Share News

Cyber criminals :'ఐ లవ్ యూ'తో భారీగా లాగేస్తున్న సైబర్ నేరగాళ్లు

ABN , Publish Date - Sep 04 , 2025 | 07:58 AM

విజయవాడకు చెందిన ఓ అబ్బాయికి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ అమ్మాయి పరిచయమైంది. ఒకరి వీడియోలకు ఒకరు లైక్లు కొట్టుకున్నారు.. కన్ను కొట్టే ఎమోజీలు వంపుకున్నారు. అమ్మాయి 'ఐ లవ్ యూ'అని మెసేజ్ పెట్టింది.

Cyber criminals :'ఐ లవ్ యూ'తో భారీగా లాగేస్తున్న సైబర్ నేరగాళ్లు
Cyber criminals

ఆంధ్రజ్యోతి-విజయవాడ: విజయవాడకు చెందిన ఓ అబ్బాయికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ అమ్మాయి పరిచయమైంది. ఒకరి వీడియోలకు ఒకరు లైక్లు కొట్టుకున్నారు.. కన్ను కొట్టే ఎమోజీలు వంపుకున్నారు. కొన్ని రోజుల క్రితం ఇన్‌స్టాలోనే అబ్బాయికి అమ్మాయి ఐ లవ్ యూ అని మెసేజ్ పెట్టింది. దీనికి అబ్బాయి ఐ లవ్ యూ టూ అని మెసేజ్ పంపాడు. మర్నాడు అబ్బాయి ఫోన్ నంబరుకు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. ఇన్‌స్టాలో పరిచయమైన అమ్మాయికి ఐ లవ్ యూ అని చెప్తావా? ఈ విషయం ఆమె భర్తకు తెలిసి ఫోన్ పగలు కొట్టేశాడని చెప్పాడు. తామంతా మైలవరం పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నామని.. అక్కడికి రావాలని బెదిరించాడు. ఈ మాటలకు బెదిరిపోయిన అబ్బాయి ఏం చెప్తే అది చేస్తానని ఏడ్చాశాడు. దీన్ని ఒక అవకాశంగా మార్చుకున్న ఆవతలి వ్యక్తి ముందుగా రూ. మూడు వేలు ఫోన్ పే చేయించుకున్నాడు. తర్వాత కాసేపటికి మరో రూ.8 వేలు జమ చేయించుకున్నాడు. కొద్దిరో జుల క్రితం జరిగిన ఘటన ఇది. ఇన్‌స్టాలో సైబర్ నేరగాళ్లు ఫేక్ ప్రొఫైల్తో ఐ లవ్ యూ చెప్పి రూ.11 వేలను లాగేశారు. ఒక నేరంపై ప్రజలకు అవగాహన వచ్చిందని తెలిసిన తర్వాత ఈ మోసంలోకి కొత్త రకం ట్రెండును దింపుతున్నారు. ఇప్పటి వరకు డిజిటల్ అరెస్టులతో ప్రజలను భయపెట్టిన ఈ నేరగాళ్లు కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఇలానే ఒక వ్యాపారికి జరిగిన మోసాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ రెండింటి పైనా పోలీసులు కేసు నమోదు చేశారు.


కారు చూపించి బంగారం కొనేశారు

ఓఎల్ఎక్స్ లో అమ్మకానికి పెట్టిన కారును చూపించి దాన్ని కొనుగోలు చేయాలనుకున్న వ్యక్తి డబ్బులతో సైబర్ నేరగాళ్లు బంగారం బిస్కట్లు కొనిపించారు. ఈ ఘటనలో బాధితుడు సైబర్ నేరగాళ్లకు పంపిన డబ్బులు మరో ఖాతాలోకి వెళకుండా పోలీసులు 'బాక్' వలయం బిగించారు. గొల్లపూడికి చెందిన అనపర్తి శ్రీకాంత్ కారుల కొనుగోలు, అమ్మకాలు చేస్తుంటాడు. ఏపీ 39 క్యూటీ 6856 నంబరు గల ఇన్నోవా క్రిస్టా కారు 30 వేల కిలోమీటర్లు తిరిగింది. దీని యజమాని ఓఎల్ఎక్స్ లో అమ్మకానికి పెట్టారు. దీన్ని గమనించిన సైబర్ నేరగాళ్లు మోసానికి ప్రణాళిక వేశారు. ఓఎల్ఎక్స్ లో ఉన్న కారు ఫొటోను, దాని కింద ఉన్న ఫోన్ నంబరును సైబర్ నేరగాళ్లు తీసుకున్నారు. ఈ కారు ఫొటోను శ్రీకాంత్ వాట్సాప్ కు పంపారు. కారును చూసుకోవడానికి వెళ్లాల్సిన ప్రదేశం చెప్పి పంపించారు. కారును చూసుకోవడానికి తాము వస్తున్నామని యజమానితో ఫోన్లో మాట్లాడారు. ఆయన తన బావమరిది నంబరు ఇచ్చారు.. అదే నంబరు శ్రీకాంత్ కు ఇచ్చారు. కారు నచ్చడంతో శ్రీకాంత్ కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నాడు. రూ. 11 లక్షలకు బేరం కుదిరింది.


ఆ మొత్తాన్ని పంపించేందుకు నేరగాళ్ళు తునిలో ఉన్న ఓ జువెలరీ షాపు బ్యాంక్ ఖాతా నంబరు ఇచ్చారు. శ్రీకాంత్ డబ్బుల్ని ఆర్టీసీఎస్ ద్వారా పంపేటప్పుడు జువెలరీ షాపు పేరు వచ్చింది. దీనితో ఆయన సైబర్ నేరగాళ్లతో మాట్లాడారు. అకౌంట్ పేరు జువెలరీ షాపు పేరు మీద ఉందని అడిగితే దానికే డబ్బులు పంపమని చెప్పారు. ఈ డబ్బులతో సైబర్ నేరగాళ్లు బంగారం బిస్కట్లు కొనుగోలు చేశారు. డబ్బులు పంపిన తర్వాత సందేహం వచ్చి కారును చూపించిన వ్యక్తికి మొత్తం డబ్బులు పంపానని అన్నాడు. ఆయన తనకు ఎలాంటి డబ్బులు రాలేదని చెప్పాడు. దీనితో మోసపోయాయని గ్రహించిన శ్రీకాంత్ వెంటనే సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. అదే సమయంలో బ్యాంక్ మేనేజర్ కు ఫోన్ చేసి తాను పంపిన డబ్బులను బ్లాక్ చేయాలని చెప్పాడు. బ్యాంక్ మేనేజర్ బ్లాక్ చేయకుండా లీన్(ఆ మొత్తాన్ని మాత్రమే బ్లాక్ చేయడం)చేశారు. కేసు నమోదు చేసిన సైబర్ క్రైం పోలీసులు నోటీసులు ఇవ్వడంతో మొత్తం అకౌంట్ ను బ్లాక్ చేశారు. ఈ కేసులో ఒక్క రూపాయి ఈ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకట్ట వేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రికార్డు స్థాయికి బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

నిన్ను.. నీ కుటుంబాన్ని చంపేస్తాం

Read Latest Telangana News and National News

Updated Date - Sep 04 , 2025 | 08:23 AM