Share News

CM Chandrababu : పదేళ్ల ప్రణాళికతో ‘ఆర్గానిక్‌ కుప్పం’

ABN , Publish Date - Jan 05 , 2025 | 04:24 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోని అన్ని గ్రామాల రైతులను ప్రకృతి వ్యవసాయం పరిధిలోకి తెచ్చే లక్ష్యంతో ఏపీ రైతు సాధికార సంస్థ ‘ఆర్గానిక్‌ కుప్పం’ పేరుతో పదేళ్ల ప్రణాళికను అమలు చేయనున్నది.

CM Chandrababu  : పదేళ్ల ప్రణాళికతో ‘ఆర్గానిక్‌ కుప్పం’

  • అన్ని గ్రామాల రైతులను ప్రకృతి

  • వ్యవసాయ పరిధిలోకి తేవడమే లక్ష్యం

  • బీడు భూములూ ఉత్పాదక క్షేత్రాలుగా..

  • సవాళ్ల నేపథ్యంలో ఒక మోడల్‌గా అమలు

  • రేపు ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు

అమరావతి, జనవరి 4(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోని అన్ని గ్రామాల రైతులను ప్రకృతి వ్యవసాయం పరిధిలోకి తెచ్చే లక్ష్యంతో ఏపీ రైతు సాధికార సంస్థ ‘ఆర్గానిక్‌ కుప్పం’ పేరుతో పదేళ్ల ప్రణాళికను అమలు చేయనున్నది. సీఎం చంద్రబాబు ఈనెల 6న నియోజకవర్గంలోని శీగలపల్లెలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. వంద శాతం మంది రైతులు ప్రకృతి వ్యవసాయ విధానాలను ఆచరించేలా పదేళ్ల ప్రణాళికను ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా సీఎంతో పలు ఆర్గానిక్‌ సంస్థల ప్రతినిధులు భేటీ కానున్నారు. ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాన్ని అమలు చేస్తున్న రైతు సాధికార సంస్థ ఈ ప్రణాళికను అమలు చేయనున్నది. నియోజకవర్గంలోని పూర్తి భూ విస్తీర్ణంలో ప్రకృతి సేద్యం జరిగేలా చర్యలు చేపట్టనున్నారు. ముఖ్యంగా బీడు భూముల్ని కూడా ఉత్పాదక క్షేత్రాలుగా తీర్చిదిద్దేలా ప్రణాళిక రూపొందించారు. దేశవ్యాప్తంగా రైతులు పర్యావరణ, వాతావరణ, ఆర్థిక, ఆరోగ్య సంబంధిత సవాళ్లను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆ అవరోధాలను అధిగమించి.. ప్రజల, భూమి ఆరోగ్యం మెరుగుపడేలా ఈ ప్రణాళికను ఒక నమూనాగా అమలు చేయనున్నారు. కుప్పం నియోజకవర్గంలోని 95 పంచాయతీల పరిధిలో 1,15,055 ఎకరాల భూమి ఉండగా, 62,888 ఎకరాల్లోనే ప్రస్తుతం పంటల సాగు జరుగుతోంది. 52,167 ఎకరాలు బీడుగా ఉంది. 60,031 కుటుంబాలకు భూమి ఉంది. ఇందులో 95 శాతం సన్న, చిన్నకారు రైతు కుటుంబాలున్నాయి. 17,328 వ్యవసాయ కార్మిక కుటుంబాలున్నాయి. వీరు జీవనోపాధికి వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు.


  • విత్తనం నాటే నుంచి పంట చేతికొచ్చే వరకు..

2028-29 నాటికి కనీసం 70ు మంది రైతులు ప్రకృతి సేద్యంతో రసాయన రహిత వ్యవసాయం చేసేలా, 20ు బీడు భూముల్ని సాగులోకి తెచ్చేలా వ్యవసాయశాఖ, రైతుసాధికార సంస్థ ప్రణాళికలు అమలు చేయనున్నాయి. గ్రామైక్య సంఘాలను భాగస్వామ్యం చేసి, 2025-26 నాటికి అన్ని గ్రామాల రైతులను ప్రకృతి వ్యవసాయం చేసేలా ప్రోత్సహించనున్నారు. ప్రీ-మాన్సూన్‌, డ్రై సోయింగ్‌ పద్ధతులను ముమ్మరం చేయనున్నారు. 365 రోజులూ నేలను పంటలతో ఉంచడం ద్వారా భూమికి మేలు చేసే సూక్ష్మపోషకాలు వృద్ధి కావడానికి వీలౌవుతుంది. ఇందులో భాగంగా ఏప్రిల్‌, మే నెలల్లోనూ అనువైన పంటలు సాగు చేయనున్నారు. తద్వారా వాతావరణం, భూమి ఆరోగ్యం మెరుగవుతుందని వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. విత్తనం నాటిన దగ్గర నుంచి పంట చేతికొచ్చే వరకు ప్రకృతి వ్యవసాయ విధానాన్ని రైతులు పాటించేలా చూడనున్నారు. రైతులు పండించే సహజ సేద్య ఉత్పత్తులకు ఫుడ్‌ బాస్కెట్‌ ద్వారా పౌష్టికాహారానికి మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించడం, ప్రభుత్వ నిర్వహణలోని సంస్థలకు సరఫరా చేయడంపైనా రైతు సాధికార సంస్థ దృష్టి సారించనున్నది.

Updated Date - Jan 05 , 2025 | 04:24 AM