Tirumala: జలకళలాడుతున్న తిరుమల డ్యామ్‌లు
ABN , Publish Date - Dec 01 , 2025 | 12:04 AM
దిత్వా తుఫాను వానలతో తిరుమలలోని జలాశయాలు పొంగి పొర్లుతున్నాయి. అక్టోబరులో కురిసిన వర్షాలకే తిరుమలలోని పాపవినాశనం, గోగర్భం, ఆకాశగంగ, కుమారధార, పుసుపుధార డ్యాములు 98 శాతం నిండిపోయాయి.
తిరుమల, నవంబరు30(ఆంధ్రజ్యోతి): దిత్వా తుఫాను వానలతో తిరుమలలోని జలాశయాలు పొంగి పొర్లుతున్నాయి. అక్టోబరులో కురిసిన వర్షాలకే తిరుమలలోని పాపవినాశనం, గోగర్భం, ఆకాశగంగ, కుమారధార, పుసుపుధార డ్యాములు 98 శాతం నిండిపోయాయి. పాపవినాశనం, గోగర్భం డ్యాముల గేట్లను కూడా అప్పుడు ఎత్తాల్సివచ్చింది. నిజానికి ఇప్పుడు భారీ వర్షాలు కురవకపోయినా, నవంబరు నెల ప్రారంభంలో కురిసిన వర్షాలకు శేషాచల అడవుల నుంచి ఊటనీరు భారీగా డ్యాముల్లోకి చేరుతూ వచ్చింది. నవంబరు24వ తేదీకే డ్యాములన్నీ నిండిపోయి, గోగర్భం, పాపవినాశనం డ్యాముల గేట్లు ఒక అంగుళం మేర తెరిచి దిగువకు వదులుతున్నారు. రెండురోజుల నుంచి కురుస్తున్న వానలతో డ్యాములు నిండుకుండల్లా కనిపిస్తున్నాయి. ముందుజాగ్రత్తగా ఆదివారం మధ్యాహ్నం గోగర్భం, పాపవినాశనం గేట్లు మరొక అంగుళం పైకెత్తారు. ప్రస్తుతం పాపవినాశనంలో 5,240 లక్షల గ్యాలన్లు, గోగర్భంలో 2,833 లక్షల గ్యాలన్లు, ఆకాశగంగలో 685 లక్షల గ్యాలన్లు, కుమారధారలో 4,258.98 లక్షల గ్యాలన్లు, పసుపుధార డ్యాములో 1,287.51 లక్షల గ్యాలన్ల నీరు ఉంది. దాదాపు తొమ్మిది నెలల పాటు తిరుమల నీటి అవసరాలు తీర్చేంత నీరు ప్రస్తుతం డ్యాముల్లో ఉంది.