YCP Govt Scams: మా వాడే.. వదిలేయండి
ABN , Publish Date - Jun 02 , 2025 | 02:49 AM
వైఎస్ జగన్ పాలనలో అవినీతికి పాల్పడ్డ అధికారులను కాపాడేందుకు కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు లేఖలు రాస్తున్నారు. ప్రాసిక్యూషన్ అడ్డుకునేందుకు శాఖాపరమైన విచారణలు మాత్రమే చేయాలంటూ ఒత్తిళ్లు పెడుతున్నారు.
అవినీతిపరులకు నేతల అండ!
ప్రాసిక్యూషన్ వద్దంటూ లేఖలు
శాఖాపరమైన విచారణకు సిఫారసులు
జగన్ జమానాలో తప్పులు చేసిన వారిని కాపాడేందుకు విశ్వప్రయత్నాలు
ఉత్తరాంధ్ర మంత్రి వరుస లేఖలు
మరో మంత్రి ప్రత్యేక కౌంటర్
సిఫారసు లేఖలు తెచ్చుకుంటేనే
పరిష్కరిస్తానంటున్న ఇంకో మంత్రి
వారి బాటలోనే మరి కొందరు నేతలు
జగన్ ప్రభుత్వంలో అనేక అక్రమాలు, అవినీతికి పాల్పడిన వారిపై కూటమి ప్రభుత్వం విచారణ చేపట్టి చర్యలు తీసుకునేందుకు సన్నద్ధమవుతుంటే.. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అక్రమార్కులను కాపాడేందుకు లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. వారిపై ఏ చర్యలూ తీసుకోకుండా అడ్డుపడుతున్నారు. ప్రాసిక్యూషన్ చేయాలని ఏసీబీ సిఫారసు చేసిన కేసులను కూడా నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. దీని వెనుక నేతల ‘సొంత ఆర్థిక ప్రయోజనాలు’ ఉన్నాయని అధికార వర్గాలే చెబుతున్నాయి.
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
డిప్యూటీ కలెక్టర్‌గా ఉన్న ఒక అధికారి... తహశీల్దార్‌గా పనిచేసిన కాలంలో అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుతోపాటు లెక్కలేనంత డబ్బుతో ఏసీబీకి దొరికిపోయారు. ఆయన్ను ప్రాసిక్యూట్ చేయాల్సిందేనని ఏసీబీ కోరగా... ‘వద్దే వద్దు’ అంటూ ఒక మంత్రి రంగప్రవేశం చేశారు. శాఖాపరమైన విచారణతో సరిపెట్టాలంటూ అధికారికంగానే లేఖ రాసేశారు. అవినీతి నిరోధక చట్టం, ఇతర చట్టాల పరిధిలోని కీలక సెక్షన్ల కింద నేరం నిరూపితమైతే నేరుగా జైలుకే! అదే.. శాఖాపరమైన విచారణ జరిగితే తూతూమంత్రపు చర్యలే! మచ్చుకు ఇది ఒక్క ఉదాహరణ మాత్రమే! వైసీపీ హయాంలో తప్పులు చేసి దొరికిపోయి, అవినీతికి సంబంధించి ఆధారాలు సేకరించి, వివిధ దశల్లో అక్రమాలను నిర్ధారించిన తర్వాత ప్రాసిక్యూషన్ కోసం సిఫారసు చేసిన అనేక కేసులను నీరుగార్చేందుకు నేతలు రంగంలోకి దిగుతున్నారు. వైసీపీ హయాంలో భూములు, రహదారులు, మైన్స్, పురపాలన, సర్వే, సెటిల్‌మెంట్, పరిశ్రమలు, మౌలిక వనరులు, వైద్య, ఆరోగ్యం, ఎక్సైజ్, పౌరసరఫరాలు, వ్యవసాయం, సహకార రంగాల్లో అనేక అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆయా శాఖల వారీగా జరిగిన తప్పులపై విచారణ చేయిస్తోంది. నేరుగా విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ఈ కేసులను పరిశీలిస్తోంది.
