Share News

Govt General Hospital:: బిడ్డకో రేటు.. జీజీహెచ్ జీవోటీలో సిబ్బంది దందా

ABN , Publish Date - Aug 26 , 2025 | 10:02 PM

ఉభయ గోదావరి జిల్లా ఆరోగ్య ప్రధాయిని అయిన కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి (జీజీహెచ్)కు ప్రతిరోజు వైద్యం నిమిత్తం సుమారు 4 వేల మంది వస్తుంటారు. వారిలో సుమారు 200 మంది మహిళలు ప్రసూతి వైద్యం నిమిత్తం వస్తుంటారు.

Govt General Hospital:: బిడ్డకో రేటు.. జీజీహెచ్ జీవోటీలో సిబ్బంది దందా
GGH In Kakinada

కాకినాడ, ఆగస్టు 26: ఉభయ గోదావరి జిల్లా ఆరోగ్య ప్రధాయిని అయిన కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి (జీజీహెచ్)కు ప్రతిరోజు వైద్యం నిమిత్తం సుమారు 4 వేల మంది వస్తుంటారు. వారిలో సుమారు 200 మంది మహిళలు ప్రసూతి వైద్యం నిమిత్తం వస్తుంటారు. గైనిక్ విభాగంలో రోజుకు 40 వరకు సాధారణ ప్రసవాలు, 20 వరకు శస్త్ర చికిత్స ద్వారా సిజేరియన్ ప్రసవాలు జరుగుతూ ఉంటాయి. జీజీహెచ్‌లోని గైనిక్ ఆపరేషన్ థియేటర్ (జీవోటీ)కి బిడ్డ అడ్డం తిరిగినా లేక ఉమ్మనీరు తగినా.. ఈ నీరు మోతాదులో లేక పోయినా తదితర కారణాల వల్ల వచ్చే గర్భిణులకు సిజేరియన్ ఆపరేషన్ (శస్త్రచికిత్స) ద్వారా గైనిక్ వైద్యులు ప్రసవం చేస్తారు. అనంతరం అక్కడ ఉన్న సిబ్బంది ఆపరేషన్ అయిన బాలింతను జీఐసియూకు అక్కడ నుంచి సాధారణ వార్డుకు తరలిస్తుంటారు. అదే గైనిక్ విభాగంలోని లేబర్ రూములో సాధారణ ప్రసవాలు జరుగుతుంటాయి.


ఇవే కాకుండా మగ శిశువు పుడితే ఒక రేటు, ఆడ శిశువు పుడితే మరో రేటు అక్కడ సిబ్బంది ఫిక్స్ చేశారు. ఒకవేళ శిశువు జననం తరువాత సిబ్బందికి నగదు వారు అడిగినంత ఇవ్వలేదో ఆ శిశువు తల్లి. కుటుంబీకులకు ఆ సిబ్బంది నరకం చూపెట్టడం ఖాయం. అందువల్ల సామాన్యులు, పేదలు ఉన్నవాళ్ళు తప్పేది లేక ఆ తల్లి బిడ్డలను ఏం చేస్తారోనని భయపడి అప్పోసప్పో చేసి సిబ్బందికి ముడుపులు చెల్లించుకోవడం ఆనవాయితీగా మారిపోయింది.


కొంత మంది. బాధితులు అడపాదడపా ఫిర్యాదు చేస్తున్నా ఆసుపత్రి అధికారులు ఆ సిబ్బందిపై వారం లేదా 10 రోజులు సస్పెండ్ చేస్తూ చర్యలు తీసుకున్నట్టే తీసుకుని తిరిగి వారికి జీవోటీ వద్దే పోస్టింగ్ ఇస్తున్నారు. జీవోటి వద్ద పోస్టింగ్ కావాల్సిన సిబ్బంది సంబంధిత అధికారులకు లేదా కాంట్రాక్టర్లకు రూ.50 వేల నుంచి రూ. 1 లక్ష వరకు లంచాలు ముట్టజెబుతున్నారు. అంటే జీవోటి వద్ద రోజుకు ఎంత ఆదాయం వస్తుందో ఊహించవచ్చు. ఇందుకు ఉదాహరణ ఇటీవల జీజీహెచ్‌లో చోటుచేసుకున్న ఉదంతంతో అసహనానికి గురైన ఓ బాధితుడు. సోమవారం కలెక్టర్ గ్రీవెన్స్‌ సెల్‌లో ఫిర్యాదు చేయడమే కారణం. ఫిర్యాదులోని అంశాలు ఇలా ఉన్నాయి.


తూర్పుగోదావరి జిల్లా, రంగంపేట మండలం నీలపల్లి గ్రామానికి చెందిన ముప్పిడి సునీంద్రకు ప్రియాంకతో వివాహమై ఏడాది దాటింది. ఆమె గర్భం దాల్చడంతో కుటుంబీకులు జీజీహెచ్ గైనిక్ విభాగంలో చూపెట్టేవారు. ఆమెకు 9 నెలలు నిండి నొప్పులు వస్తుండడంతో ఆమెను కుటుంబీకులు ఈ నెల 14న జీజీహెచ్‌లో జాయిన్ చేశారు. అదే రోజు ఆమెను జీవోటీకి తీసుకెళ్లేందుకు అక్కడ సిబ్బంది తొలుత రూ.500 తీసుకున్నారు.


ఆనంతరం ప్రియాంకకు సిజేరియన్ ఆపరేషన్ జరిగి, ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఆ తర్వాత జీవోటీలోని సిబ్బంది రూ. 3 వేలు డిమాండ్ చేశారు. అయితే ప్రియాంక కుటుంబీకులు.. తమ వద్ద అంత నగదు లేదని రూ.1500 ముట్ట చెప్పారు. మిగతా వాళ్ళ వద్ద కూడా రూ.3 వేలు నుంచి రూ. 4వేలు వసూలు చేసినట్లు బాధితుడు సునీంద్ర తెలిపాడు. ఇప్పటికైనా జిల్లా అదికారులు ఈ దందాపై ప్రత్యేక విచారణ జరిపి బాధ్యులైన వారిని విధుల నుంచి పూర్తిగా తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. తద్వారా బాధితులకు న్యాయం చేయాలని సునీంద్ర కలెక్టర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో వేడుకున్నాడు.

Updated Date - Aug 26 , 2025 | 10:02 PM