Stree Shakti: ‘స్త్రీ శక్తి’ సక్సెస్
ABN , Publish Date - Sep 21 , 2025 | 01:39 AM
ఆర్టీసీ బస్సుల్లో ప్రవేశపెట్టిన స్త్రీశక్తి పథకంతో ప్రయాణికుల సంఖ్య పెరిగింది.
చిత్తూరు రూరల్, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ బస్సుల్లో ప్రవేశపెట్టిన స్త్రీశక్తి పథకంతో ప్రయాణికుల సంఖ్య పెరిగింది.జిల్లాలోని 5 డిపోల్లో 461 బస్సులున్నాయి.వీటిలో 316 బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం చేసే అవకాశముంది.ఈ బస్సుల్లో దాదాపు 60 శాతం మంది మహిళలే ప్రయాణిస్తున్నారు.స్ర్తీశక్తి ఆవిర్భావానికి పూర్వం చిత్తూరు జిల్లాలో సాధారణ రోజుల్లో 1.31 లక్షల మంది ప్రయాణించేవారు. ఇప్పుడు అదనంగా 20 శాతం మంది అంటే మరో 32వేల మంది అదనంగా రాకపోకలు సాగిస్తున్నారు.రోజూ 708 గ్రామాలకు సుమారు 164 రూట్లలో ఆర్టీసీ బస్సులు తిరుగుతుండగా ఉచిత ప్రయాణం అమల్లోకి వచ్చాక నెల రోజుల్లో 22,22,676మంది మహిళలు స్ర్తీ శక్తి పథకాన్ని వినియోగించుకున్నారు.వారికి 9,06,52,339రూపాయలు ఆదా అయ్యాయి.
బస్సుల సంఖ్య పెరగాలి
స్త్రీశక్తి పథకం ప్రారంభమయ్యాక మహిళా ప్రయాణికులు పెరగడంతో బెంగుళూరు,తిరుపతి, కుప్పం రూట్లలో రద్దీ అధికంగా ఉంటోంది.అంతర్రాష్ట్ర సర్వీసుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతి లేకపోవడంతో తిరుపతి నుంచి బెంగళూరుకు వెళ్లాల్సిన మహిళలు ముందుగా ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు బస్సుల్లో ఉచితంగా చిత్తూరుకు చేరుకుంటున్నారని,అక్కడి నుంచి బెంగళూరు బస్సులు ఎక్కుతుండడంతో బెంగుళూరు బస్టాండ్ రద్దీగా మారుతోందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.చిత్తూరు నుంచి బెంగళూరుకు ప్రయాణించే మహిళలు కూడా కుప్పం, పలమనేరు బస్సుల్లో పలమనేరు వరకు ప్రయాణించి అక్కడి నుంచి బెంగళూరుకు వెళ్తున్నారని, ఇలా ప్రయాణించడం ద్వారా రూ.160 ఆదా చేస్తున్నారని చెబుతున్నారు.జిల్లాకు రావాల్సిన కొత్త బస్సులు వస్తే రద్దీ సమస్య పరిష్కారమవుతుందని డీపీటీవో రాము తెలిపారు.
డిపో ప్రయాణించిన మహిళలు
చిత్తూరు-1 471032
చిత్తూరు-2 504922
కుప్పం 319803
పలమనేరు 472105
పుంగనూరు 454814
మొత్తం 22,22,676