Accident: ఇద్దరు విద్యార్థుల దుర్మరణం
ABN , Publish Date - Oct 11 , 2025 | 02:01 AM
ద్విచక్ర వాహనంపై అతివేగంతో వచ్చిన ఇద్దరు యువకులు.. అదుపు తప్పి తిరుపతిలోని గరుడ వారధిపై నుంచి పడి దుర్మరణం చెందారు.
తిరుపతి(నేరవిభాగం), అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): ద్విచక్ర వాహనంపై అతివేగంతో వచ్చిన ఇద్దరు యువకులు.. అదుపు తప్పి తిరుపతిలోని గరుడ వారధిపై నుంచి పడి దుర్మరణం చెందారు. ఈస్ట్ ఎస్‌ఐ హేమాద్రి కథనం మేరకు.. చంద్రగిరి మండలం కందులవారిపల్లెకు చెందిన రాజ్‌కుమార్ నాయుడి ఏకైక కుమారుడు కనిష్క(22), ఇతడి స్నేహితుడు, కొటాలకు చెందిన వాచువా కొమ్మినేని(23) చంద్రగిరి మండంలోని ఓ కళాశాలలో బీటెక్ ఫైనలియర్ చదువుతున్నారు. వీరిద్దరూ శుక్రవారం మధ్యాహ్నం చంద్రగిరి నుంచి బుల్లెట్‌లో బయలుదేరి.. మామిడి కాయల మండీ వద్ద గరుడ వారధిపైకి ఎక్కారు. అతివేగంగా వస్తున్న వీరు లక్ష్మీపురం సర్కిల్ వద్ద అదుపు తప్పి ఎడమ వైపు వున్న గ్రిల్ డివైడర్‌ను ఢీ కొన్నారు. దాదాపు రెండు అడుగుల ఎత్తు ఎగిరి వారధిపైనుంచి దాదాపు 30 అడుగుల కింద రోడ్డుపై పడ్డారు. ఒకరు వినాయకస్వామి గుడి వద్ద, మరొకరు పెట్రోలు బంకు వద్ద పడి అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారంతో ఈస్ట్ ఎస్‌ఐ హేమాద్రి, ఏఎ్‌సఐ అశోక్, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని 108లో మృత దేహాలను రుయాస్పత్రికి తరలించారు.కనిష్క బావ సురేష్ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ హేమాద్రి కేసు నమోదు చేశారు. బుల్లెట్‌ను పోలీసులు సీజ్ చేశారు. రుయా అత్యవసర విభాగం వద్ద ఇద్దరు కుటుంబీకులు, బంధువులు, తోటి విద్యార్థుల రోదనలు అందరినీ కలచివేసింది.