CM Chandrababu Naidu : పేదల కోసం ఒకరోజు
ABN , Publish Date - Feb 16 , 2025 | 03:30 AM
‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’ సాధన దిశగా పారిశుధ్య కార్యక్రమాలు చేపడతామని సీఎం వివరించారు.
అదేరోజు పింఛన్లు పంపిణీ చేస్తున్నాం
నెలలో మూడో శనివారం స్వచ్ఛాంధ్రకు
ఆ రోజు శుభ్రత కోసమే కేటాయింపు
స్వచ్ఛాంధ్ర అందరి బాధ్యత కావాలి
85 లక్షల టన్నుల చెత్త వదిలిపోయిన వైసీపీ
కందుకూరు స్వచ్ఛాంధ్ర సభలో చంద్రబాబు
కందుకూరు, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతి క్షణం ప్రజాహితం కోసం, పేదల కోసం పరితపిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అందుకే నెలలో రెండు రోజులు ప్రత్యేకంగా కేటాయించామనీ, ఒకటవ తేదీ పేదలకు పింఛన్ల పంపిణీ, ప్రతి నెల మూడో శనివారం ‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’ సాధన దిశగా పారిశుధ్య కార్యక్రమాలు చేపడతామని సీఎం వివరించారు. పింఛన్ల పంపిణీ బాధ్యత అధికార యంత్రాంగం చూసుకుంటే, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో మాత్రం రాష్ట్రంలోని ప్రతి పౌరుడూ భాగస్వామి కావాలని చంద్రబాబు కోరారు. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. దూబగుంట గ్రామంలో స్వచ్ఛాంధ్రపై ప్రజలకు అవగాహన కార్యక్రమంతోపాటు చెత్తను ప్రాసెస్ చేసే (మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ సెంటర్) ప్లాంట్‌ను ప్రారంభించారు. అనంతరం వ్యవసాయ మార్కెట్ యార్డులో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. ‘‘సమాజంలో వాతావరణం కలుషితం అయ్యింది. ప్రజల ఆలోచనాధోరణి మారితేనే ఈ కలుషితాన్ని తుడిచి పెట్టగలం. స్వచ్ఛమైన ఆలోచనలతోనే స్వచ్ఛమైన వాతావరణం ఏర్పడుతుంది. పరిసరాల పరిశుభ్రతతోనే స్వర్ణాంధ్ర సాకారం అవుతుంది. పరిశుభ్రతను బాధ్యతగా గుర్తించి ఐటీసీ సంస్థ చేస్తున్న కృషి అభినందనీయం. పాత పుస్తకాలను రీసైక్లింగ్ చేసి కొత్త పుస్తకాలుగా ఆ సంస్థ తయారు చేస్తోంది. పాత పుస్తకాలను వారికి ఇవ్వడం ద్వారా ప్రజలకు సంపద వస్తోంది. అలాగే పేపర్ తయారీ కోసం వృక్షాల నరికివేత చాలా వరకు తగ్గుతుంది. ఇలా కార్పొరేట్ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు పారిశుఽధ్య ఉద్యమాన్ని నినాదంగా తీసుకొని ముందుకురావాలి. ప్రజల్లో దీనిపై అవగాహన కల్పించడంతోపాటు చెత్త ద్వారా సంపద సృష్టించే పద్ధతులను ప్రజలకు తెలియజేయాలి.’’ చంద్రబాబు కోరారు.
పచ్చదనం 29 శాతమే...
‘గత ప్రభుత్వం చెత్త మీద పన్ను వేసింది. ప్రజలను పీడించి పన్నులు వసూలు చేసింది. చివరికి సేకరించిన చెత్తను కూడా బయటకు తరలించకుండా ఎక్కడిదక్కడ వదిలేసి వెళ్లిపోయింది. నేను ఆ రోజు ఆ ప్రభుత్వాన్ని చెత్త ప్రభుత్వం అని విమర్శించాను. కానీ ఇప్పుడు తెలిసింది.. ఆ చెత్త ప్రభుత్వం 85లక్షల టన్నుల చెత్తను వదిలేసి వెళ్లిపోయింది. దానిని శుభ్రం చేయడానికి రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ సిబ్బంది రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. అక్టోబరు 2వ తేదీన గాంధీ జయంతి నాటికి రాష్ట్రంలో చెత్త నిల్వలు కనిపించకుండా చేయాలని మున్సిపల్ శాఖను ఆదేశించాను. రాష్ట్రంలో కందుకూరులో 25 టన్నుల సామర్థ్యం కలిగిన మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ సెంటర్ (ఎంఆర్‌ఎ్‌ఫ)ను ప్రారంభించాం. ఇలాంటివి రాష్ట్రమంతా ఏర్పాటు చేయనున్నా’’మని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 29 శాతం పచ్చదనం (గ్రీనరీ) ఉందని, దానిని 50 శాతానికి పెంచగలిగితే స్వచ్ఛమైన గాలి మన సొంతం అవుతుందని, ఇందుకోసం ప్రతి ఒక్కరు మొక్కల పెంపకాన్ని ఒక ఉద్యమంలా చేపట్టాలని చంద్రబాబు కోరారు. డ్వాక్రా సంఘాలు స్థాపించినప్పుడు అందరూ ఎగతాళి చేశారనీ, ఈ రోజు డ్వాక్రాలు ఆర్థిక శక్తిగా ఎదిగారన్నారు. తెలుగు యువత ప్రపంచాన్ని శాసించే స్థాయికి తీసుకెళ్లే వరకు, రాష్ట్రంలో పేదరికం లేని సమాజం ఏర్పడే వరకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని సీఎం అన్నారు. సమస్యలపై ప్రజలు ఇచ్చే ప్రతి అర్జీ పరిష్కారం అయ్యేలా యంత్రాంగాన్ని నడిపిస్తున్నామని చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వం ఒక్క అభివృద్ధి పనీ చేయకపోగా రూ.10లక్షల కోట్ల అప్పులు నెత్తిన పెట్టేసి పోయిందని, అప్పులోళ్లను చూసి భయపడే పరిస్థితి తీసుకొచ్చిందని సీఎం మండిపడ్డారు. ‘‘అప్పులు ఉన్నా సరే సంపద సృష్టిస్తాం. అప్పు చెల్లిస్తూనే అభివృద్ధి, సంక్షేమాలను కొనసాగిస్తా’’మన్నారు.
గత ఐదేళ్లపాటు గుంతలు పడిన రోడ్లపై తట్టెడు మన్ను వేసిన పాపాన పోలేదనీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే రూ.1,600 కోట్లు ఖర్చు చేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రోడ్లకు మరమ్మతులు చేశామని వివరించారు. ఈ సభలో మంత్రులు పొంగూరు నారాయణ, బాల వీరాంజనేయస్వామి, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్, కలెక్టర్ ఆనంద్, కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.