Education: టెన్త్‌లో ఉత్తమ ఫలితాల సాధనకు కృషి
ABN , Publish Date - Dec 12 , 2025 | 12:09 AM
టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధనకు తన వంతు కృషి చేస్తానని నూతన డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. గురువారం తన చాంబర్‌లో చిత్తూరు జిల్లా విద్యాశాఖాధికారిగా పూర్తి అదనపు బాధ్యతలు చేపట్టారు.
చిత్తూరు సెంట్రల్, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధనకు తన వంతు కృషి చేస్తానని నూతన డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. గురువారం తన చాంబర్‌లో చిత్తూరు జిల్లా విద్యాశాఖాధికారిగా పూర్తి అదనపు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కలెక్టర్ ఆదేశాల మేరకు టెన్త్‌లో మెరుగైన ఫలితాల సాధనకు విద్యాశాఖ తలపెట్టిన వంద రోజుల ప్రణాళికను జిల్లాలో సమర్థవంతంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చదివే ప్రతి టెన్త్ విద్యార్థి ఖచ్చితంగా పాస్ కావడంతోపాటు మంచి మార్కులు వచ్చేలా చూస్తానన్నారు. ప్రతి టీచర్ విద్యార్థులు ఉత్తమ మార్కులు పొందేలా శిక్షణ ఇవ్వాలన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో లెర్నింగ్‌పై, కేజీబీవీల్లో విద్యార్థినులకు మెరుగైన సౌకర్యాల కల్పనపై దృష్టి పెడతానని వివరించారు. ప్రధానంగా ప్రతి ఒక్కరినీ కలుపుకుని పనిచేస్తానన్నారు. అంతకుముందు కలెక్టర్ సుమిత్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. డీఈవోగా బాధ్యతలు చేపట్టాక విద్యాశాఖ, సమగ్రశిక్ష సిబ్బందితో పలు అంశాలపై సమీక్షించారు. రాజేంద్రప్రసాద్‌ను డీఈవో కార్యాలయ సిబ్బంది సన్మానించారు. డీఈవో రాజేంద్రప్రసాద్‌ను గురువారం విద్యాశాఖ కార్యాలయ సూపరింటెండెంట్లు, సిబ్బంది,యూటీఎఫ్ నాయకులు, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు.