిర్దేశించి టిక్కెట్లు ఇస్తారు.
టిక్కెట్లపై స్త్రీశక్తి.. జీరో టిక్కెట్ ముద్రణ
ముందు ఊహించినట్టుగానే మహిళలకు జీరో ఫేర్ టిక్కెట్ జారీ చేస్తారు. అయితే దీనిలో చిన్న మార్పులు చేశారు. బాలికలు, స్త్రీలకు ఇచ్చే స్త్రీ శక్తి టిక్కెట్లపై తాము ప్రయాణించే దూరానికి టిక్కెట్ చార్జీ ఎంతవుతుందో ఆ మొత్తం ముద్రించి ఉంటుంది. దానికింద ప్రభుత్వ రాయితీ అంతే మొత్తం పేర్కొంటారు. చివరన టిక్కెట్ చార్జీ జీరోగా చూపిస్తారు. దీనివల్ల ప్రభుత్వం నుంచి తాము ఎంత లబ్ధిపొందామనేది మహిళలు తెలుసుకుంటారని భావిస్తున్నారు.
అర్హులైన వారందరికీ జీరో ఫేర్ టిక్కెట్..
వయస్సుతో నిమిత్తం లేకుండా అర్హులైన అర్హులైన ప్రతి బాలిక, మహిళ, ట్రాన్స్‌జెండర్ స్త్రీశక్తి పథకంలో జీరో ఫేర్ టిక్కెట్ ద్వారా ఉచిత ప్రయాణ సౌకర్యం సాగించవచ్చు. టిక్కెట్ తీసుకునే సమయంలో ఆర్టీసీ సిబ్బందికి తగిన గుర్తింపుకార్డు చూపించి జీరో టిక్కెట్ పొందాలి. భార్యాభర్తలు, పిల్లలు ప్రయాణించే సమయంలో వారికి వేర్వేరుగా టిక్కెట్టు ఇవ్వడం జరుగుతుంది. బాలికలు, మహిళలకు జీరో టిక్కెట్, బాలురు, పిల్లలకు ప్రయాణ చార్జీతో కూడిన టిక్కెట్ జారీచేస్తాం. టిక్కెట్ల జారీకి సంబంధించి ఎలాంటి గందరగోళానికి తావులేకుండా ఆర్టీసీ సిబ్బందికి ఇప్పటికే తగిన అవగాహన కల్పించాం. శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది. ఆగస్టు 15వ తేదీ నుంచి ఈ పథకం అమలుచేస్తాం. ఆ రోజు ఏ సమయం నుంచి అనేది మార్గదర్శకాల మేరకు ఉంటుంది.
- వైఎస్‌ఎన్ మూర్తి, తూర్పుగోదావరి జిల్లా ప్రజారవాణా అధికారి