Share News

AP Govt : పదవులిచ్చారు..జీవో మరిచారు

ABN , Publish Date - Jan 05 , 2025 | 05:51 AM

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత ఆరు నెలల్లో పలు రాజకీయ నియామకాలు జరిపింది. మూడు పార్టీలకు చెందిన నేతలను పలు సంస్థలకు చైర్మన్లుగా నియమించింది.

AP Govt : పదవులిచ్చారు..జీవో మరిచారు

  • నామినేటెడ్‌ చైర్మన్ల తిప్పలు.. ఆరు నెలలక్రితం నియామకం

  • ఇప్పటికీ జారీకాని జీతభత్యాల జీవో

  • సొంత డబ్బుతో నెట్టుకొస్తున్న నేతలు

  • జాప్యం ఎందుకో తెలియక ఆవేదన

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత ఆరు నెలల్లో పలు రాజకీయ నియామకాలు జరిపింది. మూడు పార్టీలకు చెందిన నేతలను పలు సంస్థలకు చైర్మన్లుగా నియమించింది. వీరి నియామకాలపై మొత్తం మూడు జాబితాలు వెలువడ్డాయి. ఎనభై మందికి పైగా నేతలు ఈ పదవులు పొందారు. ఇవే సంస్థల్లో డైరెక్టర్లుగా నియమితమైనవారు దీనికి అదనం. వారి సంఖ్య వందల్లో ఉంటుం ది. చైర్మన్లుగా నియమితులైనవారికి ప్రభుత్వం జీతభత్యాలు ఖరారు చేస్తుంది. వారికి ఆ సంస్థల నుంచి ఆ మేరకు ప్రతి నెలా జీతభత్యాలు అందుతాయి. ఈ నియామకాలకు సంబంధించి రెండు రకాల జీవోలు వెలువడతాయి. ఒక జీవో సంబంధిత సంస్థకు వారిని చైర్మన్‌గా నియమించినట్టు చెబుతూ వెలువడుతుంది. మరో జీవో వారి జీతభత్యాలపై ఉంటుంది. చైర్మన్ల నియామక జీవోలు మాత్రం రాజకీయ నిర్ణయం జరిగిన వెంటనే వెలువడ్డాయి. తర్వాతి జీవో మాత్రం రాలేదు. దీంతో సమస్య తలెత్తింది.

నియామక జీవోతో సరి..

నియామక జీవోలు వెలువడిన వెంటనే చైర్మన్లు అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేశారు. క్రమం తప్పకుండా తమను నియమించిన సంస్థల కార్యాలయాలకు వెళ్లి, సమావేశాల్లో పాల్గొంటున్నారు. స్పోర్ట్స్‌ అఽథారిటీ, పర్యాటక అభివృద్ధి సంస్థ, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ వంటి వాటికి నియమితులైన వారు తమ సంస్థల కార్యకలాపాల పర్యవేక్షణకు రాష్ట్రమంతా తిరుగుతున్నారు. స్వచ్ఛాంధ్రకు నియమితులైన టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి పలు పొరుగు రాష్ట్రాలు కూడా వెళ్లి అక్కడ పారిశుద్ధ్య కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయో పరిశీలన జరిపారు. కానీ వీరెవరికీ ఇంతవరకూ అధికారికంగా జీతభత్యాల ఖరారు జరగకపోవడంతో ప్రస్తుతం జేబులో నుంచి సొంత డబ్బులు తీసి ఖర్చు చేసుకొంటూ తిరుగుతున్నారు.


జీతభత్యాల గురించి అడిగితే బాగుంటుందో లేదోనన్న సంశయంతో వీరెవరూ ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు వెళ్లి అడగలేకపోతున్నారు. ఇదే సమయంలో ఇదే మాదిరిగా ప్రభుత్వ సంస్థల్లో నియమితులైన రిటైర్డ్‌ అధికారులు, ఇతరులకు మాత్రం జీతభత్యాలను ఖరారు చేయడం... జీవోలు ఇవ్వడం వెంటవెంటనే జరిగిపోయింది. రాజకీయ నేతల నామినేటెడ్‌ పదవులకు సంబంధించిన జీవోలు మాత్రం వెలువడటం లేదు. ఏ చైర్మన్‌కు ఎంతెంత జీతభత్యాలు ఇవ్వాలో ముఖ్యమంత్రి ఖరారు చేయాల్సి ఉందని, ఆయనకు సమయం దొరక్క జాప్యం అవుతోందని కొందరు అధికారులు అంటున్నారు. ఇవన్నీ సాధారణంగా ముందే ఖరారై ఉంటాయి. గత టీడీపీ ప్రభుత్వంలో ఎంత ఇచ్చారో ఇప్పుడూ అంతే ఇచ్చినా సరిపోతుందని, ఎందుకు పెండింగ్‌లో పెట్టారో అర్థం కావడం లేదని ఒక చైర్మన్‌ వాపోయారు. వైసీపీ ప్రభుత్వం తన చివరి దశలో కొత్త తరహా ఆదేశాలు ఇచ్చింది. చైర్మన్‌ జీతంలో నుంచి సగం తగ్గించి ఆ మొత్తాన్ని డైరెక్టర్లకు జీతంగా చెల్లించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంపై చైర్మన్లు అప్పట్లోనే గగ్గోలుపెట్టారు. డైరెక్టర్లకు ఇవ్వదల్చుకొంటే విడిగా ఇవ్వాలని, తమ జీతాల్లో కోత కోసి ఇవ్వడం ఏమిటని వారు వాపోయారు. అప్పట్లో వారి వాదనను ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆ ఆదేశాలను కూడా సవరించాల్సి ఉందని, అది కూడా జాప్యానికి ఒక కారణమని కొందరి అభిప్రాయం. మొత్తానికి నామినేటెడ్‌ పదవులు పొందినవారు జీతంలేని చైర్మన్లుగా ప్రస్తుతానికి మిగిలిపోయారు.

Updated Date - Jan 05 , 2025 | 05:51 AM