CM Chandrababu Congratulations to CP Radhakrishnan: సీపీ రాధాకృష్ణన్‌కు అభినందనలు తెలిపిన సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Sep 09 , 2025 | 08:29 PM
భారత ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సీపీ రాధాకృష్ణన్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. అలాగే ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ సైతం శుభాకాంక్షలు తెలిపారు.
అమరావతి, సెప్టెంబర్ 09: భారత ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సీపీ రాధాకృష్ణన్‌కు దేశవ్యాప్తంగా అభినందలు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయనకు అభినందనలు తెలిపారు. జాతికి సేవ చేసేందుకు వచ్చిన అవకాశంలో రాధాకృష్ణన్ విజయం సాధిస్తారని నమ్ముతున్నట్లు సీఎం చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజాస్వామిక విలువలను కాపాడటంలో ఆయనకు ఉన్న అపారమైన అనుభవం ఇప్పుడు ఉపయోగపడుతుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు స్పందించారు.
మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ..
భారత ఉపరాష్ట్రపతిగా ఎన్నికైనందుకు సీపీ రాధాకృష్ణన్ కి ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఆయన అపార అనుభవం, రాజనీతిజ్ఞత, ప్రజా సేవ పట్ల నిబద్ధత మన దేశాన్ని ఎంతో సుసంపన్నం చేస్తాయన్నారు. జ్ఞానం, గౌరవంతో ప్రజలకు సేవ చేయడంలో ఆయన గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు నారా లోకేష్ తెలిపారు.
మిన్నంటిన సంబరాలు..
ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ గెలుపొందడంతో విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద సంబరాలు మిన్నంటాయి. పార్టీ శ్రేణులు బాణసంచా పేల్చి మిఠాయిలు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి, మధుకర్ స్వీట్లు తినిపించుకున్నారు.
అనంతరం ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ.. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ విజయం సాధించారని తెలిపారు. ప్రజాస్వామ్య పద్దతిలో జరిగిన ఎన్నికలో స్వేచ్ఛగా ఎంపీలు ఓటు హక్కు ఉపయోగించుకున్నారని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ పాలనపై నమ్మకంతో ఓట్లు వేసిన ఎంపీలందరికీ ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. భారతదేశంలో ఎన్డీఏ కూటమి ఇంకా వర్ధిల్లుతుందని ఆయన జోస్యం చెప్పారు. తప్పకుండా ప్రజల ఆకాంక్షల మేరకు ఎన్డీఏ పాలన సాగుతుందన్నారు. కొత్తగా ఎన్నికైన ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్‌కు ఏపీ బీజేపీ తరఫున తన శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రకటించారు.
మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్పందిస్తూ..
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందిస్తూ.. భారతదేశ 15వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సి.పి.రాధాకృష్ణన్‌కు మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. తమిళనాడుకు చెందిన రాధాకృష్ణన్ క్రమశిక్షణ, అంకితభావంతోపాటు సమగ్రతకు ప్రతిరూపమని అభివర్ణించారు. బీజేపీతోపాటు ఆర్ఎస్ఎస్ సంస్థలో ఆయన సాధించిన ఎదుగుదలతోపాటు స్ఫూర్తిదాయక ప్రయాణం సాగిందన్నారు. ప్రజా జీవితంలోనే కాకుండా.. దేశ సేవలో చాలా సంవత్సరాలుగా ఆయన చేసిన కృషికి ఈ పదవి నిదర్శనమని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందిస్తూ..
భారత ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన ఎన్డీయే అభ్యర్థి శ్రీ సీపీ రాధాకృష్ణన్‌కి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఆయన అనుభవం, ఆదర్శప్రాయమైన రాజనీతిజ్ఞత ఉపరాష్ట్రపతి కార్యాలయానికి మరింత గౌరవాన్ని తెస్తాయని ఆకాంక్షించారు. మన ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంతోపాటు రాజ్యసభలో నిర్మాణాత్మక, అర్థవంతమైన చర్చలకు అవకాశం ఉంటుందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మళ్లీ పిడుగులతో పాటు భారీ వర్షాలు..
ఆ ఐపీఎస్‌లకు మళ్లీ షాక్ ఇచ్చిన ప్రభుత్వం
For More AP News And Telugu News