Share News

Accident: ముగ్గురు తాపీ మేస్త్రీల దుర్మరణం

ABN , Publish Date - Apr 30 , 2025 | 12:44 AM

ఐదంతస్తుల ఇంటికి పూత వేసేందుకు కట్టిన సారవ తాడు ఊడిపోవడంతో విషాదం చోటుచేసుకుంది. సుమారు 50 అడుగులకు పైనుంచి కింద పడి ముగ్గురు మేస్త్రీలు దుర్మరణం చెందారు.

Accident: ముగ్గురు తాపీ మేస్త్రీల దుర్మరణం
ముగ్గురు తాపీ మేస్త్రీల మృతదేహాలు

మృతుల్లో బావ, బామ్మర్ది

తిరుపతి అర్బన్‌, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): ఐదంతస్తుల ఇంటికి పూత వేసేందుకు కట్టిన సారవ తాడు ఊడిపోవడంతో విషాదం చోటుచేసుకుంది. సుమారు 50 అడుగులకు పైనుంచి కింద పడి ముగ్గురు మేస్త్రీలు దుర్మరణం చెందారు. ఈ విషాద ఘటన మంగళవారం ఉదయం తిరుపతి రూరల్‌ తిరుమలనగర్‌ పంచాయతీ పరిధిలోని తుడా క్వార్టర్స్‌లో జరిగింది. ఇక్కడి హెచ్‌ఐజీలో ఏడాదిగా ఐదంతస్తుల ఇల్లు కడుతున్నారు. ఆ ఇంటి బయట గోడలకు మంగళవారం పూతపని మొదలు పెట్టారు. దీనికోసం కింద నుంచి పై అంతస్తు వరకు కొయ్యలతో సారవ కట్టారు. ఈ సారవపై నిలబడి గోడకు పూత పని చేస్తుండగా ఉదయం 10.40గంటల సమయంలో అడ్డసారవ కొయ్యలకు కట్టిన తాడు ఊడిపోయింది. మిగతా కొయ్యలు అటు ఇటు కదలడంతో వాటిపై నిలబడివున్న తాపీ మేస్త్రీలు.. పెళ్లకూరు మండలం అక్కగారిపేటకు చెందిన బి.శ్రీనివాసులు, జీవనోపాధి నిమిత్తం ఒంగోలు నుంచి పదేళ్ల కిందట శ్రీకాళహస్తికి వచ్చి స్థిరపడిన కె.శ్రీనివాసులు, అతడి బావమరిది టి.వసంత్‌ అదుపుతప్పి పడిపోయారు. సారవకొయ్యలకు, గోడకు కొట్టుకుంటూ కింద పడటంతో ఇద్దరు దుర్మరణం చెందారు. 108 అంబులెన్స్‌ను రప్పించే లోపే మరొకరు తుదిశ్వాస విడిచారు. కావలికి చెందిన మరో మేస్త్రీ మాధవ ఓ చేతితో అడ్డకర్రను పట్టుకోవడంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. పోలీసులకు, పంచాయతీ అధికారులకు ఇంటి యజమాని సమాచారమిచ్చారు. అదనపు ఎస్పీ రవిమనోహరాచారి, తిరుచానూరు డీఎస్పీ బి.ప్రసాద్‌, సీఐ సునీల్‌కుమార్‌, ఎస్‌ఐలు బాలకృష్ణరెడ్డి, సాయినాధ్‌చౌదరి, అరుణకుమారి, తహసీల్దారు భాగ్యలక్ష్మి, రెవెన్యూ ఉద్యోగులు ప్రమాద స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఆ ఇంటి యజమాని స్రవంతి, ఆమె మామ, విశ్రాంత ఉపాధ్యాయుడు కడివేటి ఆండాలయ్య, సారవకు తాళ్లు కట్టిన ప్రసాద్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రుయాస్పత్రికి తరలించారు.


మేమెలా బతకాలి?

మృతుల కుటుంబ సభ్యులకు విషయం చెప్పడంతో శ్రీకాళహస్తి నుంచి వాళ్లంతా వచ్చారు. భర్త బి.శ్రీనివాసులు మృతదేహం వద్ద ప్రమీల, కుమారుడు వసంత్‌, అల్లుడు కె.శ్రీనివాసులు మృతదేహాలను చూసి బ్రహ్మయ్య, రమణమ్మ కన్నీరుమున్నీరయ్యారు. ‘మిమ్మల్ని పోగొట్టుకున్న మేము ఎలా బతకాలి? పిల్లలు ఏమైపోవాలి? మా పరిస్థితి ఏంటి’ అంటూ తలబాదుకున్నారు. ఆ ప్రాంతమంతా విషాదం నెలకొంది.

