Rapid kits: ర్యాపిడ్ కిట్లు వచ్చేశాయ్
ABN , Publish Date - Oct 31 , 2025 | 01:20 AM
పేదలకు చెందాల్సిన ఉచిత రేషన్ బియ్యాన్ని కొందరు పక్కదారి పట్టిస్తున్నారు. పాలిష్ చేసి మార్కెట్లో అత్యధిక ధరలకు విక్రయిస్తున్నారు. దీనికి చెక్‌పెట్టే దిశగా ప్రభుత్వం అత్యాధునిక విధానానికి శ్రీకారం చుట్టింది.
తిరుపతి(నేరవిభాగం), అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): పేదలకు చెందాల్సిన ఉచిత రేషన్ బియ్యాన్ని కొందరు పక్కదారి పట్టిస్తున్నారు. పాలిష్ చేసి మార్కెట్లో అత్యధిక ధరలకు విక్రయిస్తున్నారు. దీనికి చెక్‌పెట్టే దిశగా ప్రభుత్వం అత్యాధునిక విధానానికి శ్రీకారం చుట్టింది. రేషన్ బియ్యం అక్రమ రవాణాను శీఘ్రమైనంత త్వరగా కట్టడిచేసేలా చర్యలు చేపట్టింది. తిరుపతి సహా పలు ప్రాంతల్లో నగరంలో రెండు నెలలకు ఒకసారి కొందరు మహిళలు వచ్చి కిలో రూ.10 నుంచి రూ 12 వంతున రేషన్ బియ్యం కొంటున్నారు. వీటిని మిల్లర్లకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇలా జిల్లా వ్యాప్తంగా లక్షలాది రూపాయల పేదల బియ్యం మిల్లర్లకు చేరి పాలి్‌ష్డగా మారి.. మార్కెట్లోకి వస్తున్నాయి. అక్రమ రవాణాపై గతంలో అధికారులు తనిఖీ చేసినా.. ఆ బియ్యం రేషన్ షాపువేనని అనుమానిస్తే వాటిని ల్యాబ్‌కు పంపేవారు. పరీక్షలు చేశాకే రేషన్ బియ్యంపై నిర్ధారణకు వచ్చేవారు. ఆ తర్వాత చర్యలు తీసుకునేవారు. ఈ ప్రక్రియ ఆలస్యమయ్యేది. మరిప్పుడు వెంటనే రేషన్ బియ్యాన్ని గుర్తించేలా జిల్లాకు 30 రాపిడ్ కిట్లు పంపింది. వీటిని తిరుపతి నగరం, రూరల్, శ్రీకాళహస్తి, చంద్రగిరి, నాయుడుపేట ప్రాంతాలకు కేటాయించారు. ఈ కిట్లలో పొటాషియం థయో సైనైడ్, హైడ్రో క్లోరిక్ యాసిడ్ ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న పోర్టిఫైడ్ రైస్ అయితే.. ఈ ద్రావణాలను ఆ బియ్యంపై చల్లిన వెంటనే ఎరుపు రంగుకు మారతాయి. బయట దుకాణాల్లో విక్రయించే బియ్యమైతే రంగు మారవు. ఆ వెంటనే బియ్యాన్ని సీజ్ చేయడానికి వీలవుతుంది. ఎక్కడైనా అనుమానాలుంటే ఈ కిట్లతో పరీక్షిస్తే అది రేషన్ బియ్యమా కాదా అనేది క్షణాల్లో తేలిపోతుంది. ఇలా అక్రమ రవాణాకు చెక్ పెట్టేదిశగా ప్రభుత్వం పటిష్ఠ చర్యలు తీసుకుంది.