Share News

Sea: సముద్రంలో సేద్యం

ABN , Publish Date - Dec 21 , 2025 | 01:18 AM

నేలమీద వ్యవసాయం మనకు తెలుసు. నీటిమీద సాగు మనకు సరికొత్త వ్యవసాయ విధానం. అందునా సముద్రంలో సేద్యం.. ఎలా సాధ్యం అని ఆశ్చర్యం సహజం. ఇప్పుడా వ్యవసాయం మన తిరుపతి జిల్లాలోనే ప్రయోగాత్మకంగా మొదలైంది. అత్యంత విలువైన సముద్రపు నాచును బంగాళాఖాతంలో వాకాడు, తడ మండలాల్లోని మత్స్యకార మహిళలు పండిస్తున్నారు.

 Sea: సముద్రంలో సేద్యం
పండిన నాచును పడవలమీదకు చేర్చి బయటకు తీసుకువస్తారిలా.. (ఇన్‌సెట్లో) పండిన నాచు కపా ఫైకస్‌

తిరుపతి(కలెక్టరేట్‌), ఆంధ్రజ్యోతి: తిరుపతి జిల్లాలో 75 కిలోమీటర్ల సముద్రతీరం ఉంది. సుమారు 5మండలాల్లో తీరప్రాంతం విస్తరించి ఉంది. ఈ మండలాల్లో ఎంపిక చేసిన ప్రదేశాల్లో ప్రయోగాత్మకంగా సముద్రపు నాచు సేద్యం మొదలు పెట్టారు. జాతీయ పర్యావరణశాఖ ఆధ్వర్యంలో జీసీఎఫ్‌ నిధుల సహకారంతో ఈ ప్రయత్నం జరుగుతోంది. వాకాడు మండలంలోని కొండూరు, అంజాలపురం(దుగ్గరాజుపట్టణం సమీపంలో), సూళ్లూరుపేట నియోజకవర్గం తడ మండలంలోని భీములవానిపాళెంలో సముద్ర సేద్యం జరుగుతోంది. పైలెట్‌ ప్రాజెక్టు కింద స్వయం సహాయక సంఘాల్లోని మత్స్యకార మహిళలకు సముద్రపు నాచు పెంపకంపై శిక్షణ ఇచ్చారు. వందశాతం రాయితీతో సీడ్‌ను మత్స్యకార మహిళలకు అందించారు. నిపుణుల పర్యవేక్షణలో నాచు పెంపకం సాగుతోంది.

నాచు సేద్యం ఇలా...

ఈ ప్రాంతాల్లో కఫాఫైకస్‌ అనే రకం సముద్రపు నాచు సాగు జరుగుతోంది. తమిళనాడులోని రామేశ్వరం నుంచి ఈ నాచును తెప్పించి ఇక్కడి మత్స్యకార మహిళలకు అందిస్తున్నారు. పీవీసీ పైపులు లేదా వెదురు కర్రలతో తేలియాడే తెప్పలు ముందుగా తయారు చేసుకుంటారు. ఇవి ఒక్కొక్కటీ 3 మీటర్ల వెడల్పు, 3 మీటర్ల పొడవు ఉంటాయి. ఈ నాచుమడుల్లో సీడ్‌ నాటుతారు. సముద్రంలోని పోషకాలను స్వీకరించి నాచు పెరుగుతుంది. ఒక్కో మడి(తేలాడే తెప్ప)లో 30 కిలోలతో నాచు సాగు చేపట్టవచ్చు. 45 రోజుల్లో ఒక క్వింటాల్‌ దాకా పంట చేతికి వస్తుంది. సముద్రం 50 అడుగుల లోతున్న ప్రాంతంలో అలల ఉధృతి తక్కువగా ఉన్న చోట తేలాడే తెప్పలను ఉంచుతారు. ఇవి కదిలిపోకుండా బరువైన రాళ్లు కట్టి కిందకు వదులుతారు. అంటే తెప్పలను లంగరు వేసి స్థిరంగా ఒకే చోట నిలబెట్టినట్లుగా అన్నమాట.

రూ.1.20 లక్షలు ఆదాయం

ప్రస్తుతానికి పదిమంది మహిళలు నాచు సాగు చేపట్టారు. వీరు 45 రోజుల్లో రూ.1.20లక్షలు ఆదాయం పొందారు. సముద్రపు నాచు కిలో రూ.30 వరకు ధర పలుకుతోంది. జిల్లాలో ఉత్పత్తి ఆయిన నాచును ఉత్తర భారతదేశానికి ఎగుమతి చేస్తున్నారు.

ఎందుకీ నాచు?

జపాన్‌, చైనా, కొరియా, థాయిలాండ్‌, వియత్నం, ఇండోనేషియా దేశాలలో రోజువారీ ఆహారంలో ఈ నాచును ఉపయోగిస్తారు. పోషకాల గనిగా దీనిని భావిస్తారు. ఇప్పుడిప్పుడే మన దేశంలోనూ వినియోగం పెరుగుతోంది. బిస్కెట్లు, పాస్తా, న్యూడిల్స్‌, సూప్‌పౌడర్స్‌లో ఈ నాచు ఉపయోగిస్తారు. ఇంకా ఎరువులు, పశువుల దాణాగా కూడా వినియోగిస్తున్నారు. ఔషధాలు, సౌందర్య ఉత్పత్తుల్లోనూ సముద్రపు నాచును ఉపయోగిస్తారు.


కొద్దిపాటి శిక్షణతోనే..: వెంకటేశ్వర్‌, కలెక్టర్‌

కొద్దిపాటి శిక్షణతోనే మహిళలు ఈ సాగు చేపడుతున్నారు. భవిష్యత్తులో సీడ్‌కు గిరాకీ పెరుగుతుంది. తీరప్రాంతం మండలాల్లోని మత్స్యకార మహిళలను ప్రతి ఒక్కరినీ ఇందులో భాగస్వామ్యం చేస్తాం. జిల్లా లో మత్స్యకార కుటుంబాల ఆర్ధికాభివృద్ధికి ఇది బాగా ఉపయోగపడుతుంది.

రెండు మండలాల్లో విజయవంతంగా..: రాజేష్‌, జిల్లా మత్స్యశాఖ అధికారి

నాచు సాగు ప్రస్తుతం రెండు మండలాల్లో విజయవంతంగా నడుస్తోంది. ప్రయోగాత్మకంగా 10 తేలాడే తెప్పల మీద సాగు జరుగుతోంది. దీన్ని 100కి విస్తరించనున్నాం. త్వరలో మరికొన్ని మండలాల్లోనూ సాగు చేస్తాం.

Updated Date - Dec 21 , 2025 | 01:18 AM