Share News

MLC Elections 2025: ఎమ్మెల్సీ ఎన్నిక అసలు ఎందుకో తెలుసా.. ఇవాళ ఓటు వేయకపోతే ఏమవుతుంది

ABN , Publish Date - Feb 27 , 2025 | 09:20 AM

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎమ్మెల్సీలను ఎందుకు ఎన్నుకుంటారు. ఎమ్మెల్యేలు ఉండగా ఎమ్మెల్సీలు ఏమి చేస్తారు. శాసనమండలి సభ్యుల బాధ్యత ఏమిటి.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయకపోతే ఏమవుతుందనేది ఈ కథనంలో తెలుసుకుందాం.

MLC Elections 2025: ఎమ్మెల్సీ ఎన్నిక అసలు ఎందుకో తెలుసా.. ఇవాళ ఓటు వేయకపోతే ఏమవుతుంది
MLC Election

తెలుగు రాష్ట్రాల్లో 6 శాసనమండలి స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.తెలంగాణలో రెండు టీచర్స్, ఒక గ్రాడ్యుయేట్ స్థానానికి, ఆంధ్రప్రదేశ్‌లో రెండు గ్రాడ్యుయేట్, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ ప్రారంభమైంది. కొన్నిచోట్ల హోరాహోరీ పోరు నెలకొంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను పోటీలో పెట్టగా, టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి తెలంగాణలో బీజేపీ మాత్రమే తమ అభ్యర్థులను పోటీకి పెట్టింది. పరిమిత సంఖ్యలో ఓటర్లు ఉన్నప్పటికీ ఇటీవల కాలంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రాధాన్యత పెరిగింది. సాధారణంగా ఐదేళ్లకోసారి ఎమ్మెల్యేలను ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించి ఎన్నుకుంటారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొంది, ఓటు వేయ్యొచ్చు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండదు. ఏ రంగానికి సంబంధించిన ఎన్నికైతే ఆ రంగానికి సంబంధించిన వ్యక్తులు మాత్రమే ఎమ్మెల్సీలను ఎన్నుకుంటారు. ప్రతి రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు ఐదేళ్లకోసారి తప్పనిసరి, కానీ శాసనమండలి ఉండాలనే ప్రత్యేక నిబంధన ఏమీ లేదు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో శాసనమండలి వ్యవస్థ లేదు. కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో మాత్రమే శాసనమండలి వ్యవస్థ ఉంది. అసలు ఎమ్మెల్సీ వ్యవస్థను ఎందుకు ఏర్పాటుచేశారు. వీళ్లకుఉండే అధికారాలు ఏమిటో తెలుసుకుందాం.


ఈ రాష్ట్రాల్లో మాత్రమే..

శాసనమండలి ఏర్పడాలంటే కొన్ని నియమ, నిబంధనలు ఉన్నాయి. కనీసం 40 మంది సభ్యులు ఉండాలి. అదే సమయంలో శాసనసభ్యుల సంఖ్యలో 1/3 వ వంతుకు మించకూడదు. ఏదైనా రాష్ట్రంలో శాసనమండలి వ్యవస్థను ఏర్పాటుచేయడానికి ఆ రాష్ట్రంలో ఎమ్మెల్యేల సంఖ్య కనీసం 118 నుంచి 120 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. దేశంలో 31 చోట్ల శాసనసభ వ్యవస్థ అందుబాటులో ఉన్నప్పటికీ కేవలం 15 రాష్ట్రాల్లో మాత్రమే 119 లేదా అంతకంటే ఎక్కువ శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో ఆరు రాష్ట్రాల్లో ప్రస్తుతం శాసనమండలి వ్యవస్థ అందుబాటులో ఉంది. శాసనమండలికి ప్రత్యేక అధికారాలు ఏమి లేకపోయినప్పటికీ, వివిధ రంగాలకు సంబంధించిన సమస్యలను ప్రత్యేకంగా చర్చించడానికి, ఆయా సమస్యలను ప్రభుత్వానికి నివేదించడానికి శాసనమండలికి హక్కు ఉంటుంది. ప్రభుత్వం లేదా శాసనసభ ఏదైనా చట్టాన్ని చేస్తే.. దానిని శాసనమండలి తప్పనిసరిగా ఆమోదించాలనే నిబంధన లేదు. కానీ శాసనసభ ఆమోదించిన తర్వాత.. శాసనమండలి ఆమోదం తెలపకపోయినా ఒకసారి శాసనమండలికి వెళ్లి వస్తే శాసనసభ రెండోసారి ఆమోదిస్తే అది నేరుగా ఆమోదించినట్లు పరిగణిస్తారు. శాసనమండలి సభ్యులు ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉంటారు. మంత్రి మండలిలోనూ శాసనమండలి సభ్యులకు అవకాశం ఇవ్వొచ్చు. శాసనమండలి సభ్యుడు ముఖ్యమంత్రిగానూ ఉండటానికి అవకాశం ఉన్నప్పటికీ శాసనమండలి సభ్యుల అధికారాలు పరిమితంగానే ఉంటాయి.


