Share News

Singapore: సింగపూర్‌లో సీఎం చంద్రబాబు సమావేశానికి అనూహ్య స్పందన

ABN , Publish Date - Jul 27 , 2025 | 05:12 PM

బ్రాండ్ ఏపీ ప్రమోషన్‌లో భాగంగా రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు సింగపూర్‌లో పర్యటిస్తున్నారు. సింగపూర్‌లో ఆయన పర్యటన బిజీ బిజీగా సాగుతోంది.

Singapore: సింగపూర్‌లో సీఎం చంద్రబాబు సమావేశానికి అనూహ్య స్పందన
AP CM Chandrababu Naidu in Singapore

అమరావతి, జులై 27: సింగపూర్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన బిజీ బిజీగా కొనసాగుతోంది. ఈ పర్యటనలో భాగంగా సింగపూర్‌లో నిర్వహించిన తెలుగు డయాస్పోరా సౌత్ ఈస్ట్ ఏషియా కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. సింగపూర్ సహా సమీపంలోని ఐదు దేశాల్లోని తెలుగు ప్రజలు, ఎన్నారైలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి తరలి వచ్చారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు రాక ముందే తెలుగువారితో ఈ ఆడిటోరియం నిండిపోయింది. ప్రధాన ఆడిటోరియం నిండిపోవడంతో.. దానికి అనుబంధంగా ఉన్న ఆడిటోరియంలోకి వారిని తరలించారు.


దాదాపు ఐదు గంటల పాటు ఈ తెలుగు డయాస్పోరా కార్యక్రమం అత్యంత ఉత్సాహభరితంగా సాగింది. భార్యా పిల్లలతోపాటు పెద్దఎత్తున స్నేహితులతో ఈ కార్యక్రమానికి ఎన్నారైలు తరలి వచ్చారు. అనంతరం దాదాపు 2500 మందితో సీబీఎన్ ఫోటో సెషన్ కొనసాగింది. రెండున్నర గంటల పాటు ఓపిగ్గా సీఎం చంద్రబాబు నాయుడు నిలబడి ప్రతిఒక్కరిని ఆప్యాయంగా పలకరించి.. పోటోలు దిగారు. ఇక వేదికపైనే ఉండి.. ప్రతి కుటుంబం ఫొటోలు దిగేలా మంత్రి నారా లోకేష్ సహకరించారు. అలాగే సీఎం చంద్రబాబుతో మాట్లాడి వారి అభిప్రాయాలతోపాటు వారి సమస్యలను తెలుగు వారు పంచుకున్నారు. పిల్లలతో సహా ఈ తెలుగు డయాస్పోరా కార్యక్రమానికి హాజరైన మహిళలను సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు.


బ్రాండ్ ఏపీ ప్రమోషన్‌లో భాగంగా రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు జులై 26 నుంచి 31వ తేదీ వరకు సింగపూర్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలు దిగ్గజ సంస్థల ప్రతినిధులు, కంపెనీ సీఈఓలు, పారిశ్రామికవేత్తలతో వరుస సమావేశాలు కానున్నారు. ఆ క్రమంలో పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రంలో ఉన్న అవకాశాలు, వనరులు, ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు, పారిశ్రామిక పాలసీ, భూమి లభ్యత తదితర అంశాలను వారికి సీఎం చంద్రబాబు నాయుడు సోదాహరణగా వివరించనున్నారు. అందులో భాగంగా వారిని ఏపీకి ఆహ్వానించనున్నారు.


ఇక ఈ ఏడాది నవంబర్‌లో విశాఖపట్నం వేదికగా పెట్టుబడుల సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు విదేశీ పారిశ్రామికవేత్తలను ఆయన ఆహ్వానించనున్నారు. అలాగే ఈ పర్యటనలో భాగంగా రౌండ్ టేబుల్ సమావేశాలు సైతం నిర్వహించనున్నారు. సింగపూర్‌లో నిర్వహించే రోడ్ షోకు ఆయన హాజరవుతారు. అదే విధంగా ఆ దేశంలోని వివిధ మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్ సంస్థలను సీఎం చంద్రబాబు సందర్శించనున్నారు. సింగపూర్ పర్యటనలో సీఎం చంద్రబాబు వెంట.. మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్‌తోపాటు పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

చిటికెలో తిరుమల శ్రీవారి దర్శనం.. ఇదిగో ఇలాగా

బీజేపీలో బీఆర్ఎస్ విలీనం.. సీఎం రమేష్ వ్యాఖ్యలపై బండి సంజయ్ క్లారిటీ

For More Andhrapradesh News And Telugu News

Updated Date - Jul 27 , 2025 | 06:06 PM