CM Chandrababus Record Outreach: 40 రోజుల్లో 1.20 కోట్ల ఇళ్లకు
ABN , Publish Date - Aug 14 , 2025 | 03:53 AM
రాష్ట్రవ్యాప్తంగా 1.50 కోట్ల ఇళ్లు ఉంటే 40 రోజుల్లో 1.20 కోట్ల ఇళ్లకు వెళ్లి ప్రభుత్వం చేసిన మంచిని మన పార్టీ శ్రేణులు..
దేశంలో ఏ అధికార పార్టీ ఈ స్థాయిలో జనంలోకి వెళ్లలేదు: సీఎం
‘సుపరిపాలనలో తొలి అడుగు’తో రికార్డు సాధించాం.. చాలా చోట్ల బాగా జరిగింది
13 నియోజకవర్గాల్లో వెనుకబాటు.. అక్కడి ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జులను సంజాయిషీ కోరాలి
‘స్త్రీ శక్తి’తో 90ు హామీలు నెరవేర్చినట్లే.. దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత పార్టీ శ్రేణులదే
‘సూపర్ సిక్స్ సూపర్ హిట్’ పేరుతో 25న అనంతలో భారీ సభ: చంద్రబాబు
టీడీపీ కేంద్ర కార్యాలయానికి రాక.. పల్లా, లోకేశ్‌లతో సమావేశం
పార్టీ కార్యక్రమాలపై సుదీర్ఘ సమీక్ష.. కార్యకర్తల సంక్షేమంపై ఆరా
అమరావతి, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రవ్యాప్తంగా 1.50 కోట్ల ఇళ్లు ఉంటే 40 రోజుల్లో 1.20 కోట్ల ఇళ్లకు వెళ్లి ప్రభుత్వం చేసిన మంచిని మన పార్టీ శ్రేణులు తెలియజేశాయి. దేశంలో ఏ అధికార పార్టీ కూడా ఈ స్థాయిలో ప్రజల్లోకి వెళ్లిన దాఖలా లేదు. మంచి చేశాం కాబట్టే ధైర్యంగా వారిలోకి వెళ్లగలిగాం’ అని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన ఆయన రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి లోకేశ్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పార్టీ నిర్దేశించిన కార్యక్రమం ‘సుపరిపాలనలో తొలి అడుగు’పై సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమం చాలా చోట్ల ఎంతో బాగా జరిగినా 13 నియోజకవర్గాల్లో సరిగా జరగలేదని.. అక్కడి ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జులకు లేఖలు రాసి ఏ కారణాలతో తిరగలేకపోయారో, ఎందుకు వెనుకబడ్డారో సంజాయిషీ కోరాలని చంద్రబాబు పల్లాను ఆదేశించారు. నామినేటెడ్ పదవుల్లో ఎమ్మెల్యేలు సిఫారసు చేసిన వారితోపాటు పార్టీ కోసం పనిచేసే వారికీ ప్రాధాన్యం ఉండేలా చూడాలని సూచించారు. 15న స్త్రీశక్తి పథకం ప్రారంభిస్తే సూపర్ సిక్స్ హామీల్లో 90 శాతం అమలు చేసినట్లేనన్నారు. ఈ స్కీమును మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆగస్టు 18 నుంచి ఐదు రోజులపాటు ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని ఆదేశించారు. ఈ నెల 25న అనంతపురంలో ‘సూపర్ హిట్ సూపర్ సిక్స్’ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.
100 మంది కార్యకర్తల ఇళ్లకేనా వెళ్లేది!
టీడీపీ కార్యకర్తల సంక్షేమంపైనా చంద్రబాబు సమీక్షించారు. కార్యకర్తలకు బీమా అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. 400 మంది కార్యకర్తలు ప్రమాదాల్లో చనిపోతే వారందరికీ బీమా వర్తింపజేశామని, సుమారు రూ.20 కోట్లు వారి కుటుంబాలకు అందించామని పల్లా తెలిపారు. అయితే ప్రజాప్రతినిధులు గానీ, పార్టీ నాయకులు గానీ 100 మంది కార్యకర్తల ఇళ్లకు మాత్రమే వెళ్లారని ఆయన చెప్పడంతో సీఎం సీరియస్ అయ్యారు. ‘కార్యకర్తల విషయంలో ఇంత ఉదాశీనంగా వ్యవహరిస్తే ఎలా? ఇకపై అలాంటి వారిపై సీరియ్‌సగా దృష్టి పెట్టండి’ అని ఆదేశించారు.
