Tata: రతన్‌టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభం
ABN , Publish Date - Aug 21 , 2025 | 01:34 AM
రేణిగుంట సమీపంలోని విమానాశ్రయం దగ్గరున్న ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ డిజిటల్ టెక్నాలజీస్ భవనంలో ఏర్పాటు చేసిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సోక్స్ కేంద్రం అందుబాటులోకి వచ్చింది.
రేణిగుంట, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): రేణిగుంట సమీపంలోని విమానాశ్రయం దగ్గరున్న ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ డిజిటల్ టెక్నాలజీస్ భవనంలో ఏర్పాటు చేసిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సోక్స్ కేంద్రం అందుబాటులోకి వచ్చింది. అమరావతి నుంచి సీఎం చంద్రబాబు బుధవారం మధ్యాహ్నం వర్చువల్‌గా ప్రారంభించారు. కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్వీయూ వీసీ అప్పారావు, జేసీ శుభం బన్సల్, ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువంశీతో కలిసి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి ఇక్కడి సోక్స్ కేంద్రం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. మంగళగిరిలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. యువ పారిశ్రామికులకు, స్టార్టప్ పెట్టాలనుకునే వారికి, మంచి ఆలోచనలుండి మార్గదర్శకత కోసం వేచిచూస్తున్న వారికి రతన్‌టాటా ఇన్నోవేషన్ హబ్ గొప్ప అవకాశంగా మారుతుందన్నారు. గడిచిన 24 గంటల్లో 1600 మంది యువకులు తమ కంపెనీలు ప్రారంభించేందుకు రిజిస్టర్ చేసుకున్నారన్నారు. హబ్ అమరావతిలో ఉంటుందని, విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, అనంతపురం, తిరుపతిలో ఐదు సోక్స్ కేంద్రాలు ఏర్పాటు చేశారని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. తిరుపతి కేంద్రానికి లీడ్ అదానితో పాటు నవయుగ, అమర్ రాజా లీడ్ పార్టనర్లుగాను, ఐఐటీ నాలెడ్జ్ పార్టనర్‌గా ఉందన్నారు. ఇది ప్రభుత్వ, కార్పొరేట్, అకడమిక్ రంగాల సమ్మేళనమన్నారు. అందరూ కలిస్తేనే ఇన్నోవేషన్ సాధ్యమని చెప్పారు. అకడమిక్‌పరంగా యూనివర్సిటీలు.. ఇండస్ట్రీ పరంగా చూస్తే శ్రీసిటీ, మేనకూరు సెజ్ ఉండగా, రౌతుసూరమాల వస్తున్నదన్నారు. క్రిస్ సిటీ, రేణిగుంట విమానాశ్రయం వద్ద ఎలకా్ట్రనిక్ తయారీ క్లస్టర్-1, 2 ఉన్నాయన్నారు. జిల్లాలో మంచి ఇండస్ట్రీ వాతావరణం ఉందని, ఎవరైనా ఎంటర్‌ప్రెన్యూర్ కావడానికి గొప్ప అవకాశమని పేర్కొన్నారు.
తిరుపతితో పాటు చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాలవారూ ఈ కేంద్రాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మత్స్యశాఖ, సెన్సార్ సింక్ ఇన్నోవేషన్, కేతన టెక్ బీస్, ఆటో కంపోసైట్స్ పైవ్రేట్ లిమిటెడ్, ఫోక్స్ లింక్, కార్బన్ సెల్స్, మనోడ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, పైపర్ పిక్సెల్ రోబోటిక్ పైవ్రేట్ లిమిటెడ్, మైండ్ ట్రానిక్స్, జుమాంజి బాక్స్, రోబో మాక్ ఎన్జీఈఎన్ వాటర్ సొల్యూషన్స్, కోకో మంత్రా, ఎనర్జీ ఎఫిషియన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఫ్రెండ్లీ ఫోరం, ఏఈడీఏఏ ఎక్విప్మెంట్ పైవ్రేట్ లిమిటెడ్, పలియో జ్యూస్ సంస్థల స్టాళ్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఆర్డీవో భానుప్రకాష్ ఇన్‌చార్జి ఎంపీడీవో ప్రభురావు, తహసీల్దారు చంద్రశేఖర్ రెడ్డి, ఎస్వీయూ కల్చరల్ కోఆర్డినేటర్ వివేక్ చౌదరి, ప్రజాప్రతినిధులు, ఆయా పరిశ్రమల యాజమాన్యాలు, అధికారులు పాల్గొన్నారు.