Share News

Rains: వర్షమొచ్చిన ప్రతిసారీ ఇబ్బందులు

ABN , Publish Date - Oct 11 , 2025 | 02:17 AM

ఎగువ ప్రాంతాలతో పాటు చిత్తూరు సమీప మండలాల్లో భారీ వర్షం కురిసిన ప్రతిసారీ నగరంలోని నీవా పరివాహక ప్రాంతాలు నీట మునుగుతున్నాయి.

Rains: వర్షమొచ్చిన ప్రతిసారీ ఇబ్బందులు
తేనెబండ సర్కిల్లో కల్వర్టును శుభ్రం చేస్తున్న పొక్లయినర్‌- వీధుల్లో నీటిప్రవాహంతో నీవానది కాలనీవాసుల ఇబ్బందులు

చిత్తూరు అర్బన్‌, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): ఎగువ ప్రాంతాలతో పాటు చిత్తూరు సమీప మండలాల్లో భారీ వర్షం కురిసిన ప్రతిసారీ నగరంలోని నీవా పరివాహక ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. పరివాహక ప్రాంతవాసుల్ని శాశ్వతంగా వేరేచోటుకు తరలిస్తామని వర్షమొచ్చినప్పుడనల్లా చెప్పే అధికారులు, ప్రజాప్రతినిధులు వర్షం ఆగాక ఆ మాటను మరిచిపోతున్నారు.భారీ వర్షాలు పడినప్పుడు స్థానికులను ఇతర ప్రాంతాలకు తరలించి ఆశ్రయంతో పాటు ఆహారాన్ని అందించడం పరిపాటిగా మారిపోయింది.ఆక్రమణలను తొలగించి, రక్షణ గోడ నిర్మిస్తేనే ఈ సమస్యకు పరిష్కారం లభించనుంది. రెండు రోజులుగా ఎగువ ప్రాంతాలతో పాటు పూతలపట్టు, చిత్తూరు నియోజకవర్గాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా నీవానది పొంగి పొర్లుతోంది.చిత్తూరు నగరంలోని పోతంబట్టు వద్ద నీవానది ప్రారంభమై ఎన్టీయార్‌ జలాశయం వరకు కొనసాగుతోంది. నదీ పరివాహక ప్రాంతాలను ఆక్రమించి ఇళ్ల నిర్మాణాలు చేపట్టడంతో పాటు నదికి వచ్చే తూములు మూసుకుపోయాయి. వర్షాల సీజన్‌కు ముందు ఇరిగేషన్‌శాఖ, నగరపాలక అధికారులు నదిలోని ముళ్లకంపలు, ఇతర వ్యర్థాలను తొలగించాల్సి ఉంది. కానీ అది చేయడంలేదు.దీంతో భారీ వర్షాలు పడిన ప్రతిసారీ నీవానదిని ఆనుకుని వున్న వీరభద్రకాలనీ, రిక్షా కాలనీ, తేనబండ, తోటపాళ్యం, దోబీఘాట్‌, కైలాసపురం ప్రాంతా లు జలమయమవుతున్నాయి. శుక్రవారం కూడా అక్కడి ఇళ్లలోకి వర్షపు నీరు చేరిపోయింది.చాలా ఇండ్లలోని సామాన్లు, సరుకులు తడిసిపోయాయి.ద్విచక్రవాహనాలు పాడైపోయాయి.

ఆక్రమణలను తొలగిస్తేనే..

నీవానది పరివాహక ప్రాంతాలన్నీ దాదాపు నదిని ఆక్రమించుకుని కట్టినవే. పెద్దఎత్తున వరదొస్తే ప్రమాదం ముంచుకొస్తుందనే ఆలోచనలతో నాటి అధికారులు వారికి ప్రశాంత్‌నగర్‌, ఇందిరమ్మకాలనీ, వైఎస్‌ కాలనీల్లో పట్టాలిచ్చి ఇళ్లు కట్టిస్తామని చెప్పారు.అయితే ఇక్కడి వారంతా రోజువారీ కూలీలు కావడంతో అంతదూరం నుంచి పనులకు రాలేమని అక్కడికి వెళ్లడానికి ఆసక్తి చూపడం లేదు.నీవానదిలో ఆక్రమణలను తొలగించి రిటైనింగ్‌ వాల్‌ (రక్షణ గోడ) కడితే తప్ప ముంపును అరికట్టలేమని అధికారులు చెబుతున్నారు.


ముంపు ప్రాంతాల పరిశీలన

వర్షం కారణంగా ముంపునకు గురైన ప్రాంతాలను శుక్రవారం కమిషనర్‌ నరసింహ ప్రసాద్‌ పరిశీలించారు. వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నందున అవసరమైతే జనాలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి అత్యవసర బృందాలను సిద్ధం చేసినట్లు చెప్పారు. ఎమ్మెల్యే జగన్మోహన్‌ సూచన మేరకు వరద ముంపు ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నం భోజనాల్ని అందించారు. మేయర్‌ అముద, టీడీపీ నగర అధ్యక్షుడు నరేష్‌, లీలావతి, ఆర్‌ఎస్‌ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 11 , 2025 | 02:17 AM