అనుమతి లేకనే నిర్మాణమా?

ఈ ప్రాంతంలో జీ ప్లస్‌ త్రీ వరకే నిర్మాణానికి అవకాశం ఉంది. కానీ ఐదంతస్తుల భవనం నిర్మిస్తున్నారంటే.. అనుమతి తీసుకోలేదా? ఒకవేళ అనుమతి లేకుడా ఇంత పెద్ద భవనం నిర్మిస్తుంటే పంచాయతీ అధికారులు ఏ చేస్తున్నట్లు? ఇదీ స్థానికంగా వ్యక్తమవుతున్న ప్రశ్నలు. ఈ క్రమంలో ఐదంతస్తులకు అనుమతులు ఉందా లేదా అనేది విచారిస్తామని ఏఎస్పీ రవిమనోహరాచారి చెప్పారు. కార్మికుల పట్ల ఎలాంటి భద్రతా చర్యలు తీసుకున్నారనేది దర్యాప్తులో పరిశీలిస్తామన్నారు.

పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్‌, ఈవోపీఆర్డీకి షోకాజ్‌

తిరుపతి(కలెక్టరేట్‌), ఏప్రిల్‌ 29(ఆంధ్రజ్యోతి): తుడా అప్రూవల్‌ మూడు అంతస్తుల వరకే ఉంది. కానీ ఐదంతస్తులకుపైగా నిర్మాణం జరుగుతున్నా అడ్డుకోలేదు. ఇలా విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ పంచాయతీ కార్యదర్శి స్వాతిశ్రీని సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. పర్యవేక్షణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఈవోపీఆర్డీ మాధురికి షోకాజ్‌ నోటీసులు ఇచ్చారు. ఆ భవన నిర్మాణంతో పాటు సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భవన యజమానికి కార్మిక నష్టపరిహారం చట్టం కింద కార్మిక శాఖ అధికారులు నోటీసులు అందించారని, మృతుల కుటుంబాలకు న్యాయం జరుగుతుందని కలెక్టర్‌ తెలిపారు.

దారం ఊడిపోవడంతోనే ఘటన

‘సారవకు కట్టిన తాళ్లు ఊడిపోవడంతో ప్రమాదం జరిగింది. జీ ప్లస్‌ త్రీ భవన నిర్మాణానికి అనుమతులున్నాయి. మరో రెండు అదనంగా వేశాం’ అంటూ కె.ఆండాలయ్య తెలిపారు.

అంతా క్షణాల్లోనే : మాధవ, తాపీ మేస్త్రి

ఐదో అంతస్తు వద్ద గోడకు పూత పని చేస్తుండగా అడ్డసారవకు కట్టిన దారాలు ఊడిపోయాయి. దాంతో ముగ్గురు మేస్త్రీలు కిందపడి చనిపోయారు. నేను ఓ చేత్తో కొయ్యను పట్టుకొని ఉండడంతో మృత్యువు నుంచి బయటపడ్డా. అంతా క్షణాల్లోనే, విషాదం చోటుచేసుకుంది.

డాడీకి ఏమైందమ్మా?

పెళ్లకూరు, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): పెళ్లకూరు మండలం అక్కగారిపేట ఎస్సీ కాలనీకి చెందిన బుడతోటి శ్రీనివాసులు (38)కు భార్య ప్రమీల, కొడుకు వరుణ్‌తేజ, కుమార్తె రోషిణి ఉన్నారు. బేల్దారి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారాయన. తిరుపతిలో పూత పని చేస్తుండగా మంగళవారం నాటి ప్రమాదంలో మృతిచెందారు. దీంతో ఆ కుటుంబం జీవనాధారం కోల్పోయింది. భర్త మృతితో విలపిస్తున్న ప్రమీలను చూసి.. ‘డాడీకి ఎమైందమ్మా’ అంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్న చిన్నారులను చూసి ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టారు.

Updated Date - Apr 30 , 2025 | 12:44 AM