డిప్యూటీ కలెక్టర్ నుంచి గ్రామస్థాయి రెవెన్యూ అధికారి వరకు.. గనుల శాఖలో సర్వేయర్ నుంచి జిల్లా స్థాయి అధికారి దాకా.. ఇలా ఆయా శాఖల్లో కలిపి 32మందిపై ప్రాసిక్యూషన్ కోరుతూ ఏసీబీ లేఖలు రాసింది. పక్కా ఆధారాలు ఉండి కోర్టు విచారణ తప్పనిసరని నిర్ధారించుకున్న తర్వాతే ఏసీబీ ప్రాసిక్యూషన్‌కు అనుమతి కోరుతుంది. అయితే ప్రాసిక్యూషన్ కేసుల నుంచి బయటపడేందుకు అక్రమార్కులైన అధికారులు అడ్డదారులు తొక్కుతున్నారు. కీలక పోస్టుల్లో ఉన్న మంత్రులతో, బాగా పరపతి ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మంత్రాంగం నడుపుతున్నారు. భారీ డీల్స్ మాట్లాడుకుని సెటిల్ చేసుకుంటున్నారు. ‘ఆంధ్రజ్యోతి’ సేకరించిన సమాచారం ఇప్పటిదాకా ఆరుగురు మంత్రులు ఈ వ్యవహారంలో తలదూర్చారు. ఇక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలయితే లెక్కేలేదు. ఆ లేఖలు కొందరు ప్రజాప్రతినిధులకు ఆదాయవనరుగా మారిందని అంటున్నారు. మచ్చుకు కొన్ని ఉదంతాలు..
మైకుల ముందే భారీ డైలాగులు!
ఉత్తరాంధ్రకు చెందిన ఓ మంత్రి.. ఓ డిప్యూటీ కలెక్టర్ విషయంలో లేఖ రాశారు. ప్రాసిక్యూషన్ వద్దు.. శాఖాపరమైన విచారణే చేయండని పదేపదే ఒత్తిడి చేశారు. ఈయనే రెవెన్యూలో ఓ మండల స్థాయి అధికారి విషయంలోనూ మరో లేఖ రాశారు. డిస్మిస్ చేయాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, తిరిగి ఉద్యోగం ఇచ్చి మంచి ప్రాంతంలో పోస్టింగ్ ఇవ్వాలని ఈ ఏడాది రెండు పేజీల లేఖరాశారు. జగన్ జమానాలో అనేక అవినీతి చర్యలకు పాల్పడిన ఓ పురపాలక శాఖ అధికారిని కూడా వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి సుద్దపూస.. అవినీతి ఎలా ఉంటుందో కూడా తెలియదని లేఖలో కితాబిచ్చారు. ఈ లేఖను ఉన్నతాధికారి చదువుతారో లేదోనన్న సందేహం వచ్చి ఫోన్‌లోనూ వివరించారట! ఆయన దగ్గర పనిచేస్తున్న ఆత్మీయుడైన ఓఎస్డీ ఇంకో రెండాకులు ఎక్కువే చదివారు. విజిలెన్స్ కేసుల ఆధారంగా అభియోగాలు ఎదుర్కొంటున్న వారిని కాపాడేలా మంత్రి పేరిట కొన్ని లేఖలు రాశారు.
ప్రత్యేక టీంతో సెటిల్‌మెంట్లు!
కోస్తాకు చెందిన మరో మంత్రి తీరే వేరు. ఏరికోరి ఏసీబీ, విజిలెన్స్ కేసుల పరిష్కారానికి ఓ ప్రత్యేక టీంను వేసుకున్నారు. ముగ్గురు రిటైర్డ్ ఉద్యోగులను నియమించి.. తన వద్దకు వచ్చే పిటిషన్లను పరిశీలించే బాధ్యత అప్పగించారు. వాటిలో కాసులు కురిపించే వాటిని సెటిల్ చేస్తున్నారు. అందులో ఏసీబీ ప్రాసిక్యూషన్ కేసులకు ప్రత్యేక కౌంటర్ తెరిచారు. ఓ మున్సిపల్ అధికారి ఏసీబీకి పట్టుబడిన కేసులో శాఖాపరమైన విచారణ మాత్రమే చేపట్టాలని లేఖ పంపించారు.
సిఫారసు లేఖలు తెచ్చుకోండి..
