Quantum Valley: సిలికాన్ వ్యాలీలా క్వాంటమ్ వ్యాలీకి ప్రత్యేక గుర్తింపు
ABN , Publish Date - Jun 09 , 2025 | 08:16 PM
అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ పేరిట భారీ ప్రాజెక్ట్ ప్రారంభకానుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా అమరావతి ఒక అంతర్జాతీయస్థాయి సాంకేతిక కేంద్రంగా మారబోతుంది.
అమరావతి, జూన్ 09: సిలికాన్ వ్యాలీలా అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఓ ప్రత్యేక గుర్తింపు పొందాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. రాజధాని అమరావతిలో ఏపీ స్టేట్ క్వాంటమ్ మిషన్‌పై సచివాలయంలో ఐటీ రంగం నిపుణులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ(సోమవారం) సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. జూన్ 30వ తేదీన క్వాంటమ్ మిషన్‌పై విజయవాడలో వర్క్ షాపు నిర్వహిస్తున్నామన్నారు. క్వాంటమ్ వ్యాలీ ఎకో సిస్టం ఏర్పాటుపై అభిప్రాయాలను ఈ సందర్భంగా ఆయన సేకరించారు. రెండు దశల్లో మిషన్‌కు రూ.4వేల కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు.
అమరావతి నగరంలో క్వాంటమ్ వ్యాలీ పేరిట భారీ ప్రాజెక్ట్ ప్రారంభకానుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా అమరావతి ఒక అంతర్జాతీయస్థాయి సాంకేతిక కేంద్రంగా మారబోతుంది. క్వాంటమ్ కంప్యూటింగ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఫ్యూచర్ టెక్నాలజీలపై శిక్షణ, పరిశోధన, ఉద్యోగాలు అందించే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి క్వాంటమ్ కంప్యూటింగ్ కార్యకలాపాలు ప్రారంభిస్తున్నట్లు ఇప్పటికే సీఎం చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే.
అందులో భాగంగా గత మే నెల మొదటి వారంలో ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ సంస్థలతో ఏపీ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. భవిష్యత్తు అవసరాలన్నీ క్వాంటమ్ కంప్యూటింగ్‌పైనే ఆధారపడి ఉంటాయని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అందుకే అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా చేయాలని సంకల్పించినట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు.
సిలికాన్ వ్యాలీ తరహాలో క్వాంటం వ్యాలీగా అమరావతిని తీర్చిదిద్దాలని ఆయా సంస్థల ప్రతినిధులకు సీఎం చంద్రబాబు సూచించారు. ఇక హైదరాబాద్‌లోని హైటెక్ సిటీని కేవలం 15 నెలల్లో నిర్మించారని ఈ సందర్బంగా ముఖ్యమంత్రి గుర్తు చేశారు. అలాగే క్వాంటమ్ వ్యాలీని సైతం అతి తక్కువ సమయంలో నిర్మించవచ్చని అన్నారు. ఈ మేరకు ఇప్పటికే ఎల్ అండ్ టీకి స్థలాన్ని కేటాయించిన విషయం విదితమే.
ఇవి కూడా చదవండి
క్షమాపణలు చెప్పాల్సిందే: వైఎస్ షర్మిల
పీఎస్ఆర్ ఆంజనేయులుకు హైకోర్టు బిగ్ షాక్
Read Latest AP News And Telugu News