CM Chandrababu : తప్పుచేసి ఎదురుదాడి!
ABN , Publish Date - Feb 15 , 2025 | 03:31 AM
ఓ దళిత యువకుడిని కిడ్నాప్ చేసి మరో తప్పు చేశారు. పక్కా ఆధారాలతో దొరికిపోయినా తిరిగి మనపైనే ఎదురుదాడి చేస్తున్నారంటే వారు ఎలాంటి నేరమనస్తత్వం ఉన్నవారో అర్ధమవుతోంది.

వైసీపీ నేర మనస్తత్వానికి నిదర్శనం
రాజకీయాల ముసుగులో నేరగాళ్లు
ప్రాణాలు తీయడానికీ వెనుకాడరు
ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం
రాష్ట్రాభివృద్ధికీ విఘాతం కలిగిస్తుంది ఆటవిక పాలన పునరావృతం కారాదు
తప్పు చేస్తే చట్టం కఠినంగా వ్యవహరిస్తుందనే సంకేతాలు పంపాలి
లేదంటే మరింత బరితెగిస్తారు
టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు
గత ఐదేళ్లూ జంగిల్‌రాజ్ నడిచింది. గంజా యి, డ్రగ్స్, దోపిడీలు, భూదందాలు యథేచ్ఛగా సాగాయి. ఆ కారణంగా రాష్ట్రం ఎంత వెనుకబడిందో మనందరికీ తెలుసు. ఇకపై అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉంది.
- సీఎం చంద్రబాబు
అమరావతి, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): ‘తప్పు చేసి దానిని కప్పిపుచ్చుకునేందుకు ఓ దళిత యువకుడిని కిడ్నాప్ చేసి మరో తప్పు చేశారు. పక్కా ఆధారాలతో దొరికిపోయినా తిరిగి మనపైనే ఎదురుదాడి చేస్తున్నారంటే వారు ఎలాంటి నేరమనస్తత్వం ఉన్నవారో అర్ధమవుతోంది. ఇలాంటి నేరగాళ్లు రాజకీయ నాయకుల ముసుగులో ఉండడం ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు శుక్రవారమిక్కడి టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన ఆయన.. అందుబాటులో ఉన్న నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వంశీ అంశాన్ని నాయకులు ప్రస్తావించగా.. ఆయన పైవిధంగా స్పందించారు. ‘అధికారంలో ఉన్నప్పుడు కిడ్నాపులు, దారుణాలు చేశారు. లా అండ్ ఆర్డర్‌ను పక్కనపెట్టేసి పోలీసులును ప్రతిపక్ష నాయకులపై దాడులకు ఉపయోగించారు. ఇప్పుడూ అదే కొనసాగిద్దామనుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితి రాష్ట్రాభివృద్ధికి తీవ్ర విఘాతం కలిగిస్తుంది. తప్పు చేసిన వారి విషయంలో చట్టం కఠినంగా వ్యవహరిస్తుందనే సంకేతాలు పంపకపోతే నాయకుల ముసుగులో ఉన్న నేరగాళ్లు మరింత బరితెగిస్తారు’ అని చంద్రబాబు స్పష్టం చేశారు. జంగిల్‌రాజ్ పోయి జనరాజ్యం వచ్చిందన్న స్పష్టమైన సంకేతాలు పంపాలన్న ఆయన అభిప్రాయంతో నేతలూ ఏకీభవించారు. ఓట్ల కోసం నా దళితులని ప్రచారం చేసుకున్న జగన్, ఆయన అనుచరులకు అప్పుడు, ఇప్పుడు ఆ దళితులే టార్గెట్‌గా మారారని వారు వ్యాఖ్యానించారు.
ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికపై కమిటీ
ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికపై చర్చ జరిగింది. ఎవరికి మద్దతివ్వాలి.. బహిరంగంగా ఇవ్వాలా లేదా.. ఇలాంటి అంశాలపై క్షేత్రస్థాయి పరిస్థితులను నివేదించడానికి ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ, ఎంపీ భరత్‌తో ఓ కమిటీ వేశారు. ఈ కమిటీ శనివారం నివేదిక ఇస్తుంది. అలాగే కొత్తగా సభ్యత్వ నమోదు చేసుకున్న వారిలో కొందరు చనిపోయారని, సాంకేతక కారణాల వల్ల వారిలో కొందరికి బీమా వచ్చే అవకాశం లేదని, అలాంటి వారికి పార్టీయేడబ్బులు చెల్లించాలని నిర్ణయించారు. భేటీలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అశోక్‌బాబు, షరీఫ్ అహ్మద్ పాల్గొన్నారు.