Share News

Tirupati Road Accident: తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం

ABN , Publish Date - Apr 28 , 2025 | 02:50 PM

Tirupati Road Accident: తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు అదుపు తప్పి కంటైనర్ కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు.

Tirupati Road Accident: తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం
Tirupati Road Accident

తిరుపతి, ఏప్రిల్ 28: తిరుపతి జిల్లాలో (Tirupati District) ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. చంద్రగిరి నియోజకవర్గంపాకాల మండలం నేండ్రకుంట సమీపంలోని కోనప‌్ప రెడ్డి పల్లి ఓ కారు అదుపు తప్పి కంటైనర్ కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అలాగే మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


తమిళనాడుకు చెందిన ఏడుగురు భక్తులు కారులో తిరుమలకు బయలుదేరారు. అయితే పాకాల వద్ద కారు ఓవర్‌టేక్ చేయబోయి అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కంటైనర్‌ ఢీట్టింది. ఆపై కంటైనర్ కిందకు కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలోనే తమిళనాడుకు చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఓ వృద్ధురాలు, చిన్నారి తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇద్దరికి స్థానిక ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది. కారు ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.


కారులో ఉన్నవారిని రక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కారు పూర్తిగా కంటైనర్ కిందకు వెళ్లిపోవడంతో వెంటనే దాన్ని బయటకు తీశారు. కానీ అప్పటికే కారులో ఉన్నవారు చనిపోయినట్లు ధృవీకరించారు. అలాగే పోలీసులు అక్కడకు చేరుకుని ప్రమాద స్థలిని పరిశీలిస్తున్నారు. ఇంతటి ఘోర ప్రమాదాన్ని చూసి చుట్టుపక్కల వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.


మృతి చెందిన వారిలో ఇద్దరు పురుషులు, ఇద్దరు స్త్రీలు, ఒక బాలుడు ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే తిరుపతి జిల్లా కలెక్టర్ వేంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదంలో గాయపడిన ఇద్దరిని రుయా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహిళ గీతమ్మ, బాలుడు క్రీస్వీన్‌లకు రుయాలో ప్రథమ చికిత్స చేశారు. అనంతరంక్షతగ్రాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశంతో హుటాహుటిన వారిని స్విమ్స్‌కు తరలించేలా కలెక్టర్ వేంకటేశ్వర్ చర్యలు తీసుకున్నారు.


సీఎం చంద్రబాబు విచారం

Chand-collectors.jpg

తిరుపతి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. పాకాల మండలం తోటపల్లి వద్ద కంటైనర్‌ను కారు ఢీ కొన్న ఘటనలో కారులోని వారు ప్రాణాలు కోల్పోయారని.. ఈ ప్రమాదంలో ఐదుగురు చనిపోగా మరికొందరు గాయపడ్డారన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని జిల్లా అధికారులను సీఎం ఆదేశించారు. క్షతగాత్రులకు రుయా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్టు అధికారులు తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వ పరంగా సాయం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు.


ఇవి కూడా చదవండి

Guntur Mayor Election: గుంటూరు మేయర్ ఎన్నిక.. వైసీపీ అభ్యర్థి నామినేషన్

Visakhapatnam Mayor: విశాఖ మేయర్‌ ఎన్నిక ఏకగ్రీవం

Read Latest AP News And Telugu News


ప్రమాదంపై మంత్రి రాంప్రసాద్ దిగ్భ్రాంతి

mandipalli-Ramprasad-1.jpg

తిరుపతి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆరా తీశారు. ఐదుగురు మృతి పట్ల మంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన వారికి మెరుగైన వైద్య సేవలను అందించేందుకు చర్యలు తీసుకోవాలని వైద్యులను మంత్రి కోరారు. మృతి చెందిన తమిళుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని, అప్రమత్తంగా ఉండాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.

Updated Date - Apr 28 , 2025 | 04:45 PM