Illegal Constructions : విశాఖ బీచ్‌రోడ్డులో అక్రమ నిర్మాణాలపై సర్వే
ABN , Publish Date - Feb 09 , 2025 | 03:37 AM
అక్రమ నిర్మాణాల లెక్కలు వారంలో తేల్చాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఎట్టకేలకు అధికారగణంలో కదలిక వచ్చింది.

విజయసాయిరెడ్డి కుమార్తె అక్రమ నిర్మాణాల పరిశీలన
హైకోర్టు ఆదేశాలతో కదిలిన అధికారుల బృందం
విశాఖపట్నం/భీమునిపట్నం, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): విశాఖ నుంచి భీమిలి వరకూ సముద్ర తీరాన్ని ఆనుకొని కోస్తా నియంత్రణ మండలి(సీఆర్‌జెడ్) పరిధిలోని అక్రమ నిర్మాణాల లెక్కలు వారంలో తేల్చాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఎట్టకేలకు అధికారగణంలో కదలిక వచ్చింది. భీమిలి బీచ్‌లో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి అక్రమ నిర్మాణం చేపడుతున్నారంటూ జనసేన నాయకుడు పీతల మూర్తియాదవ్ ఇటీవల హైకోర్టులో కేసు వేశారు. అనధికార నిర్మాణాలు కూల్చాలని, ఎంత మేరకు ఆక్రమించారో వివరాలు సమర్పించాలని కోర్టు ఆదేశించినా సర్వే బాధ్యత తమది కాదంటే..తమది కాదంటూ పలు శాఖల అధికారులు తప్పించుకుంటూ వివరాలు సమర్పించకుండా జాప్యం చేస్తున్నారు. దీనిపై ఈ నెల 5వ తేదీన న్యాయస్థానం గట్టిగా హెచ్చరించింది. అన్ని శాఖల్లో బాగా పనిచేసే అధికారులతో బృందాన్ని నియమించి వారితో సర్వే చేయించి వారం రోజుల్లో వివరాలు సమర్పించాలని ఆదేశించింది. దాంతో భీమిలి ఆర్డీవో సంగీత్ మాధుర్, జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ డీసీపీ హరిదాస్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ సైంటిస్ట్ జవహర్, భీమిలి జోనల్ కమిషనర్ ప్రేమ ప్రసన్నవాణి, తహసీల్దార్ పైలా రామారావు తదితర అధికారుల బృందం శనివారం భీమిలి తీరంలో సర్వే నిర్వహించింది. నేహారెడ్డి నిర్మాణాలు చేపట్టిన ప్రాంతంలో తొలుత సర్వే చేశారు. ఆ తరువాత ప్రభుత్వ సమీకృత వసతిగృహం నుంచి తిమ్మాపురం తీరం వరకూ సర్వే జరిపారు.
ఎస్‌ఓఎస్ జంక్షన్‌లో ఉన్న బి-జాగ్, కొబ్బరితోట పార్క్ పక్కనున్న తీరం రిసార్ట్, ఎర్రమట్టి దిబ్బల దగ్గరున్న మార్లిన్ కే, తొట్లకొండ రోడ్డులోని శాంక్టమ్ రిసార్టులు, రెస్టోబార్‌లు, తిమ్మాపురం జంక్షన్‌లోని విరాగో రెస్టారెంట్, రామానాయుడు స్టూడియో రోడ్డులోని సార్ట్ వాటర్ రెస్టారెంట్ తీరం వరకూ ఈ సర్వే కొనసాగింది. సీఆర్‌జడ్ ఉల్లంఘనలు, అనుమతులు లేకుండా చేపట్టిన అనధికారిక నిర్మాణాల వివరాలు నమోదు చేశారు. ఎఫ్‌ఎంబీ రికార్డుల్లోని వివరాలను రెవెన్యూ, జీవీఎంసీలో రికార్డులతో పోల్చి చూశారు. జిల్లా కలెక్టర్‌కు నివేదిక అందజేస్తామని భీమిలి ఆర్డీవో సంగీత్ మాధుర్ చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Pawan Kalyan: ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం.. పవన్ కల్యాణ్ రియాక్షన్ ఇదే..
Betting Apps: బెట్టింగ్ యాప్స్ భూతానికి మరో యువకుడు బలి..