శాసనమండలి అసలు ఉద్దేశం..

శాసనమండలిలో పలు విభాగాలు ఉంటాయి. సాధారణంగా 1/3 వంతు సభ్యులను శాసనసభ్యుల కోటాలో ఎన్నుకుంటారు. స్థానిక సంస్థల సభ్యుల కోటాలో కొందరిని ఎన్నుకుంటారు. ఇక ఉపాధ్యాయ, పట్టభద్రుల కోటా నుంచి కొందరిని ఎన్నుకోగా.. రాష్ట్రంలో సీట్ల సంఖ్య ఆధారంగా గవర్నర్ కోటాలో కొందరిని ఎన్నుకుంటారు. రాష్ట్రప్రభుత్వం ప్రతిపాదించిన పేర్లకు గవర్నర్ ఆమోదం తెలుపుతారు. అదే సమయంలో ప్రభుత్వం ప్రతిపాదించిన పేర్లను తిరస్కరించే అధికారం గవర్నర్‌కు ఉంటుంది. రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులను, వివిధ రంగాల్లో పేర్గాంచిన వారిని శాసనసమండలికి గవర్నర్ కోటాలో ఎంపిక చేయాలని నిబంధనలు చెబుతున్నాయి. కానీ ఇటీవల కాలంలో రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమిస్తున్న సందర్భాలు ఉన్నాయి. శాసనమండలి సభ్యులను ఎన్నుకోవడం వెనుక ప్రధాన ఉద్దేశం.. వివిధ రంగాలకు సంబంంధించిన ప్రతినిధులుగా వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు.


ఓటు వేయకపోవతే ఏమవుతుంది.

పట్టభద్రుల స్థానానికి ఎమ్మెల్సీ ఎన్నిక జరిగితే గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తిచేసిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావొచ్చు. ఓటరుగా నమోదై ఓటు పొందిన వ్యక్తులు మాత్రమే పట్టభద్రుల ఎమ్మెల్సీని ఎన్నుకుంటారు. ఉపాధ్యాయస్థానం నుంచి కేవలం ఓట్లు కలిగిన ఉపాధ్యాయులు మాత్రమే తమ ప్రతినిధిని ఎన్నుకుంటారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు వేయడం తప్పనిసరి కాదు. కానీ బాధ్యతగా భావించాల్సి ఉంటుంది. గ్రాడ్యుయేట్లు లేదా టీచర్లు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు సరైన వ్యక్తిని ఎన్నుకోవడానికి అందరూ ఓటు హక్కు వినియోగించుకోవల్సి ఉంటుంది. కొందరు నిర్లక్ష్యంగా వ్యవహారిస్తూ ఓటింగ్‌కు దూరంగా ఉంటారు. అలాంటి సందర్భాల్లో సరైన వ్యక్తి శాసనమండలికి వెళ్లే అవకాశం ఉండకపోవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు వేయాలనే నిబంధన ఏమీ లేదు.


ఇవి కూడా చదవండి..

YSRCP vs JANASENA: పవన్‌తో పెట్టుకుంటే అంతే.. దెబ్బ గట్టిగా తగిలిందా

Varanasi Tour: కాశీ వెళ్లాలనుకుంటున్నారా.. తక్కువ ఖర్చుతో ఈజీగా ఇలా ప్లాన్ చేయండి

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Feb 27 , 2025 | 09:20 AM