1.08 లక్షల మంది కార్యకర్తలు ప్రజల వద్దకు!
చంద్రబాబు సమీక్ష వివరాలను పల్లా విలేకరులకు తెలియజేశారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా 40 రోజులపాటు ప్రతిరోజూ 1.08 లక్షల మంది పార్టీ కార్యకర్తలు జనం వద్దకు వెళ్లి.. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో చేసిన మంచిని వివరించారని చెప్పారు. అలాగే పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారో కూడా తెలుసుకున్నారని.. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రశాంతంగా ఉంటున్నామని, గత ఐదేళ్లూ రాక్షస పాలన సాగిందని అధిక శాతం మంది అభిప్రాయపడ్డారని తెలిపారు. ‘గతంలో ఎమ్మెల్యేలు మాత్రమే నియోజకవర్గంలో తిరిగేవారు. ఈసారి పార్టీ శ్రేణులు ప్రజల్లోకి వెళ్లాయి. జూన్ 2 నుంచి ఆగస్టు 10 వరకు 40 రోజులపాటు నిర్వహించిన తొలి అడుగు కార్యక్రమంలో 13 నియోజకవర్గాలు మాత్రమే 30వేల ఇళ్లలోపు తిరిగిన జాబితాలో ఉన్నాయి. ఎందుకు తిరగలేకపోయారో ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జుల నుంచి వివరణ కోరతాం. మంత్రి లోకేశ్ సలహాతో ఈ కార్యక్రమానికి సాంకేతికతను జోడించడంతో తూతూ మంత్రంగా ముగించడానికి ఆస్కారం లేకుండా పోయింది. పార్టీ కొత్తగా ఏర్పాటు చేసుకున్న క్లస్టర్, యూనిట్, బూత్ విభాగాలు దీని విజయవంతానికి బాగా కృషిచేశాయి. వైసీపీ పాలనలో ఇబ్బందులు పడి, పార్టీ కోసం పోరాడిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలని పార్టీ అధినేత ఆదేశించారు. ఆయన సూచనల మేరకు నామినేటెడ్ పదవుల్లో వారికే ప్రాధాన్యం ఇస్తున్నాం. కార్యకర్తల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నాం. దేశంలో ఏ పార్టీ చేపట్టని విధంగా వారికి ప్రమాద బీమా అమలు చేస్తున్నాం. ఏడాది కాలంలో 400 మంది కార్యకర్తలు ప్రమాదవశాత్తూ మృత్యువాత పడితే వారికి రూ.20 కోట్లు చెల్లించాం’ అని తెలిపారు.
నియోజకవర్గాల్లోనే ఫిర్యాదుల స్వీకరణ
ప్రతి నియోజకవర్గంలో శుక్ర, శనివారాల్లో స్థానిక ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పామని, ఇకపై దీనిపై పార్టీ అధిష్ఠానం మరింత సీరియ్‌సగా ఉంటుందని పల్లా తెలిపారు. ఆ రోజుల్లో ప్రజలకు అందుబాటులో ఉండి వారి నుంచి ఫిర్యాదులు స్వీకరించాలని ఎమ్మెల్యేలందరికీ స్పష్టంగా చెప్పాల్సిందిగా చంద్రబాబు ఆదేశించారని చెప్పారు. 10 నెలల కాలంలో కేంద్ర కార్యాలయానికి సుమారు 9 లక్షల ఫిర్యాదులు వస్తే వాటిలో 6 లక్షల వరకు రెవెన్యూ సంబంధిత సమస్యలేనన్నారు. వీటిలోనూ ఎక్కువ ఆస్తి తగాదాలేనని చెప్పారు.
సీఎంకు చైర్మన్ల కృతజ్ఞతలు
కార్పొరేషన్లకు కొత్తగా నియమితులైన పలువురు చైర్మన్లు బుధవారం పార్టీ కార్యాలయానికి వచ్చి సీఎం ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వీరిలో సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య, కమ్మ కార్పొరేషన్ చైౖర్మన్ నాదెండ్ల బ్రహ్మం, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చిరాం ప్రసాద్ తదితరులు ఉన్నారు.
అర్జీలు స్వీకరించిన బాబు, లోకేశ్
టీడీపీ కేంద్ర కార్యాలయానికి తరలివచ్చిన ప్రజల నుంచి చంద్రబాబు, లోకేశ్ ఫిర్యాదులు స్వీకరించారు. వారందరినీ ఆత్మీయంగా పలుకరించి.. సమస్యలను తెలుసుకుని అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానని లోకేశ్ హామీ ఇచ్చారు.