సాగునీటి ప్రాజెక్టులు ప్రైవేటుకా?: రామకృష్ణ
ABN , Publish Date - Jan 01 , 2025 | 05:30 AM
‘గోదావరి-బానకచర్ల అనుసంధానం చేసి రాయలసీమలో కరువు, వలసలను శాశ్వతంగా నివారించాలనే సీఎం చంద్రబాబు సంకల్పాన్ని స్వాగతిస్తాం.
కర్నూలు, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): ‘గోదావరి-బానకచర్ల అనుసంధానం చేసి రాయలసీమలో కరువు, వలసలను శాశ్వతంగా నివారించాలనే సీఎం చంద్రబాబు సంకల్పాన్ని స్వాగతిస్తాం. అయితే ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణ ప్రైవేటు సంస్థలకు అప్పగించాలనే ఆలోచన సరైనది కాదు. ఇది ప్రమాదకరమైన నిర్ణయం’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. కర్నూలులో మంగళవారం సీపీఐ శత వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన సభలో రామకృష్ణ మాట్లాడుతూ గోదావరి-బానకచర్ల అనుసంధానాన్ని కేంద్ర నిధులతోనే పూర్తి చేయాలని, లేకుంటే రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టాలన్నారు. అయితే ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణ ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తే భవిషత్తులో రైతులు నీటిని కొనుక్కోవాల్సి వస్తుందన్నారు. చంద్రబాబులో మళ్లీ పాత ఆలోచనలు పురుడుపోసుకుంటున్నాయన్నారు. ఎన్నికల ముందు విద్యుత్ చార్జీలు పెంచేది లేదని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు చార్జీలు పెంచి ప్రజలను మోసం చేశాడని ఆరోపించారు.