కోస్తాకే చెందిన ఇంకో మంత్రి శైలే వేరు. ఆయన వద్ద కీలక శాఖలున్నాయి. వాటిలోని ఉద్యోగులు.. లేదా ఆ శాఖలతో ప్రభావితమవుతున్న సాధారణ ప్రజలు.. తమ సమస్యల పరిష్కారానికి ఆయన వద్దకు వెళ్తే.. ‘మీ ఎమ్మెల్యే సిఫారసు లేఖ ఉందా? మీ జిల్లా మంత్రి సిఫారసు లేఖ ఉందా? అవి ఉంటే మాట్లాడండి. లేదంటే వెళ్లి తెచ్చుకోండి’ అని అంటారు. ఆయన దగ్గర పనిచేసే ఓ కీలక రిటైర్డ్ అధికారి కూడా ఇదే చెబుతారు. దీంతో ప్రజలు విధిలేక ఎమ్మెల్యే సిఫారసు లేఖలకోసం తిరుగుతున్నారు. ఇటీవలి కాలంలో తనకు సహచర మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు రాసిన లేఖలను క్రోడీకరించి వాటిల్లోని అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకె ళ్లారని తెలిసింది. తనపై ఏదైనా ఆరోపణ వస్తే.. సహచర మంత్రులు, ఎమ్మెల్యేల కోరిక మేరకే కొన్నిపనులు చేయాల్సి వస్తోందని.. ఇందులో వ్యక్తిగత లాభమేమీ లేదని అమాయకత్వం ప్రదర్శించినట్లు సమాచారం.
అవినీతి సర్వేయరుకు అండ..
తీవ్ర అవినీతిలో కూరుకుపోయిన ఓ రాయలసీమ సర్వేయర్‌ను అదే ప్రాంతానికి చెందిన అధికార పార్టీ ఎమ్మెల్సీ వెనకేస్తున్నారు. అతడిపై అవినీతి కేసు నిర్ధారణ అయినందున ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వాలని రెవెన్యూ శాఖకు ఏసీబీ చీఫ్ లేఖ రాశారు. అయితే ఈ కేసును ఏసీబీ సరిగా విచారించలేదని.. ఆ సర్వేయర్ ఉత్తముడని, ప్రాసిక్యూషన్‌కు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఇవ్వకూడదని ఆ ఎమ్మెల్సీ జనవరిలో సర్కారుకు లేఖ రాశారు. గతంలోనూ ఆయన బెరైటీస్, ఇతర ఖనిజాల కాంట్రాక్టు సంస్థలు, కంపెనీలను తన లేఖాస్త్రాలతో భయపెట్టారు. పార్టీ అధిష్ఠానం మందలించడంతో ఇప్పుడు ఏసీబీ, విజిలెన్స్ కేసులపై కన్నేశారు.
దేనికైనా చేయి తడపాల్సిందే..!
కోస్తాకు చెందిన ఓ ఎమ్మెల్యే గతంలో మంత్రిగా కూడా పనిచేశారు. తిరుమల దర్శనార్థం లేఖల నుంచి ఏసీబీ కేసుల్లో రక్షణ కోరే సిఫారసు లేఖల వరకు డబ్బు వసూలు చేస్తారన్న పేరుంది. సొంత పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలపై ఫిర్యాదులుంటే.. ఉన్నత స్థాయి వర్గాలను రాచిరంపానపెట్టి చివరకు సెటిల్‌మెంట్ చేసుకుంటార ని టీడీపీ నేతలే ఆయనపై మండిపడుతుంటారు. స్పెషల్ సీఎస్ సాయిప్రసాద్ సీసీఎల్‌ఏ, రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమయంలో అనేక మంది డిప్యూటీ కలెక్టర్‌లకు తహశీల్దార్లుగా.. తహశీల్దార్లకు డిప్యూటీ తహశీల్దార్లు, ఆర్‌ఐలుగా రివర్షన్ ఇచ్చారు. ఇలా రివర్షన్ పొందిన ఇద్దరు తహశీల్దార్లపై తీసుకున్న చర్యలను నిలిపివేసి.. వారిని తిరిగి అసలైన పోస్టుల్లో కూర్చోబెట్టాలంటూ సదరు ఎమ్మెల్యే గతేడాది ఒకటి, ఈ ఏడాది ఫిబ్రవరిలో మూడు లేఖలు రాశారు. తన సిఫారసుల ఆధారంగా చర్యలు తీసుకోకపోతే ప్రజాందోళనలు చేస్తామని హెచ్చరించారాయన.