Road Accident: రోడ్డు పక్కన్న నిల్చున్న వారిపైకి దూసుకెళ్లిన కారు
ABN , Publish Date - Jun 13 , 2025 | 12:10 PM
Road Accident: చిత్తూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృత్యువాతపడ్డారు. వీరంతా రోడ్డు పక్కన నిలుచున్న సమయంలో అతివేగంగా దూసుకొచ్చిన ఓ కారు వారిని బలంగా ఢీకొట్టింది.

చిత్తూరు, జూన్ 13: రాష్ట్రంలో వరుస ప్రమాదాలతో రోడ్లు నెత్తురోడుతున్నాయి. అతివేగం కారణంగా అనేక మంది రోడ్డు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా చిత్తూరు జిల్లాలో(Chittoor District) జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృత్యువాతపడ్డారు. ప్రమాదం ఏ వైపు నుంచి ముంచుకు వస్తుందో ఎవ్వరూ ఊహించరు. మృత్యువు ఎలా కబలిస్తుందో ఎవరికీ తెలియదు. తాము వెళ్లే దారిలో ప్రమాదం పొంచి ఉందని తెలిస్తే ఎవరు వెళ్తారు చెప్పండి. కానీ అది తెలీదు కాబట్టే ప్రయాణాల్లో చాలా మంది మృత్యువొడిలోకి వెళ్తుంటారు. చిత్తూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. కొందరు వ్యక్తులు రోడ్డు పక్కన నిల్చుని ఉన్నారు. ఈ క్రమంలో ఉన్నట్టుండి ఓ వాహనం దూసుకొచ్చింది. ఏం జరిగిందో ఊహించేలోపు పలువురు రోడ్డుపై చలనం లేకుండా పడి ఉన్నారు.
జిల్లాలోని బంగారుపాలెం మండలం చెన్నై-బెంగళూరు జాతీయ రహదారి తిమ్మోజపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారు ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా రోడ్డు పక్కన నిలుచున్న సమయంలో అతివేగంగా దూసుకొచ్చిన ఓ కారు వారిని బలంగా ఢీకొట్టింది. దీంతో ముగ్గురు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన వారిలో తిమ్మోజిపల్లి గ్రామానికి చెందిన బంగారుపాలెం మండలం టీడీపీ రైతు విభాగం మాజీ అధ్యక్షుడు రాజేందర్ నాయుడు, అదే గ్రామానికి చెందిన వ్యవసాయ శాఖ విస్తరణ అధికారి సాదరయ్య, పలమనేర్‌కు చెందిన సయ్యద్ దిలీప్ ఉన్నారు. ఆరు నెలల పసికందుతో పాటు మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇక.. అనకాపల్లి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి చెందారు. అనకాపల్లి మండలం పిసినికాడ వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు ప్రాణాలు విడిచారు. మృతులు అనకాపల్లి మండలం ఆర్ వి నగర్ ప్రాంతానికి చెందిన వారుగా గుర్తించారు. కసింకోట కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా వెనక నుంచి లారీ ఢీకొట్టింది. దీంతో భార్యాభర్తలు ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనకాపల్లి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి
విమాన ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మోదీ..
తల్లుల ఖాతాల్లోకి నిధులు.. ఆనందంలో కుటుంబాలు
Read Latest AP News And Telugu News